* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో రూ.50 నోట్లను జారీ చేయనుంది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ఈ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం చాలా వరకు నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ పేరుతో ప్రింట్ అయినవే సర్క్యులేషన్‌లో ఉన్నాయి. ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రా గతేడాది డిసెంబర్‌లో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మహాత్మ గాంధీ సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను జారీ చేయాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ బుధవారం తెలిపింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న పాతనోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్‌బీఐ పేర్కొనింది.
* ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఉద్యోగులకు త్వరలో తీపి కబురు చెప్పనుంది. అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును (Salary hike) ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించి ఈ నెల ముగిసేలోగా ఉద్యోగులకు వేతన పెంపునకు సంబంధించిన లేఖలు జారీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయని ‘మనీకంట్రోల్’ తెలిపింది. ఈ వేతన పెంపు 5-8 శాతం మధ్య ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఇటేవల వెల్లడించిన మూడో త్రైమాసిక ఫలితాల సందర్భంగానూ 6 -8 శాతం వార్షిక వేతన పెంపు ఉండొచ్చని కంపెనీ సీఎఫ్‌ఓ జయేశ్ సంఘ్‌రాజ్‌కా వెల్లడించారు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ సూచీలు నష్టపోయాయి. ఓ దశలో సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ 76 వేలు, నిఫ్టీ 23 వేల దిగువకు చేరాయి. అయితే, మళ్లీ అంతే స్థాయిలో సూచీలు బలంగా పుంజుకోవడం, స్వల్ప నష్టాలకే సూచీలు పరిమితం కావడం మదుపర్లకు ఊరటనిచ్చే అంశం. రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ షేర్లు సూచీలపై ఒత్తిడి పెంచగా.. హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 76,188.24 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,293.60) నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంది. ఓ దశలో దాదాపు 900 పాయింట్ల నష్టంతో 75,388.39 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. అంతే బలంగా పుంజుకొని 76,459 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 122.52 పాయింట్ల నష్టంతో 76,171.08 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.80 పాయింట్ల నష్టంతో 23,044 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు బలహీన పడి 86.88 వద్ద ముగిసింది.
* ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. వాలైంటైన్స్ డే సేల్‌ను తీసుకొచ్చింది. టికెట్ల బుకింగ్‌పై 50 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇద్దరు ప్రయాణికులకు కలిపి బుక్ చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 16 వరకు చేసే బుకింగ్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. బుకింగ్ తేదీకి, ప్రయాణ తేదీకి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలని పేర్కొంది. ఇండిగో వెబ్‌సైట్, మొబైల్ యాప్, ఇండిగో 6ఈ skai ఏఐ చాట్‌బాట్, ఎంపిక చేసిన ట్రావెల్ పార్ట్‌నర్స్ వేదికగా బుక్ చేసినప్పుడు ఈ ఆఫర్ పొందొచ్చని కంపెనీ తెలిపింది. టికెట్ ధరతో పాటు ప్రయాణికులు ట్రావెల్ యాడ్ ఆన్స్‌పైనా డిస్కౌంట్లు పొందొచ్చని కంపెనీ తెలిపింది. అదనపు బ్యాగేజీపై ముందస్తు బుకింగ్‌పై 15 శాతం, సీట్ల ఎంపికపై 15 శాతం, ముందస్తుగా బుక్ చేసే మీల్స్‌పైనా 10 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తామని ఇండిగో తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z