రాష్ట్రేతర ఆంధ్రులకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బాసటగా నిలవాలని భారత సుప్రీం కోర్ట్ పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ కోరారు. శనివారం ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం రాయ్ పూర్ గుడియారీలో ఉన్న మారుతీ మంగళ భవనంలో ఛత్తీస్ ఘడ్ తెలుగు మహా సంఘం ఆధ్వర్యంలో ఛత్తీస్ ఘడ్ ద్వితీయ తెలుగు మహాసభలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ ఎన్.వీ.రమణ ప్రసంగిస్తూ ఇతర రాష్ట్రాలలోని తెలుగు వారు తమ మాతృ భాషా, సంస్కృతులు కాపాడుకోవడానికి చేస్తున్న కృషికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. భాష లేకుండా సంస్కృతి నిలవదని, సంస్కృతి లేకుండా భాష అభివృద్ధి చెందదన్నారు. భాష సంస్కృతి ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉంటాయి కాబట్టి భాషా పరిరక్షణ అనేది ఒక సంస్కృతి సజీవంగా ఉండేందుకు చాలా కీలకం అన్నారు. సాహిత్యంతో సంస్కృతి స్థిరపడుతుందన్నారు. కవితలు, నవలలు, నాటకాలు, శాసనాలు, శాస్త్రీయ రచనల ద్వారా ఒక భాష తన సంస్కృతిని సజీవంగా ఉంచుతుందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వారంతా ప్రవాసాంద్రులు కాదని నివాసాంధ్రులని చమత్కరించారు. కన్నతల్లిని ఉన్న ఊరుని మాతృభాషని గౌరవించని వారు సంస్కారహీనులని విమర్శించారు. తెలుగు భాష మన సంస్కృతి సాంప్రదాయాల గొప్ప భాష అన్నారు. అది మర్చిపోతే కుటుంబ వ్యవస్థ మీద వ్యక్తుల మీద ఆహారపు అలవాట్లు మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. పదేళ్ల క్రితం వరకు ప్రపంచంలో ఎక్కువ మాట్లాడేవారు తెలుగు భాష వారేనని, ఆనాడు తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య రెండో స్థానములో ఉండగా, నేడు నాలుగో స్థానానికి దిగజారి పోయిందని యునెస్కో హెచ్చరించిందని గుర్తు చేశారు. అందుకు కారణం మనమేనని, దీనిని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ 85ను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి ఉందని, ఇందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని జస్టిస్ రమణ చెప్పారు రాయపూర్ ద్వితీయ తెలుగు మహాసభలో ఎంతో తేట తెలుగుతనం కనిపిస్తుందన్నారు. భాష కోసం ప్రాణాలు ఒదిలిన నేతలు, భాషకై పరితపించే కళాకారులు, కవులు ఈ సభలో కనిపిస్తున్నారని చెబుతూ తెలుగుపై శ్రీ శ్రీ రాసిన కవిత్వంతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ చైర్మన్, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు పది కోట్ల మంది తెలుగు ప్రజలు నివసిస్తుంటే, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో, ఇంకా విదేశాలలో దాదాపు ఐదు కోట్ల మంది తెలుగువారు జీవిస్తున్నారన్నారు. భారతదేశంలో హిందీ భాష మాట్లాడే వారి సంఖ్య తర్వాత తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో జీవిస్తున్న తెలుగు ప్రజలు ఇటీవల తమ ఆర్థిక సామాజిక పరిస్థితుల ఒత్తిడితో తాము తెలుగువారు అని నమోదు చేయించుకోకపోవడంతో భారతదేశంలో ఉన్న తెలుగువారి సంఖ్య ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. జన గణన జరిగే సమయంలో భారతదేశవ్యాప్తంగా జీవిస్తున్న ప్రతి ఒక్క తెలుగు వారు తమ మాతృ భాష తెలుగు అని నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. తెలుగు భాషపై అభిమానంతో కోర్టు తీర్పులు తెలుగులో ఇప్పించిన ఘనత మాజీ జస్టిస్ ఎన్.వీ రమణకు దక్కుతుందన్నారు. జస్టిస్ ఎన్.వీ రమణ చేసిన ప్రసంగం తెలుగు అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో తెలుగును అక్కడి ప్రభుత్వం అధికార భాషగా గుర్తించిందని, ఆ దిశగా ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కూడా కృషి చేయాలని కోరారు.
శ్రీకాకుళం శాసనసభ్యుడు గొండు శంకర రావు మాట్లాడుతూ నివసిస్తున్న బీసీలను చత్తీస్ ఘడ్ ప్రభుత్వం గుర్తించక పోవటంతో జరుగుతున్న నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానన్నారు. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ జీరో అవర్ లో ప్రస్తావిస్తానన్నారు. కుల ధ్రువీకరణ సమస్యలపై కేంద్ర మంత్రి కింజరాపు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. సినీ నటులు సాయికుమార్ మాట్లాడుతూ ఆధునికత కావాలని, అదే క్రమంలో మన నాగరికత మరిచిపోకూడదన్నారు. తెలుగు భాషపై తనదైన శైలిలో చక్కని కవిత సుదీర్ఘ ప్రసంగాన్ని వినిపించారు.
చత్తీస్ ఘడ్ తెలుగు మహా సంఘం అధ్యక్షులు రాళ్లపల్లి మురళి, డిప్యూటీ జనరల్ కార్యదర్శి ఎస్ గణేష్, జి.స్వామి, మొరుపల్లి బాబూరావు, కన్వీనర్ లండ రుద్ర మూర్తి, సీనియర్ ఉపాధ్యక్షులు జయంత్ నాయుడు, పి.వి.రావు, ప్రసాద్ శర్మ, కార్యదర్శి తులసీరావ్, కోశాధికారి ఎన్ రమణమూర్తి, బి.వేణుగోపాలరావు, టి.శ్రీనివాసరెడ్డి, సాగూరు నారాయణస్వామి, గజల్ శ్రీనివాస్, రాష్ట్రంలోని తెలుగు సంఘాల సభ్యులతో పాటు రా తె స అధ్యక్షులు, కార్యదర్శి, అనేక రాష్ర్టాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సభా ప్రారంభానికి ముందు చిన్నారుల నృత్య ప్రదర్శన నిర్వహించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z