* గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. కూటమి సభ్యులు, వైకాపా సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని.. కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి లోకేశ్ తెలిపారు. అయితే, 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రసంగంలో తప్పులు ఉంటే సరిదిద్దాలని.. అలా చేస్తే తప్పేం కాదన్నారు.
* బాలీవుడ్ ఫేవరెట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు గోవింద, సునీత అహుజా. 37ఏళ్ల వీరి వైవాహిక బంధం బీటలు వారిందని, విడాకులు తీసుకోనున్నారని (Govinda and Sunita Ahuja Divorce) గత కొద్ది రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ వేర్వేరుగా ఉండటమే ఇందుకు కారణమని ఆంగ్ల వెబ్‌సైట్స్ వార్తలు రాసుకుంటూ వచ్చాయి. దీంతో గోవింద అభిమానులు షాకయ్యారు. ఈ క్రమంలో తాజా వార్తలపై గోవింద మేనకోడలు ఆర్తి సింగ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని ఖండించారు. ‘‘ప్రస్తుతం నేను ముంబయిలో లేను. అయితే, ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలను. విడాకుల వార్తలన్నీ అవాస్తవాలు. అవి కేవలం ఊహాగానాలు మాత్రమే. వాళ్ల అనుబంధం, ప్రేమ ఎంతో బలమైనవి. అలాంటప్పుడు ఎందుకు విడాకులు తీసుకుంటారు. అవాస్తవాలను ఎలా ప్రచారం చేస్తున్నారో అర్థం కావటం లేదు. వ్యక్తిగత జీవితాలకు సంబంధించి, ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి సమాచారం వ్యాప్తి చేయడాన్ని మానుకోండి. నా విడాకుల గురించి కూడా వార్తలు వెలువడ్డాయి. అలాంటి నిరాధార వార్తల వల్ల మేమంతా అనవసర ఒత్తిడికి గురవుతున్నాము’’ అని ఆర్తి అన్నారు.
* ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో టీమ్ఇండియా (Team India) వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌కు చేరింది. టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. భారత మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో నిర్వహిస్తున్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరగనుంది. ఒకవేళ భారత్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ కూడా యూఏఈలోనే నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. భద్రతా కారణాల వల్ల టీమ్ఇండియాను పాకిస్థాన్‌కు పంపడానికి భారత్ నిరాకరిచిన విషయం తెలిసిందే. అయితే, టీమ్ఇండియా ఒకే వేదికలో మ్యాచ్‌లు ఆడుతుండటంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ అథర్టన్ (Michael Atherton), నాజర్ హుస్సేన్ అక్కసు వెళ్లగక్కారు.
* అక్రమంగా విదేశాలకు పంపించే ట్రావెల్ ఏజెన్సీలపై పంజాబ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే పదుల సంఖ్యలో ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ట్రావెల్ ఏజెన్సీల్లో సోదాలు నిర్వహించింది. 1200లకుపైగా సంస్థలపై దాడులు చేయగా.. ఏడుగురు ఏజెంట్లను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. విదేశాల్లో స్థిరపడాలనుకునే యువత మోసపోకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది.
* ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ఈనెల 27న ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కోరారు. 27న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులందరికీ అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసిందన్నారు. కానీ, చాలా కళాశాలలు, పాఠశాలల్లో ఓటు హక్కు కలిగిన సిబ్బందికి కొన్ని గంటలు మాత్రమే అనుమతి ఇస్తామని చెబుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఓ ప్రకటనలో తెలిపారు.
* అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశించింది. 9వ తరగతి వారికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదోతరగతి విద్యార్థులకు 2026-27 నుంచి అమలు చేసేలా చూడాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
* రాజస్థాన్(Rajasthan)లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు (Kota Suicides) కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లా యంత్రాంగం అన్ని కోచింగ్ సెంటర్లు, వసతి గృహాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు తాజాగా వెల్లడించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వచ్చే విద్యార్థుల జీవన వ్యయం తగ్గించడం, ఆత్మహత్యలను నిర్మూలించడమే లక్ష్యంగా కొత్త రూల్స్‌ను పాలనా యంత్రాంగం తీసుకొచ్చింది. గతంలో ఏడాది మొత్తం హాస్టల్ ఫీజును యాజమాన్యం వసూలు చేసేది. ప్రస్తుతం ఆ ఫీజును రూ.2 వేల వరకు మాత్రమే వసూలు చేసేలా నిబంధనలు విధించింది. అంతేకాకుండా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడే వీలు లేకుండా.. స్ర్పింగ్ తరహా సీలింగ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు హాస్టల్ సిబ్బందికి నిత్యం అప్రమత్తంగా ఉండేలా శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
* బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj Movie) కథాంశం కొత్తది కాకపోయినా, దర్శకుడు దర్శకుడు బాబీ తన టేకింగ్, సంభాషణ చాతుర్యంతో ప్రేక్షకులను అలరించారని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. తాజాగా ‘డాకు మహారాజ్’పై ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘బాలయ్య బాబును వైవిధ్యంగా చూపించడానికి ‘కొండవీటి దొంగ’ గెటప్ వేశారు. చదువుకున్న వాళ్లు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామనే బాధ కలిగినప్పుడు కొందరు కొన్ని అవతారాలు ఎత్తుతారు. ఇందులో బాలయ్యబాబు ‘డాకు మహారాజ్’ అవతారం ఎత్తారు. ఆ పాత్రలో హీరో ఏం చేశాడన్నదే ఈ కథ. నిప్పుల్లో నుంచి బాలకృష్ణ రావడం, ‘లార్డ్ ఆఫ్ డెత్’.. ‘ప్రాణాలు ఇచ్చే దేవుడిని కాదు.. తప్పు చేసిన వారి ప్రాణాలు తీసే దేవుడిని’ అన్న అర్థంలో వచ్చే డైలాగ్‌లు వింటే అసలు కథేంటో మేధావులకు ఇట్టే అర్థమైపోతుంది. ఇదంతా శ్రీకృష్ణుడి నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నదే. ఆయన్ను భగవంతుడిగా చూస్తాం. ఆయన ఎంతమంది నిర్మూలనకు కారణమయ్యాడో అందరికీ తెలుసు. ఆయన తలుచుకుంటే భారత యుద్ధాన్ని ఆపగలడు. నిప్పులో నుంచి హీరో రావడమంటే అతను అగ్ని పునీతుడని అర్థం. బాలయ్య పాత్రను ఎలివేట్ చేయడానికి అద్భుత సంభాషణలు రాశారు. బాబీ కొత్త అంశాన్ని సృష్టించలేదు. కానీ, మొదటి నుంచి చివరి వరకూ చక్కగా కథను నడిపారు. ‘నాకు దుష్మన్లు తక్కువ. ప్రాణాలిచ్చే అభిమానులు ఎక్కువ’ అనే డైలాగ్ బాలయ్యకు సరిగ్గా సరిపోతుంది. ఆయన్ను దగ్గరి నుంచి చూసి వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు’’.
