Politics

తెలంగాణలో ఆలస్యంగా ఎన్నికలు-NewsRoundup-Feb 12 2025

తెలంగాణలో ఆలస్యంగా ఎన్నికలు-NewsRoundup-Feb 12 2025

* దేశీయ భద్రత, డేటా గోప్యతపై ఆందోళన కారణంగా నిషేధించిన చైనా యాప్‌లు తిరిగి భారత్‌లోకి వచ్చేశాయి. యాప్‌ల పేర్లు, వెర్షన్లు మార్చి మళ్లీ విడుదలయ్యాయి. ఆ యాప్‌లలో కొన్నింటికి యాజమాన్య హక్కులు మారగా.. మరికొన్ని చైనా కంపెనీలుగానే కొనసాగుతున్నట్లు సమాచారం. భద్రతా సమస్యల కారణంగా 2020లో దాదాపు 267 చైనా యాప్‌(Chinese apps)లపై భారత్‌ నిషేధం విధించింది. సరిహద్దులోని గల్వాన్‌ వద్ద భీకర ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్‌ ఈ చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ యాప్‌ల పేర్లు, వెర్షన్లు మార్చి తిరిగి భారత్‌లో విడుదలయ్యాయి. గతంలో నిషేధించిన యాప్‌లలో 36 అప్లికేషన్లు తిరిగి భారత్‌లోకి వచ్చాయి. వాటిలో కొన్ని బ్రాండింగ్‌, లోగోల్లో చిన్న మార్పులు చేసి తీసుకొచ్చారు. వీటిలో ఫైల్‌- షేరింగ్‌ సర్వీస్‌ Xender, స్ట్రీమింట్‌ ప్లాట్‌ఫామ్‌ మ్యాంగో టీవీ, షాపింగ్‌ యాప్‌ టావోబావో, డేటింగ్‌ యాప్‌ టాన్‌టాన్‌, షాపింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫైల్‌ షేరింగ్‌, కంటెంట్‌ క్రియేషన్‌కు చెందిన అప్లికేషన్లు ఉన్నాయి. ఈ యాప్‌లన్నీ ఇప్పుడు గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లలో డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉన్నాయి.

* ప్రధాని మోదీ (PM Modi) అమెరికా పర్యటన వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. అమెరికాలో నక్కి.. భారత్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌స్టర్లను తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నాలను వేగవంతం చేయనుంది. దీనిలో భాగంగా సిద్ధం చేసిన గ్యాంగ్‌స్టర్ల జాబితాను అగ్రదేశానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు భద్రతా ఏజెన్సీలు ఓ నివేదిక రూపొందించాయని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ సహా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వాంటెడ్ జాబితాలో ఉన్న గ్యాంగ్‌స్టర్ల పేర్లు ఆ నివేదికలో ఉన్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఇది రూపొందింది. విదేశాల్లో ఉంటున్న నేరగాళ్ల జాబితా కేంద్ర సంస్థల వద్ద ఇప్పటికే ఉంది. అయితే కొన్ని వారాల క్రితం ప్రత్యేకించి యూఎస్ కేంద్రంగా ఉన్న వారి జాబితాను సిద్ధం చేయాలని మంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం.

* బ్రహ్మానందం (Brahmanandam) కూడా తన తల్లిదండ్రుల గురించి చెప్పారు. ‘‘మా అమ్మానాన్నల గురించి చెప్పడం అంటే దేవుడి గురించి చెప్పడమే. నా తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఒకవైపు పేదరికం.. మరోవైపు పెద్దరికాన్ని పంచుకొని జీవించారు. వాళ్లు నా తల్లిదండ్రులని చెప్పడానికి చాలా గర్వపడుతుంటా. మా నాన్న నాకు ఒక మాట చెబుతుండేవారు.. ‘ఒక మనిషి 18 రోజులు భోజనం చేయకపోతే చనిపోతాడు. 17 రోజుల వరకు ఎవరి దగ్గర చేయి చాచొద్దు. 18వ రోజు తప్పదు అనుకుంటే ఎవరినైనా సాయం అడుగు’ అని చెప్పేవారు. నేను ఇప్పటికీ అదే అనుసరిస్తాను. నా జీవితంలో అప్పు ఎరుగను’’ అని చెప్పారు.

