* ప్రయాగ్ రాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహాకుంభమేళాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబసమేతంగా వెళ్లారు. అక్కడ తన సతీమణి, కుమారుడితో కలిసి పుణ్య స్నానం ఆచరించారు. పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు.
* శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పేరుకునే తీరును అర్థం చేసుకోవటంలో శాస్త్రవేత్తలు గొప్ప పురోగతి సాధించారు. ఎల్డీఎల్ ప్రధాన ప్రొటీన్ దాని గ్రాహకానికి అంటుకోవటం ద్వారా అది రక్తంలోంచి బయటకు వెళ్లే ప్రక్రియ మొదలవుతుంది. ఇది గ్రాహకానికి ఎలా అంటుకుంటుందో, ఈ ప్రక్రియ మందగిస్తే ఏమవుతుందో అనే విషయాలను శాస్త్రవ్తేతలు తొలిసారి ప్రదర్శించారు. గుండెజబ్బుకు ఎల్డీఎల్ కారణమవుతున్న విధానాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవటానికే కాకుండా ఆయా వ్యక్తులకు తగినట్టుగా కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులను సూచించటానికీ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 33 సెకండ్లకు ఒకరు గుండెజబ్బుతో మరణిస్తున్నారు. దీని ప్రధాన ముప్పు కారకాల్లో చెడ్డ కొలెస్ట్రాల్ ఒకటి. ఇది ఎల్‌డీఎల్‌ఆర్ అనే గ్రాహకంతో కలిసేటప్పుడు ఏమవుతుందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. సాధారణంగా ఈ ప్రక్రియతోనే రక్తంలోంచి ఎల్డీఎల్ బయటకు వెళ్లటం మొదలవుతుంది. కానీ జన్యు మార్పులు దీన్ని అడ్డుకునే అవకాశముంది. ఫలితంగా రక్తంలో ఎల్డీఎల్ మోతాదులు పెరుగుతాయి. ఎల్డీఎల్ చాలా సంక్లిష్టమైంది. క్రయో-ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ అనే అత్యాధునిక టెక్నాలజీ సాయంతో శాస్త్రవేత్తలు ఇప్పుడు దీన్ని అత్యంత స్పష్టంగా చూడటంలో విజయం సాధించారు. ఇది ఎల్డీఆర్ఎల్ గ్రాహకంతో కలిసేటప్పుడు ఏం జరుగుతుందో వీక్షించగలిగారు. అనంతరం కృత్రిమ మేధతో కూడిన ప్రొటీన్ అంచనా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి పరిశీలించారు. ఎల్డీఎల్ మోతాదులు పెరగటానికి కారణమయ్యే జన్యుమార్పులనూ గుర్తించగలిగారు.
* తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. కోర్టు హాలులో న్యాయవాది కుప్పకూలిన ఘటన తోటి న్యాయవాదులను కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. న్యాయవాది వేణుగోపాలరావు 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూప్పకూలారు. గమనించిన తోటి న్యాయవాదులు వెంటనే అతన్ని అంబులెన్స్‌లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వేణుగోపాలరావు గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. న్యాయవాది మృతికి సంతాప సూచకంగా 21వ కోర్టులో పిటిషన్ల విచారణను న్యాయమూర్తి నిలిపివేశారు. మిగతా కోర్టుల్లోనూ అత్యవసర పిటిషన్లు, పాస్ ఓవర్ పిటిషన్లను విచారించి.. రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు.
* అమెరికా(USA)లో వందల ఏళ్ల వయసున్న వ్యక్తులు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు. వారిలో 200 ఏళ్ల వయసు దాటినవారు రెండు వేల మందికిపైగా ఉన్నారట..! ఇక 360-369 ఏళ్ల వయసున్న వ్యక్తి ఒకరున్నారు. ఈ విషయాన్ని అక్కడి సోషల్ సెక్యూరిటీ డేటా విభాగం చెబుతోంది. ఈవిషయాన్ని డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషీయెన్సీ) బృందం ధ్రువీకరించింది. తాజాగా దాని అధిపతి ఎలాన్ మస్క్ దీనిని ఎక్స్‌లో వెల్లడించారు. వందేళ్లు దాటిన దాదాపు 2 కోట్ల మంది ఇప్పటికీ సోషల్ సెక్యూరిటీ లబ్ధికి అర్హుల జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి సోషల్ సెక్యూరిటీ అర్హుల జాబితా సంఖ్య అమెరికాలో ప్రస్తుత పౌరుల సంఖ్య కంటే అధికంగా ఉందని వెల్లడించారు. చరిత్రలోనే ఇది అతిపెద్ద మోసమని పేర్కొన్నారు. వాస్తవానికి 2023లో సోషల్ సెక్యూరిటీ ఆడిట్లో దాదాపు 18.9 మిలియన్ల మంది వందేళ్లు దాటిన వారున్నట్లు గుర్తించారు. వారు ఆదాయం పొందడం లేదా.. లబ్ధిలను స్వీకరించడం కానీ, చేయడం లేదు. అయినా ఆ జాబితాను సవరించలేదు.
* అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. అనేక శాఖల్లో ఉద్యోగాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం తాత్కాలికంగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE)లో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్ష కార్యాలయం (White House) మరోసారి క్లారిటీ ఇచ్చింది. డోజ్‌లో మస్క్ ఉద్యోగి కాదు. అధిపతి కాదు. ట్రంప్ సలహాదారుడిగా ఆ బాధ్యత చూస్తున్నాడు. ఆయనకు ఎటువంటి నిర్ణయాధికారాలు లేవని స్పష్టం చేసింది.
