* అమెరికాలో కోడిగుడ్ల ధరలు (Egg Prices) విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల వీటి ధరలు 15శాతం పెరగ్గా.. ఈ ఏడాదిలో మరో 20శాతం పెరిగే అవకాశాలున్నట్లు అంచనా. దేశవ్యాప్తంగా వీటి లభ్యత (Eggs Shortage) భారీగా తగ్గడమే ఇందుకు కారణం. అనేక స్టోర్లలో ‘లిమిటెడ్ స్టాక్’ బోర్డులే కనిపిస్తుండగా.. కొన్ని చోట్ల ‘నో ఎగ్స్’ బోర్డులు దర్శనమిస్తుండటం గమనార్హం. దీంతో గుడ్ల విక్రయంపై పరిమితి విధిస్తున్న స్టోర్లు ఒక్కరికి గరిష్ఠంగా రెండు, మూడు ట్రేలు మాత్రమే ఇస్తున్నాయి. అమెరికాలో కొంతకాలంగా బర్డ్ ఫ్లూ (Bird Flu) వ్యాప్తి పెరిగింది. దీంతో గతేడాది ఒక్క డిసెంబర్‌లోనే సుమారు 2.3కోట్ల కోళ్లను వధించినట్లు అమెరికా వ్యవసాయశాఖ గణాంకాలు పేర్కొన్నారు. ఒహాయో, మిస్సౌరీలలో దీని ప్రభావం అధికంగా కనిపిస్తోంది. అమెరికా లేబర్ బ్యూరో లెక్కల ప్రకారం.. గతేడాది జనవరిలో డజను కోడిగుడ్ల ధర 2.52డాలర్లుగా ఉండగా.. డిసెంబర్ నాటికి అది $4.15లకు పెరగగా, ఇప్పుడది 7.34 డాలర్లుకు చేరింది. రానున్న రోజుల్లోనూ మరింత ప్రియమయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
* జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు హోండా, నిస్సాన్ విలీనానికి బ్రేక్ పడింది. తమ వ్యాపారాలను విలీనం చేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఇరు కంపెనీలు గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. విలీన చర్చలపై ముందుకెళ్లకూడదని ఇరు సంస్థల బోర్డులు నిర్ణయించాయని పేర్కొన్నాయి. దీంతో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఒకటి అవతరించబోతోందన్న అంచనాలకు ఆదిలోనే బ్రేక్ పడింది.
* సెలవుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ ప్రకటన చేసింది. మార్చి 31న బ్యాంకు సెలవు రద్దు (March 31 bank holiday) చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో అన్ని లావాదేవీలు అదే రోజు నమోదు అయ్యేలా చూసేందుకు దానిని రద్దు చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దాంతో పాత సంవత్సరం ముగింపు రోజే ప్రభుత్వ ఆదాయం, చెల్లింపులు పూర్తవ్వాలి. అందుకే ఆ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు విధులు నిర్వర్తించేలా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ వంటి ప్రభుత్వ పన్ను చెల్లింపులు, పెన్షన్ చెల్లింపులు, ప్రభుత్వ సబ్సిడీలు, జీతభత్యాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లావాదేవీలు చేసుకోవడానికి వీలుఉంటుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో ఈ ఉదయం సూచీలు రాణించాయి. వరుస నష్టాల నుంచి ఊరట లభించందనుకుంటున్న తరుణంలో గురువారం ఎఫ్‌అండ్‌ఓ వీక్లీ ఎక్స్‌పైరీ ఉండడం, అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో మళ్లీ సూచీలు వెనక్కి మళ్లాయి. దీంతో వరుసగా ఏడో రోజూ సూచీలు నష్టాలకే పరిమితం అయ్యాయి. సెన్సెక్స్ ఉదయం 76,201.10 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,171.08) వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో దాదాపు 600 పాయింట్ల మేర లాభపడి 76,764.53 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆఖర్లో మళ్లీ అమ్మకాల ఒత్తిడి కారణంగా 32.11 పాయింట్ల నష్టంతో 76,138.97 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 13.85 పాయింట్ల నష్టంతో 23,031.40 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 3 పైసలు బలపడి 86.92 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, జొమాటో షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.30 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2941.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
* ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. దీనిలో భాగంగా ఆదాయపు పన్ను (ఐటీ) నూతన బిల్లు (New Income Tax Bill 2025) పార్లమెంటు ముందుకు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్యే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం కాసేపటికే లోక్‌సభ మార్చి 10కి వాయిదా పడింది. ఈ బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి పంపనున్నారు.
* తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉందని, ఆ తర్వాతే అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపట్లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
* ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ సరికొత్త ఏఐ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఏఐ రంగంలో కొత్తగా రూ.15వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో 1.2లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇచ్చేందుకు మూడు కొత్త కార్యక్రమాలను ప్రారంభించనున్నది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z