* విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్-విజయవాడ (Hyderabad-Vijayawada) మార్గంలో ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10శాతం రాయితీని ప్రకటించింది. రాజధాని ఏసీ సర్వీసుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ యాజమాన్యం కోరింది. ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ వెబ్‌సైట్ https://www.tgsrtcbus.inను సందర్శించాలని సూచించింది.
* ఆర్థిక స్వేచ్ఛపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. భవిష్యత్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోవడం పెరిగింది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం వచ్చేలా ముందస్తుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC).. ‘స్మార్ట్ పెన్షన్ ప్లాన్’ (LIC Smart Pension Plan) పేరిట కొత్త యాన్యుటీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. సింగిల్ ప్రీమియంతో జీవితాంతం పెన్షన్ పొందొచ్చన్నమాట. సింగిల్ లైఫ్‌తో పాటు జాయింట్ లైఫ్ యాన్యుటీ సదుపాయాలను ఈ ప్లాన్ అందిస్తోంది. ఎల్‌ఐసీ కొత్త పెన్షన్ ప్లాన్… నాన్ పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్, ఇండివిడ్యువల్/ గ్రూప్, సేవింగ్స్, తక్షణ యాన్యుటీ ప్లాన్ (ప్లాన్ 879). వార్షికంగా, ఆరు నెలలు, మూడు నెలలు, నెలవారీ యాన్యుటీ చెల్లింపులు పొందొచ్చు. కొన్ని షరతులకు లోబడి పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. రుణ సదుపాయం కూడా ఉంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ సబ్‌స్క్రైబర్లు తక్షణ యాన్యుటీ పొందే వెసులుబాటును ఈ ప్లాన్ కల్పిస్తోంది.
* యాపిల్ కంపెనీ మార్కెట్లో.. సరసమైన ‘ఐఫోన్ ఎస్ఈ4’ (iPhone SE 4) లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రోజు కొత్త మోడల్ రానున్నట్లు ‘టిక్ కుక్’ కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించారు. లాంచ్ కావడానికి ముందే ఈ ఫోనుకు సంబంధించిన చాలా వివరాలు లీక్ అయ్యాయి. భారత కాలమానం ప్రకారం.. ఈ రోజు రాత్రి 11.30 గంటలకు నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. వెనుక భాగం ఎస్ఈ 3 మాదిరిగా ఉంటుంది. ముందు భాగంలో నాచ్ & సన్నని బాటమ్ బెజెల్ ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ ఎస్ఈ 4 రియర్ కెమెరా సిస్టమ్ కూడా స్వల్ప మార్పును పొందినట్లు తెలుస్తోంది. 48 మెగా పిక్సెల్ రియర్ కెమెరా పిక్సెల్ ఉంటుందని చెబుతున్నారు. ఇది ఎస్ఈ 3లోని 12 మెగా పిక్సెల్ సెన్సార్ కంటే అద్భుతంగా ఉంటుంది. హై-ఎండ్ మోడళ్లతో పోలిస్తే రియర్ సెన్సార్ చిన్నదనే చెప్పాలి.
* బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 94.24 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 75,873.15 వద్ద, నిఫ్టీ 28.15 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 22,917.15 పాయింట్ల వద్ద నిలిచాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ వంటివి నష్టాలను చవి చూశాయి.
* ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఇటీవల భారతదేశ విద్యా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చే లక్ష్యంతో దాతృత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అందుకోసం దేశవ్యాప్తంగా కనీసం 20 పాఠశాలలను నిర్మించడానికి రూ.2,000 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇటీవల గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ, దివా షాల వివాహం సందర్భంగా రూ.10,000 కోట్లతో దాతృత్వ కార్యక్రమాలు ప్రారంభిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రాథమికంగా పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొంది.
* బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయ్. తులం లక్షకు పోయేదాకా అస్సలు తగ్గేదేలే అనే తరహాలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీంతో.. శుభకార్యాలకు ప్లాన్ చేసుకున్న మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 19, 2025) కూడా బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 700 రూపాయలు పెరగడం గమనార్హం. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 650 రూపాయలు పెరిగింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z