Politics

నన్ను ఒంటరిగా ఉంచకండి-NewsRoundup-Feb 27 2025

నన్ను ఒంటరిగా ఉంచకండి-NewsRoundup-Feb 27 2025

* కెనడా ప్రతిపక్ష ఎన్‌డీపీ (నేషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ) నేత, ఖలిస్థానీ సానుభూతిపరుడు జగ్మీత్‌ సింగ్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను నేరస్థుడిగా అభివర్ణించారు. ఆయన్ను జి-7 సదస్సు కోసం కెనడా భూభాగంపై అడుగుపెట్టనీయకుండా బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌పై గతంలో నేర నిర్ధరణ జరిగిన అంశం, ప్రపంచ దేశాలకు ఆయన బెదిరింపులను ఇందుకు ఓ కారణంగా పేర్కొన్నారు. బుధవారం జగ్మీత్‌ సింగ్‌ మాట్రియాల్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఫారెన్‌ రిలేషన్స్‌ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

* వైకాపా (YSRCP) నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)ని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో మైహోమ్‌ భూజాలో అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. పోలీస్‌స్టేషన్‌లోనే ప్రభుత్వ వైద్యుడు గురుమహేశ్‌ ఆధ్వర్యంలో పోసానికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళిని కాసేపట్లో రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.

* ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు రెండ్రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండు నెలల్లో తిరిగి సొరంగం తవ్వకం పనులు చేపడతామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. టన్నెల్‌ కూలిపోవడానికి గత ప్రభుత్వ వైఫల్యమేనని ఉత్తమ్‌ ఆరోపించారు. ‘‘గత ప్రభుత్వం టన్నెల్‌లో నీటి తొలగింపు పనులు కూడా చేపట్టలేదు. టన్నెల్‌లో నీటిని తోడివేసి ఉంటే.. ఇప్పుడీ ప్రమాదం జరిగేది కాదు. గ్రావిటీ ద్వారా 30 టీఎంసీలు తీసుకునే ప్రాజెక్టును పక్కకు పెట్టారు. టన్నెల్‌ పూర్తి చేసి ఉంటే 4.50 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవి. భారాస చేపట్టిన ప్రాజెక్టులన్నీ వాళ్ల జేబులు నింపుకొనేందుకే. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కడితే అది మూడేళ్లకే కూలింది. గతంలో శ్రీశైలం పవర్‌ ప్లాంట్‌ అగ్ని ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు చనిపోతే కనీసం వెళ్లి చూడలేదు. పాలమూరు పంప్‌హౌస్‌లో ప్రమాదం జరిగి ఆరుగురు చనిపోతే స్పందించలేదు.

* వైకాపా నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) 3 రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో విజయవాడ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా వంశీ కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులోని సెల్‌లో తనను ఒంటరిగా ఉంచారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. తనకు ఆస్తమా సమస్య ఉందని, ఆరోగ్య సమస్య వస్తే ఇబ్బందని తెలిపారు. తనతో పాటు సెల్‌లో మరొకరిని ఉంచాలని, భద్రతా పరంగా తనకు ఇబ్బంది లేదని కోర్టును కోరారు. ఇప్పటికే వంశీకి దగ్గరలో అటెండర్‌ సౌకర్యం కల్పించారు కదా అని న్యాయమూర్తి అడిగారు. సెల్‌లో మరొకరిని ఉంచేందుకు ఇన్‌ఛార్జి జడ్జిగా తాను ఆదేశించలేనని న్యాయమూర్తి తెలిపారు.

* రాష్ట్రంలో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి మార్గదర్శకాలను పురపాలకశాఖ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు ఇటీవల సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలతో తాజా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈమేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌ కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

* అర్జున అవార్డు గ్రహీత, ప్రపంచ మాజీ ఛాంపియన్‌ బాక్సర్‌ స్వీటీ బూర వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్నారు. అడిగింత ఇచ్చినా.. అదనపు కట్నం కోసం తన భర్త, అత్తింటివారు వేధిస్తున్నారని, భౌతిక దాడికి పాల్పడుతున్నారని ఆమె (Boxer Saweety Boora) ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో భర్త దీపక్‌ హుడా, అతడి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరియాణాకు చెందిన కబడ్డీ ఆటగాడు దీపక్ హుడా (Deepak Hooda)తో 2022లో స్వీటీకి వివాహమైంది. పెళ్లి సమయంలో తన పుట్టింటి వారు రూ.కోటి కట్నంతో పాటు ఫార్చునర్‌ కారును కానుకగా ఇచ్చారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంకా కట్నం తీసుకురావాలని తనపై దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు.. దీపక్‌ హుడాకు సమన్లు జారీ చేశారు. అయితే, అనారోగ్య కారణాలతో అతడు విచారణకు రాలేదు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. మరోవైపు, భర్త నుంచి విడాకులు కోరుతూ స్వీటీ బూర ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

* కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, తమిళనాడు (Tamil nadu)లోని అధికార డీఎంకేల మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ కారణంగా 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని విమర్శించారు. ఈమేరకు గురువారం ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.

* మహారాష్ట్రలోని పుణెలో 26 ఏళ్ల యువతిపై బస్సులో ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (Ex-CJI DY Chandrachud) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నిర్భయ ఘటన తర్వాత చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కేవలం చట్టాలతోనే అలాంటి ఘటనలను నివారించలేం. మహిళల కోసం తీసుకొచ్చిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. ఎక్కడికి వెళ్లినా తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని కలిగించాలి. ఇలాంటి కేసుల్లో సరైన దర్యాప్తు, కఠిన చర్యలు అత్యంత కీలకం. న్యాయవ్యవస్థ, పోలీసులకు పెద్ద బాధ్యత ఉంది. వీరితో పాటు సమాజానికి కూడా’’ అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.

* కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా (Congress) మరోసారి వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఐఐటీ రాంచీ విద్యార్థులతో తాను వర్చువల్‌గా ప్రసంగిస్తుండగా.. ఎవరో అసభ్యకరమైన వీడియోలు ప్రదర్శించారని ఆయన ఆరోపించారు. ఈమేరకు ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. అయితే, ఈ ఆరోపణలను కేంద్ర విద్యాశాఖ ఖండించింది. రాంచీలో ఉన్నది ఐఐటీ కాదని ఐఐఐటీ అని స్పష్టంచేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z