Business

మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవి-BusinessNews-Mar 02 2025

మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవి-BusinessNews-Mar 02 2025

* ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ (Samsung) ఏఐ ఫీచర్లతో మూడు కొత్త మొబైల్స్‌ను గ్లోబల్‌గా లాంచ్‌ చేసింది. తన గెలాక్సీ ‘ఏ’ సిరీస్‌ నుంచి మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ56 (Galaxy A56), గెలాక్సీ ఏ36 (Galaxy A36), గెలాక్సీ ఏ26 (Galaxy A26) పేరిట యూజర్లకు పరిచయం చేసింది. IP67 రేటింగ్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత వన్‌యు7 తో పనిచేసే ఈ మొబైల్స్‌కు ఆరేళ్ల పాటు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

* దక్షిణాది నగరాల్లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. గ్లోబల్‌ డేటా సెంటర్లకు చిరునామాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల పెట్టుబడులు, డిజిటల్‌ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ డేటా సెంటర్ల వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో 47 లక్షల చ.అ.ల్లో 213 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో 27 లక్షల చ.అ.ల్లో 186 మెగావాట్లు నిర్మాణ దశలో, 24 లక్షల చ.అ.ల్లో 168 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయని కొల్లియర్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యంలో 35 ఆక్యుపెన్సీ బ్యాకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగానిదే.. ఆ తర్వాత 30 శాతం ఐటీ రంగం, 20 శాతం క్లౌడ్‌ సర్వీస్‌ విభాగం, ఇతరుల వాటా 15 శాతంగా ఉంది. డేటా సెంటర్ల నెలవారీ ఛార్జీలు కిలోవాట్‌కు రూ.6,650 నుంచి 8,500లుగా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు, మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీ కారణంగా హైదరాబాద్‌లో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. అత్యంత వేగంగా నగరం డేటా సెంటర్ల హాట్‌స్పాట్‌గా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భాగ్యనగరంలో 10 లక్షల చ.అ.ల్లో 47 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు అందుబాటులో ఉండగా.. మరో 3 లక్షల చ.అ.ల్లో 20 మెగావాట్లు నిర్మాణంలో, 5 లక్షల చ.అ.ల్లో 38 మెగావాట్లు ప్రణాళిక దశలో ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో మైక్రోసాఫ్ట్, సీటీఆర్‌ఎల్‌ఎస్‌ వంటి పలు సంస్థలు డేటా సెంటర్లున్నాయి. గచ్చిబౌలి, మేకగూడ, షాద్‌నగర్, చందన్‌వ్యాలీ వంటి పలు ప్రాంతాల్లో మరిన్ని డేటా సెంటర్లు రానున్నాయి.

* ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగియనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ నెలలో ట్రేడింగ్‌కు సిద్ధమవుతున్నారు. అయితే ట్రేడింగ్‌ను బాగా ప్లాన్ చేయడానికి మార్చి నెలలో స్టాక్ మార్కెట్‌ ఏయే రోజుల్లో పనిచేస్తుంది.. ఎప్పుడు మూసివేత ఉంటుంది అన్నది తెలుసుకోవడం మంచిది. ఈ హాలిడే క్యాలెండర్ ను స్టాక్ ఎక్స్ఛేంజీలు జారీ చేస్తాయి. తమ అధికారిక వెబ్ సైట్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయి. బీఎస్ఈ ప్రతి సంవత్సరం పూర్తి ట్రేడింగ్ హాలిడేస్ జాబితాను ప్రచురిస్తుంది. సాధారణంగా ఈ జాబితాలో పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవులు ఉంటాయి. బడ్జెట్ సమర్పణ వంటి ప్రత్యేక సందర్భాలు మినహా అన్ని వారాంతాల్లో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. అందువల్ల మార్కెట్ షెడ్యూల్‌ను తెలుసుకుని తదనుగుణంగా ట్రేడింగ్‌ను ప్లాన్ చేయడానికి ఇన్వెస్టర్లు సెలవుల జాబితాపై ఆధారపడాలి. మార్చిలో స్టాక్ మార్కెట్ కు 12 రోజులు సెలవులు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈ రోజుల్లో మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ లు చేయలేరు. వారాంతపు సెలవులతో పాటు ఈ నెలలో హోలీ, రంజాన్ పండుగకు కూడా మార్కెట్లు మూతపడతాయి. అందువల్ల మార్చిలో చివరి ట్రేడింగ్ రోజు 28వ తేదీ. ఎందుకంటే 29, 30 తేదీలు వారాంతపు సెలవులు. ఆ రోజుల్లో మార్కెట్లు పనిచేయవు.

మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే
» మార్చి 1 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 2 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 8 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 9 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 14 శుక్రవారం హోలీ
» మార్చి 15 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 16 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 22 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 23 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 29 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 30 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 31 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)

* పాస్‌పోర్టుల (Passport) జారీకి సంబంధించిన నిబంధనలలో భారత ప్రభుత్వం తాజాగా మార్పులు చేసింది. పాస్‌పోర్టుల జారీ కోసం సమర్పించే పుట్టినరోజు తేదీ రుజువుకు సంబంధించిన నిబంధనలకు సవరణలు ప్రకటిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. పాస్‌పోర్ట్ (సవరణ) నిబంధనలు, 2025 లో భాగమైన ఈ మార్పులు పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, అవసరమైన డాక్యుమెంటేషన్‌లో ఏకరూపతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించిన పిల్లలకు జనన మరణాల రిజిస్ట్రార్, మునిసిపల్ కార్పొరేషన్ లేదా జనన, మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం అధికారం ఉన్న ఏదైనా ఇతర అథారిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం మాత్రమే పుట్టిన తేదీకి చెల్లుబాటు అయ్యే రుజువు అని కొత్త నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఈ మార్పు శిశువులకు జనన ధృవీకరణ పత్రాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. అలాగే పుట్టిన తేదీని అధికారిక రికార్డులలో ఖచ్చితంగా నమోదు చేసేలా చేస్తుంది.

* లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్‌లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆ పెట్టుబడిని రాబట్టేందుకు పలు రాష్ర్టాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఉచిత భూములు, రకరకాల ప్రోత్సాహకాల ఆశ చూపడంతోపాటు తమ రాష్ట్రంలో ఉన్న అనుకూలతలను ఎత్తిచూపుతూ ఎలాగైన పరిశ్రమను దక్కించుకొనేందుకు ఎవరి మార్గాల్లో వారు ప్రయత్నిస్తున్నారు. ఈ పోటీలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందా? అంటే అవుననే సమధానం వస్తున్నది. టెస్లా ప్లాంటు కోసం రాష్ట్ర సర్కారు అవసరమైన మేరకు ప్రయత్నాలు చేయకపోవడమే ఈ వాదనలకు బలాన్ని చేకూర్చుతున్నది. టెస్లా కంపెనీని ఆకర్షించేందుకు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, కర్ణాటక, తెలంగాణ సైతం రేసులో ఉన్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఇప్పటికే అనేక ఆటోమొబైల్‌ పరిశ్రమలు కొనసాగుతుండటం వాటికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పలు ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు ఈ రాష్ర్టాల్లో తమ పరిశ్రమలు స్థాపించి ఉత్పత్తులు చేస్తున్నాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాలకు ఐటీ పరిశ్రమలు అధికంగా ఉండటం కొంత అనుకూలాంశం కాగా, ఈ రెండు కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాలు కావడం ప్రతికూలాంశమని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. పోటీలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ మినహా అన్నింటికీ ఓడరేవు ఉంది. దీంతో ఎగుమతి, దిగుమతులకు ఈ రాష్ర్టాలు అనుకూలంగా ఉన్నాయి. అన్నిటికి మించి మన రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో టెస్లాతో సంప్రదింపులు జరిపినప్పటికీ అనంతరం ఆ ప్రయత్నాలను కొనసాగించకుండా వదిలేసిందని అంటున్నారు. ముఖ్యంగా ఓడరేవు లేకపోవడం, ఎన్డీఏ కూటమిలోని రాష్ర్టాలతో మనం పోటీ పడే అవకాశం లేదనే భావన ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టు తెలిసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z