Devotional

కుంభమేళ నుండి తిరిగి వస్తూ 8మంది హైదరాబాదీలు మృతి-NewsRoundup-Feb 11 2025

కుంభమేళ నుండి తిరిగి వస్తూ 8మంది హైదరాబాదీలు మృతి-NewsRoundup-Feb 11 2025

* సినీ నటుడు షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko) సహా మరో ఆరుగురిని నిర్దోషిగా తేలుస్తూ మంగళవారం కేరళ కోర్టు తీర్పు వెలువరించింది. 2015లో ఓ ఫ్లాట్‌లో కొకైన్‌ స్వాధీనం (2015 drug case) చేసుకున్న పోలీసులు దానికి సంబంధించిన కేసులో చాకో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన సినిమాల్లో నటిస్తున్నారు. మరోవైపు కోర్టులో కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఎర్నాకుళం ఫస్ట్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్ అండ్‌ సెషన్స్‌ కోర్టులో ఈ రోజు విచారణ జరగ్గా, కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ సులేఖ.. నటుడు చాకో సహా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించారు. ఇందులో నలుగురు మహిళలు ఉండటం గమనార్హం. వీరితో పాటు ఓ నైజీరియన్‌, తమిళనాడుకు చెందిన పృథ్వీరాజ్‌ అనే వ్యక్తి కూడా ఉన్నారు.

* ఓ హాస్య కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారంపై ప్రశ్నించిన ప్రముఖ యూట్యూబర్ రణవీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వీడియోను యూట్యూబ్ (YouTube) తొలగించింది. సమాచార, మంత్రిత్వశాఖ నుంచి ఆ సంస్థకు నోటీసులు అందడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

* హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల గాయపడిన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న ఆమె తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో జీవిత భాగస్వామి గురించి పంచుకున్నారు. అలాగే ఇటీవల అయిన గాయం నుంచి నేర్చుకున్న విషయాలను వివరించారు.

* రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) ఇప్పటికే పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఉక్రెయిన్‌ (Ukraine) ఏదొకరోజు రష్యా (Russia)లో భాగం కావొచ్చు.. కాకపోవచ్చు అని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారు (రష్యా- ఉక్రెయిన్‌లను ఉద్దేశిస్తూ) ఒప్పందం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు. ఉక్రెయిన్‌లు రష్యన్లు కావొచ్చు.. కాకపోవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా ఉక్రెయిన్‌తో 500 మిలియన్‌ డాలర్ల డీల్‌తో పాటు అరుదైన ఖనిజాల వినియోగం అంశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్‌ను త్వరలో కీవ్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) వచ్చేవారం మ్యానిచ్‌లో జెలెన్‌స్కీతో భేటీ అవుతారని అక్కడి అధికారి తెలిపారు.

* ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా (Kumbh Mela)కు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో జరిగిన ఈ ఘటన (Road Accident)లో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మృతులను హైదరాబాద్‌లోని నాచారం వాసులుగా గుర్తించారు. జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిమెంట్‌ లోడ్‌తో వెళ్తోన్న లారీ హైవే పైకి రాంగ్‌ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మినీ బస్సులో చిక్కుకున్న మరికొందరు యాత్రికులను స్థానికులు కాపాడి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నారు. క్షతగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వాహనం నంబరు AP29 W 1525గా గుర్తించారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్‌ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

* పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మండిపడ్డారు. ఆ కుతంత్రాలను గులాబీ దండు అడ్డుకుంటుందన్నారు. ఖమ్మం జిల్లాలో 2014 తర్వాత భారాస ప్రభుత్వం అసాధారణ అభివృద్ధి చేసిందని, పువ్వాడ అజయ్‌ వంటి మంచి నాయకుడు ఓడిపోవడం బాధాకరమని అన్నారు. హైదరాబాద్‌లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ నివాసంలో జరిగిన ఖమ్మం జిల్లా భారాస నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి కేటీఆర్‌ హాజరయ్యారు.

* ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లకు ( Electronic Voting Machines) సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారంటూ సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం ఎన్నికల సంఘాన్ని (EC) ప్రశ్నించింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలలో డేటాను తొలగించరాదంటూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంలో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్‌(ADR) దాఖలు చేసింది. ‘‘ఈవీఎంలలో డేటాను తొలగించకూడదు. కొత్తగా జోడించకూడదు. వాటిని పరిశీలించాల్సి ఉంది’’ అని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో వెల్లడిస్తూ.. 15 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

* జగన్‌ ప్రభుత్వం మద్యం డిపోలను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో రూ.12వేల కోట్లు చెల్లింపులు చేశామని, మరో రూ.13వేల కోట్లు చెల్లించాల్సి ఉందని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ‘‘వైకాపా హయాంలో పెద్ద ఎత్తున మద్యం అక్రమాలు జరిగాయి. జగన్‌ ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నాం.

* వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్‌ స్కామ్‌పై విచారణ జరపాలని అనకాపల్లి భాజపా ఎంపీ సీఎం రమేశ్‌ (CM Ramesh) డిమాండ్‌ చేశారు. మద్యం అంశంపై లోక్‌సభ (Lok Sabha) జీరో అవర్‌లో సీఎం రమేశ్‌ ప్రస్తావించారు. వైకాపా హయాంలో దిల్లీని మించిన లిక్కర్‌ స్కామ్‌ జరిగిందని ఆరోపించారు. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో పోలిస్తే జగన్‌ స్కామ్‌ పదిరెట్లు పెద్దదన్నారు. ‘‘2019-24 మధ్య ఏపీలో మద్యం విధానం మార్చారు. మద్యాన్ని ప్రైవేటు షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారు. ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఐదేళ్ల పాటు మద్యం లావా దేవీలు నగదుతోనే జరిగాయి. మద్యం షాపుల సిబ్బందినీ ఒప్పంద పద్ధతిలోనే నియమించారు. రూ.2,500 కోట్ల దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కంటే ఏపీలో పదిరెట్లు పెద్ద స్కామ్‌ జరిగింది’’ అని సీఎం రమేశ్‌ ఆరోపించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z