* మహా శివరాత్రి వేడుకల(Maha Shivratri festival) వేళ గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారక జిల్లాలోని ఓ పురాతన ఆలయంలో రాతి శివలింగం చోరీకి గురికావడం కలకలం రేపింది. ఈ ఘటన అరేబియా సముద్రం ఒడ్డున కళ్యాణ్‌పూర్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హర్సిద్ధి మాతాజీ ఆలయానికి సమీపంలోని శ్రీ భిద్భంజన్ భవనీశ్వర్ మహాదేవ్ ఆలయంలో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఈ పురాతన ఆలయంలో శివలింగాన్ని దాని స్థానం నుంచి పెకలించి ఎత్తుకెళ్లడంతో పూజారి షాక్‌కు గురయ్యారని పోలీసులు తెలిపారు. అయితే, ఆలయంలోని రాతి శివలింగం మినహా మిగతా వస్తువులన్నీ చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం.
* నెహ్రూ జూపార్క్(Nehru Zoo Park)లో టికెట్ ధరలు పెరగనున్నాయి. ఈమేరకు పార్క్‌లో జరిగిన జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీలో విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పెంచిన కొత్త రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నెహ్రూ జూపార్క్ క్యూరేటర్ జె.వసంత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూపార్క్ సందర్శనకు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చొప్పున వసూలు చేయనున్నారు. ఫోటో కెమెరాకు అనుమతి ఇస్తే 150 రూపాయలు, వీడియో కెమెరా (ప్రొఫెషనల్) 2500 రూపాయలు, కమర్షియల్ మూవీ చిత్రీకరణ కోసం కెమెరా అయితే.. రూ.10 వేల రూపాయలు ఛార్జి చేస్తారు. అన్ని రోజుల్లో ట్రైన్ రైడ్ పెద్దలకు రూ.80, పిల్లలకు, రూ.40లుగా నిర్ణయించారు. బ్యాటరీ ఆపరేటెడ్ వాహనం ఎక్కితే పెద్దలకు రూ.120, పిల్లలకు రూ.70 చొప్పున నిర్ణయించారు.
* అసెంబ్లీ (ap assembly)లో వైకాపా నేతల విధ్వంసం చూస్తే.. వివేకా హత్య గుర్తొచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే వైకాపా నేతలు అలా ప్రవర్తించవచ్చా అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ మాట్లాడారు. ‘‘వైకాపా నేతలు గొడవలు, బూతులకు పర్యాయ పదంగా మారిపోయారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు ఎలా తట్టుకుని నిలబడగలిగారా? అని.. నిన్నటి ఘటన తర్వాత నాకనిపించింది. ఆయనకు హ్యాట్సాఫ్.. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే ఎంతో ధైర్యం, తెగువ ఉండాలి. నిన్న సభలో గొడవ చేసిన వైకాపా నేతలు .. గవర్నర్‌గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కళ్లలోకి చూడగలిగేవారా? చట్టాలు చేయాల్సిన వారే ఉల్లంఘిస్తే ఎలా? నిన్న సభలో గొడవ జరుగుతుంటే.. వైకాపా విధ్వంస విధానాలు గుర్తొచ్చాయి. ప్రజావేదిక కూల్చివేసిన తీరు, 200 పైచిలుకు ఆలయాలు కూల్చివేత, డాక్టర్ సుధాకర్ చనిపోయిన విధానం, జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలు, సుప్రీంకోర్టు జడ్జిపై లేఖ రాయడం, హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం, పత్రికాధిపతులపై దాడులు, మడ అడవుల విధ్వంసం, చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టిన విధానం, అమరావతి రైతులను రక్తం వచ్చేట్టు కొట్టి, కేసులు పెట్టిన తీరు, తిరుపతి కల్తీ లడ్డూ ఘటనలు గుర్తొచ్చాయి. అసెంబ్లీలోనే ఈ స్థాయిలో ప్రవర్తిస్తే.. బయట కూడా ఇలాంటి గొడవలే జరుగుతాయి. ఇది మారాలి అని ప్రజలకు చెబితే.. మనల్ని అత్యధిక మెజార్టీతో ఇక్కడ కూర్చోబెట్టారు’’ అని పవన్ అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z