Business

ఒక డాలరుకు ₹87.51. కారణాలు ఇవే-BusinessNews-Feb 28 2025

ఒక డాలరుకు ₹87.51. కారణాలు ఇవే-BusinessNews-Feb 28 2025

* ప్రముఖ టెక్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ (Microsoft) తన వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ స్కైప్‌ (Skype) సర్వీసులకు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలో ఈ సేవలను శాశ్వతంగా నిలిపివేయనుందని సమాచారం. ఈ విషయాన్ని ఎక్స్‌డీఏ తన నివేదికలో వెల్లడించింది. స్కైప్‌ తన వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవల్ని 2003లో తొలుత ప్రారంభించింది. 2011లో మైక్రోసాఫ్ట్‌ ఈ సర్వీసుల్ని కొనుగోలు చేసింది. అలా 22 ఏళ్ల పాటు స్కైప్‌ తన సేవల్ని అందిస్తూ వచ్చింది.

* క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ (Bitcoin) విలువ భారీగా క్షీణించింది. శుక్రవారం నాటికి ఏకంగా 80 వేల డాలర్లకు పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల విధింపు చర్యల నేపథ్యంలో దీని విలువ మూడున్నర నెలల కనిష్ఠానికి చేరింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ (Donald Trump) ట్రంప్‌ ఎన్నిక తర్వాత బిట్‌కాయిన్‌ విలువ అనూహ్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. క్రిప్టో కరెన్సీ విషయంలో నిబంధనలు సడలిస్తానని ఆయన సంకేతాలు ఇవ్వడంతో ఒక దశలో బిట్‌కాయిన్‌ ఏకంగా 1,00,000 డాలర్ల మార్కును దాటేసింది. అయితే, ఆ తర్వాత ట్రంప్‌ టారిఫ్‌ నిర్ణయాలు, వాణిజ్య యుద్ధభయాలతో ఈ క్రిప్టో కరెన్సీ ర్యాలీకి బ్రేక్‌ పడింది. అటు ఇథేరియమ్‌లో 1.5 బిలియన్‌ డాలర్ల హ్యాకింగ్‌ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో నెలకొన్న అనిశ్చితి కూడా బిట్‌కాయిన్‌ క్షీణించడానికి కారణమైంది.

* స్వాతంత్య్రం సిద్ధించి 100 సంవత్సరాలు (2047) అయ్యే సమయానికి అభివృద్ధి చెందిన (వికసిత్‌ భారత్‌) దేశంగా అవతరించాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీని కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అయితే భారత్‌ అధిక ఆదాయ దేశంగా మారాలంటే 7.8 శాతం వృద్ధి రేటును సాధించాలని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన తన ఇండియా కంట్రీ మెమోరాండమ్‌లో వెల్లడించింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, బ్యాంకింగ్‌, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ 1400 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 22,200 దిగువకు చేరింది. స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆసియా మార్కెట్లలో సియోల్‌, టోక్యో, షాంఘై, హాంకాంగ్‌ షేర్లూ భారీ నష్టాల్లో ముగిశాయి. మదుపర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.384 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 74,201.77 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 74,612.43) నష్టాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 73,141.27 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1414.33 పాయింట్ల నష్టంతో 73,198.10 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 420.35 పాయింట్ల నష్టంతో 22,124.70 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 33 పైసలు కోల్పోయి 87.51 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. టెక్‌ మహీంద్రా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 73 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2874 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

*** నష్టాలకు కారణాలు ఇవే..
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికైనప్పటినుంచి స్టాక్‌ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు ట్రంప్‌ చేస్తున్న టారిఫ్‌ ప్రకటనలు వాణిజ్య యుద్ధ భయాలు రేపుతున్నాయి. మెక్సికో, కెనడాపై విధించిన సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తాజాగా చైనాపై అదనంగా మరో 10 శాతం సుంకం విధిస్తానని ట్రంప్‌ ప్రకటించడం గమనార్హం. చైనాపై సుంకాలూ అదేరోజు నుంచి అమలవుతాయని పేర్కొన్నారు. ఈయూపైనా 25 శాతం సుంకాలు వేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనలు మదుపర్లలో ఆందోళనకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

దేశీయ బ్యాంకుల నాలుగో త్రైమాసిక ఫలితాలు బలహీనంగా నమోదుకావొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్‌ పతనానికి మరో కారణమని అనలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే క్యూ3 ఫలితాలు నిరాశపరిచిన నేపథ్యంలో క్యూ4కు సంబంధించిన తాజా అంచనాలు మరింత ఆందోళనలోకి నెట్టేశాయి.

ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లూ ఎఫ్‌ఐఐలు అమ్మకాలకు దిగినా.. డీఐఐలు మన మార్కెట్లను నిలబెట్టాయి. అయితే, ఎఫ్‌ఐఐల విక్రయాలు కొనసాగుతుండడంతో డీఐఐలు సైతం కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

చైనా ఈ మధ్య ప్రైవేటు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఎఫ్‌ఐఐలు చైనాకు తరలిపోతున్నాయని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. చైనా స్టాక్స్‌ తక్కువ వాల్యూషన్స్‌లో లభిస్తుండడం, చైనా ఎకానమీ బలంగా పుంజుకొంటుందన్న అంచనాలు ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z