* చేనేత వస్త్రాల విక్రయానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన ఆప్కో, కో ఆప్టెక్స్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది రూ.9.20 కోట్ల మేర వస్త్రాలు విక్రయాలు చేయాలని ఆప్కో, కో ఆప్టెక్స్ నిర్ణయించాయి. ఈ మేరకు విజయవాడలో బయ్యర్, సెల్లార్ మీట్‌లో రెండు రాష్ట్రాల చేనేత, జౌళి శాఖల మంత్రులు ఎస్.సవిత, ఆర్.గాంధీ సమక్షంలో రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని చేనేత వస్త్రాలకు మార్కెట్ విస్తరణలో భాగంగా తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్ట్స్‌తో ఆప్కో ఒప్పందం చేసుకుంది.
* మారుతీ సుజుకి కి దేశ కార్ల మార్కెట్ లో దాదాపు 40 శాతం వాటా ఉంది. దీని మరో 20 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రస్తుతం ముందుకు వెళుతోంది. దానిలో భాగంగా 2030 నాటికి మన దేశంలో నాలుగు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని భావిస్తోంది. అలాగే 2030 నాటికి కనీసం పది శాతం నిర్వహణ లాభాలను మార్జిన్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 9.20 శాతం మాత్రమే నమోదైంది. ఈక్విటీపై వస్తున్న 12.6 శాతం రాబడిని 15 శాతానికి పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటోంది. మొత్తాన్ని 2030 నాటికి 49 శాతం వృద్ధితో 8 ట్రిలియన్ యెన్ల ఆదాయం ఆర్జించాలని టార్గెట్ నిర్దేశించుకుంది.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల (బీపీఎస్)కు తగ్గించింది. దాని ప్రకారం దేశంలోని రెండో అతి పెద్ద బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులోనూ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గాయి. ఇవి ఫిబ్రవరి పదో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. హౌసింగ్, వ్యక్తిగత, కారు, విద్య తదితర రుణాలన్నింటికీ ఈ సవరించిన వడ్డీరేట్లు వర్తిస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు అతి తక్కువ వడ్డీ రేటుతో హౌసింగ్ రుణాలను మంజూరు చేస్తోంది. ఏడాదికి 8.15 శాతంతో ఇవి ప్రారంభవుతున్నాయి. 2025 మార్చి 31 వరకూ తీసుకునే కొన్ని రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంట్ చార్జీలు ఉండవు. కొన్ని వాటికి 30 ఏళ్ల వరకూ సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే కాలపరిమితిని అందిస్తోంది. అలాగే ఓవర్ డ్రాప్ట్ సౌకర్యం, మారటోరియం కాలం, అర్హత మెరుగుదల తదితర అదరపు సౌకర్యాలు కల్పిస్తోంది.
* గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరల్లో కనిపించిన పెరుగుదల గోల్డ్ ఈటీఎఫ్‌లలోనూ పెరిగింది. ఏడాదిలో క్రితం గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెడితే అత్యధికంగా 35 శాతం నుంచి 38 శాతం రాబడిని ఇచ్చాయి. దాదాపు 15 గోల్డ్ ఈటీఎఫ్‌లు ఇదే తరహా రాబడిని అందించాయి. గత నెలలో అంటే జనవరి 2025లో గోల్డ్ ఈటీఎఫ్‌లలో నికర పెట్టుబడులు రూ.3751.4 కోట్లకు పెరిగింది. పెట్టుబడిదారులు గరిష్ట రాబడిని గోల్డ్ ఈటీఎఫ్‌లు అందించడంతో ఆసక్తిగా పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. గోల్డ్ ఇటిఎఫ్‌లు అంటే ఓపెన్-ఎండ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్‌లు. ఇవి బంగారం, సంబంధిత సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. భౌతిక బంగారం ధరలతో పాటు గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ల ధర పెరగడానికి లేదా తగ్గడానికి ఇదే కారణం. ఇతర ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల మాదిరిగానే గోల్డ్ ఈటీఎఫ్‌లు కూడా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేస్తారు. పెట్టుబడిదారులు తమ ట్రేడింగ్ ఖాతాల ద్వారా వాటిని కొనుగోలు చేసి విక్రయిస్తారు.
అత్యధిక రాబడినిచ్చిన ఈటీఎఫ్‌లు
యూటీఐ గోల్డ్ ఈటీడీఎఫ్: 38.69%
ఎల్ఐసీ ఎంఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్: 38.12%
హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్: 37.85%
ఇన్వెస్కో ఇండియా గోల్డ్ ఈటీఎఫ్: 37.50%
యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్: 37.39%
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్: 37.07%
కోటక్ గోల్డ్ ఈటీఎఫ్: 36.98%
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్ : 36.96 %
ఎస్‌బీఐ గోల్డ్ ఈటీఎఫ్: 36.92%
మిరే అసెట్ గోల్డ్ ఈటీఎఫ్ : 36.89%
నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీఈఎస్ : 36.84%
డీఎస్‌సీ గోల్డ్ ఈటీఎఫ్: 36.73%
ఎడెల్వీస్ గోల్డ్ ఈటీఎఫ్: 36.69%
బరోడా బీఎన్‌పీ పారిబాస్ గోల్డ్ ఈటీఎఫ్: 36.57%
టాటా గోల్డ్ ఈటీఎఫ్: 36.47%
* వాల్‌మార్ట్‌కు వాటాలున్న ఫోన్‌పే ఐపీఓకి రావడానికి రెడీ అవుతోంది. ఇండియా ఎక్స్చేంజ్‌ల్లో లిస్టింగ్ కానుంది. రెండేళ్ల కిందట జరిగిన చివరి ఫండింగ్ రౌండ్‌లో ఫోన్‌పే 12 బిలియన్ డాలర్ల (రూ.1.04 లక్షల కోట్ల) వాల్యుయేషన్ పలికింది. మరోవైపు డిపాజిటరీ కంపెనీ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) ఐపీఓ ద్వారా రూ.3 వేల కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే నెల చివరిలోపు పబ్లిక్ ఇష్యూకి రావొచ్చు. మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌స్టిట్యూషన్ (ఎంఐఐ) అనుమతులు వచ్చే నెలలో ఎక్స్‌పైరీ అవుతాయి. ఈ డేట్‌కు ముందే ఐపీఓకి రావడానికి ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు.
* ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ పదవీకాలాన్ని మరో రెండేళ్లు.. అంటే 2027 మార్చి వరకు పెంచడానికి ప్రధాని మోదీ నాయకత్వంలోని కేబినెట్ అపాయింట్స్ కమిటీ అంగీకరించింది. నాగేశ్వరన్ 2022 జనవరి 28న సీఈఏగా బాధ్యతలు స్వీకరించారు. వివిధ ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, బడ్జెట్ ముందురోజు ప్రవేశపెట్టే ఎకనమిక్ సర్వేను తయారు చేయడం సీఈఏ ఆఫీసు బాధ్యత. ఇది వరకు క్రెడిట్స్విస్ గ్రూప్ ఏజీ, జూలియస్బేయర్ గ్రూపులో పనిచేసిన ఈయన వీకే సుబ్రమణియన్ తరువాత సీఈఏగా బాధ్యతలు చేపట్టారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z