* పశ్చిమ బెంగాల్(West Bengal) అసెంబ్లీ వేదికగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) భాజపా ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. బంగ్లాదేశ్ ఛాందసవాదులతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. బంగ్లాదేశ్ ఛాందసవాదులతో చేతులు కలిపారంటూ భాజపా ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో దీదీ మాట్లాడుతూ.. భాజపా తీరుపై విరుచుకుపడ్డారు.
* ‘ఇండియాస్ గాట్ లాటెంట్’(IGL) కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) పై సుప్రీంకోర్టు (Supreme Court) అసహనం వ్యక్తంచేసింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా..? ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..? మీ మెదడులోని చెత్తనంతా ఆ ప్రోగ్రామ్ ద్వారా బయటపెట్టారు. ఇలాంటి ప్రవర్తన ఖండించదగినది. మీరు పాపులర్ అని చెప్పి, ఏదైనా మాట్లాడతా అంటే సమాజం ఆమోదించదు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా..? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి’’ అని సుప్రీం ప్రశ్నించింది. రణ్వీర్ను తీవ్రంగా మందలించిన కోర్టు.. ఆ తర్వాత ఊరట కల్పించింది. ఇక ఈ వ్యవహారంలో మరో పోలీసు కేసు నమోదు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లే ప్రయత్నాలు చేయొద్దని రణ్వీర్ను హెచ్చరించింది. అలాగే యూట్యూబర్ తన పాస్‌పోర్టును మహారాష్ట్రలోని ఠాణె పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి షోలు చేయకూడదని తేల్చిచెప్పింది.
* కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. ఏపీ ప్రభుత్వం కృష్ణాజలాలను అక్రమంగా తరలిస్తోందని, కేంద్రం అడ్డుకోవాలన్నారు. జయపురలో కేంద్ర జలశక్తిశాఖ ఆధ్వర్యంలో జరిగిన నీటిపారుదలశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్..నీటి నిల్వ సదుపాయాలు, నీటి సరఫరా నిర్వహణపై ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కోరారు. 55 కిలోమీటర్ల పొడవునా చేపడుతున్న మూసీ పునరుజ్జీవ, అభివృద్ధి ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వాలని.. గంగా, యమునా పునరుద్ధరణ తరహాలో మూసీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రి అన్నారు. మూసీ వెంట ట్రంక్, సీవరేజ్ నెట్ వర్క్ కోసం రూ.4వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు గోదావరి జలాలను తరలించే పనులకు రూ.6వేల కోట్లు ఇవ్వాలని కోరారు.
* అమెరికా-రష్యా దౌత్యవేత్తల మధ్య సౌదీ అరేబియా వేదికగా జరిగిన చర్చల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. రెండు దేశాల్లో రాయబార కార్యాలయాల్లో సిబ్బంది పునరుద్ధరణ, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా అవసరమైన చర్చల కోసం ఉన్నతస్థాయి బృందాల ఏర్పాటుతోపాటు ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, ఆర్థిక సహకారం కోసం మార్గాల అన్వేషణకు ఇరు దేశాలూ అంగీకరించాయి. అయితే, డొనాల్డ్ ట్రంప్, పుతిన్‌ల భేటీ ఉంటుందా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రాలేదు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా అధికారిక చర్చలు మొదలయ్యాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని దిర్హియా ప్యాలెస్ ఈ చర్చలకు వేదికైంది. అమెరికా-రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లావ్రోవ్లు పాల్గొన్నారు. భేటీ అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మీడియాతో మాట్లాడుతూ.. మూడు ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగిందన్నారు. యుద్ధం ముగింపు మార్గాలను అన్వేషించేందుకు అవసరమైన చర్చల కోసం వీలైనంత త్వరలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుకు రెండు దేశాలు అంగీకరించాయని చెప్పారు.
* సివిల్ సర్వీసెస్ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ(UPSC) మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఫిబ్రవరి 21వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE) 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ తొలుత ఫిబ్రవరి 11తో ముగియగా.. అధికారులు ఆ గడువును 18వ తేదీ వరకు పొడిగించారు. ఆ గడువు సైతం నేటితో ముగియడంతో ఫిబ్రవరి 21వరకు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
* అంకుర సంస్థల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో బ్రెజిల్‌కు చెందిన గోయాస్ హబ్‌తో టీహబ్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఏఐ, అగ్రిటెక్, ఐటీ, హెల్త్‌కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా రాష్ట్రానికి చెందిన స్టార్టప్‌లకు బ్రెజిల్లో, బ్రెజిల్‌కు చెందిన స్టార్టప్‌లకు హైదరాబాద్‌లో అవకాశాలు లభించనున్నాయి.
* నగరంలో రాత్రి వేళ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ఈనెల 9న రాత్రి శంషాబాద్ సమీపంలో కొందరు యువకులు ఓఆర్ఆర్పై కార్లతో ప్రమాదకరంగా స్టంట్లు చేసి ఇతరులను భయాందోళనకు గురిచేశారు. సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. లగ్జరీ కార్లతో స్టంట్లు చేసిన యువకులు అబ్దుల్లా, సిద్ధిక్‌గా గుర్తించి మంగళవారం అరెస్టు చేశారు. రెండు లగ్జరీ కార్లను శంషాబాద్ పోలీసులు సీజ్ చేశారు.
* ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు (Kumbh Mela) ఊహించని రీతిలో భక్తులు తరలివెళ్తున్నారు. మంగళవారం సాయంత్రానికి 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంలో ఇంత భారీగా జనం పాల్గొనలేదని పేర్కొంది. దేశ విదేశాల నుంచి భారీగా సామాన్యులు, ప్రముఖులు తరలి వచ్చి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z