Business

ఇన్ఫోసిస్‌పై ప్రధాని కార్యాలయంలో ఫిర్యాదు-BusinessNews-Feb 27 2025

ఇన్ఫోసిస్‌పై ప్రధాని కార్యాలయంలో ఫిర్యాదు-BusinessNews-Feb 27 2025

* ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ (Samsung) బడ్జెట్‌ సెగ్మెంట్‌లో రెండు కొత్త ఫోన్లను లాంచ్‌ చేసింది. తన గెలాక్సీ ఎం సిరీస్‌లో గెలాక్సీ M06, గెలాక్సీ M16 పేరిట 5జీ మొబైళ్లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు చాలా వరకు ఒకే రకమైన ఫీచర్లు ఉన్నాయి. పైగా ఔటాఫ్‌ది బాక్స్‌ ఆండ్రాయిడ్ 15తో పనిచేసే వన్‌యూఐ7తో వస్తుండడం విశేషం. M16కు ఆరేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

* ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ తాజాగా ఉద్యోగుల తొలగింపు (Google Layoffs) ప్రక్రియ చేపట్టింది. క్లౌడ్‌ డివిజన్‌లోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించిందని సమాచారం. సంబంధిత వ్యక్తులు ఈవిషయాన్ని వెల్లడించినట్లు బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో పేర్కొంది. అయితే ఎంతమందిని తొలగించిందనే విషయం మాత్రం తెలియరాలేదు. వంద మందికి పైగా ఉండొచ్చని, అది కూడా కొన్ని టీమ్స్‌పై మాత్రమే తొలగింపుల ప్రభావం ఉందని తెలుస్తోంది.

* ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం (Paytm) మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’.. ఏఐ స్టార్టప్‌ పర్‌ప్లెక్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన యాప్‌లో ఏఐ ఆధారిత సెర్చింగ్‌ సేవల్ని అందించేందుకు స్టార్టప్‌తో జట్టు కట్టినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని పేర్కొంది. ఈ సౌలభ్యంతో యూజర్లు స్థానిక భాషల్లో ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.

* ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీకి చెందిన మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ట్రైనీ ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై కార్మిక యూనియన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారం ప్రధానమంత్రి కార్యాలయానికి చేరింది. ఈ బలవంతపు లేఆఫ్‌ల (Trainees Layoffs)పై ట్రైనీలు పీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తొలగింపులపై ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో 100కు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు సదరు కథనాలు తెలిపాయి. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ ఉద్యోగాలను తిరిగి ఇప్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా చూడాలని ట్రైనీలు కోరినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర కార్మిక శాఖ స్పందించి చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించి కర్ణాటక కార్మిక శాఖకు ఫిబ్రవరి 25నే నోటీసులు పంపించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు దర్యాప్తు జరిపి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది.

* స్పైస్‌జెట్‌ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.300 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 36 శాతం నష్టపోయి రూ.1,850.4 కోట్ల నుంచి రూ.1,178.7 కోట్లకు పడిపోయింది.

* ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్‌ (MG Motors) భారత్‌ మార్కెట్‌లోకి తన ఎంజీ కామెట్ (MG Comet) బ్లాక్‌స్టోర్మ్‌ ఎడిషన్‌ కారును ఆవిష్కరించింది. హెక్టర్ (Hector)‌, గ్లోస్టర్ (Gloster)‌, ఆస్టర్ (Astor) తర్వాత ఎంజీ మోటార్స్ తీసుకొస్తున్న బ్లాక్‌ స్టోర్మ్ ఎడిషన్‌ ఎంజీ కామెంట్‌ నాలుగోది. టాప్‌ స్పెక్‌ ఎక్స్‌క్లూజివ్‌ ట్రిమ్ ఎంజీ కామెట్‌ బ్లాక్‌ స్టోర్మ్‌ ఎడిషన్ (MG Comet Blackstorm Edition) కారు ధర రూ.7.80 లక్షలు పలికింది. ఎంజీ కామెట్‌ (MG Comet)తో పోలిస్తే ఎంజీ కామెట్‌ బ్లాక్ స్టోర్మ్‌ ఎడిషన్ (MG Comet Blackstorm Edition)కారు ధర రూ.30,000 వేలు ఎక్కువ పలుకుతుంది. ఆసక్తిగల కస్టమర్లు రూ.11 వేలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z