* మక్కల్‌ నీది మయ్యం (MNM) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan) పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే ఆయన్ను రాజ్యసభకు నామినేట్‌ చేయనుందంటూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బుధవారం నటుడి నివాసానికి రాష్ట్రమంత్రి పీకే శేఖర్ బాబు వెళ్లడంతో ఈ ప్రచారం మొదలైంది.

* తెలంగాణలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వివిధ కారణాల వల్ల కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈనెల 16 నుంచి 28 వరకు సర్వే సిబ్బందికి వివరాలు అందజేయాలని సూచించారు. రాష్ట్ర జనాభా లెక్కల్లోకి వచ్చే విధంగా అందరూ చూసుకోవాలని కోరారు.

* తెలంగాణలో ఈనెల 15వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుందని భావించారు. కానీ, స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోసారి కులగణన సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వేలో పాల్గొనని వారికి ఈనెల 16 నుంచి 28 వరకు అవకాశం కల్పించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.

* న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేయని కామేపల్లి తులసిబాబును సీఐడీ కేసుల్లో లీగల్‌ అసిస్టెంట్‌గా నియమించి రూ.48లక్షలు చెల్లించడంపై విచారణ కోసం ఏసీబీకి లేఖ రాయనున్నట్టు ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తెలిపారు. తనపై జరిగిన కస్టోడియల్‌ టార్చర్‌ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట 164 స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు ఆయన బుధవారం గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు.

* కోటి మందికిపైగా తెదేపా సభ్యత్వం తీసుకున్నారని ఆ పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు అండమాన్‌ నికోబార్‌లోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోందన్నారు. మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రమంత్రులతో చర్చిస్తూ రాష్ట్రాభివృద్ధికి లోకేశ్‌ కృషి చేస్తున్నారని చెప్పారు.

* ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘2019-24 మధ్య జగన్‌ 1.0 ప్రభుత్వం నడిచింది. ఆ టైంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచింది. లంచాలకు తావు లేకుండా రూ. 2.71 లక్షల కోట్లు డీబీటీ చేశాం. కోవిడ్‌ వల్ల ఆదాయం తగ్గినా హామీలు అమలు చేశాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం. కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశాం. మనం చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉంది. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారు. బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. మన హయాంలోని పథకాలన్నీ రద్దు చేశారు. చంద్రబాబు చెప్పిన ప్రతి పథకం.. అబద్ధం, మోసం.

* చంద్రబాబు చేసేది రాజకీయం కాదని.. బ్రోకరిజం అంటూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆడపిల్లల కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి కనపఢం లేదని దుయ్యబట్టారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబుని మనిషిగా కూడా తాను గుర్తించటం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు వలన ఎల్లో మీడియా.. ఎల్లో మీడియా వలన చంద్రబాబు బతుకుతున్నారు. వీరి వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగదంటూ ఆమె వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబుకు తన పాలన మీద నమ్మకం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలి. జనం ఎవరికి ఓట్లు వేస్తారో తేలుతుంది. లక్షన్నర కోట్లు అప్పులు చేసి ఏం చేశారు?. మీ జేబుల్లోకి వెళ్లాయా?. ప్రజలను పూర్తిగా మద్యం మత్తులోకి నెట్టేశారు, జనాన్ని మత్తులో పెట్టి పరిపాలన చేస్తున్నారు. రేషన్ డిపోలను టీడీపీ ఆఫీసుల్లో నిర్వహించటం ఈ పాలనలోనే చూస్తున్నాం. చంద్రబాబు పాలనలో రేపిస్టులు, దొంగలు కాలర్ ఎగురవేసుకుని తిరుగుతున్నారు. తిరుపతి లక్ష్మికి ఒక న్యాయం, ముంబాయి నటి జత్వానీకి ఇంకో న్యాయమా?’’ అంటూ లక్ష్మీపార్వతి నిలదీశారు.

* కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. 2022 డిసెంబర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యాన్ని అవమానపర్చేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని ఆర్వోబీ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ కోర్టును ఆశ్రయించారు. ఉదయ్ శంకర్ తరుఫున న్యాయవాది వివేక్ తివారీ లక్నో కోర్టులో రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ప్రకటనలు భారత సైన్యాన్ని అవమానపర్చే విధంగా ఉన్నాయని.. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దావాపై లక్నో కోర్టు బుధవారం ( ఫిబ్రవరి 12) విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎంపీ రాహుల్ గాంధీకి న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణకు సంబంధించి 2025, మార్చి 24న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని రాహల్ గాంధీని ఆదేశించింది కోర్టు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z