* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను పడేశాయి. అమెరికాలో వృద్ధి నెమ్మదించడం, ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందనే భయాల నేపథ్యంలో దేశీయ ఐటీ స్టాక్స్ నేడు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ యాజమాన్యం నుంచి మదుపర్లలో నమ్మకాన్ని పాదుగొల్పే ప్రకటనలు రావడంతో నిన్న భారీగా పతనమైన బ్యాంక్ షేర్లు.. ఇవాళ 5 శాతం మేర రాణించాయి. సెన్సెక్స్ ఉదయం 74,270.81 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 74,102.32) లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. తర్వాత స్వల్పంగా కోలుకుంది. ఇంట్రాడేలో 73,598.16 – 74,392.15 మధ్య చలించింది. చివరికి 72.56 పాయింట్ల నష్టంతో 74,029.76 వద్ద ముగిసింది. నిఫ్టీ 27.40 పాయింట్లు కోల్పోయి 22,470.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.21గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70.23 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2,922 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
* దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలు ఎదుర్కొంటున్న వేళ మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual funds) పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. జనవరితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు 79 శాతం మేర క్షీణించాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులైతే 26 శాతం తగ్గి రూ.29,303 కోట్లకే పరిమితమైంది. జనవరిలో ఈ మొత్తం రూ.39,687 కోట్లుగా ఉంది. ఈ మేరకు భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) ఫిబ్రవరి నెలకు సంబంధించిన గణాంకాలను బుధవారం విడుదల చేసింది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో జనవరిలో నెలలో అత్యధికంగా రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా.. ఫిబ్రవరి నెలలో తిరోగమనం కనిపించింది. ఈ కేటగిరీ నుంచి రూ.6,525 కోట్ల మేర పెట్టుబడులు తరలిపోయాయి.
* ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు బోనస్ చెల్లింపులకు సంబంధించి లెటర్స్ పంపించడం ప్రారంభించింది. 2024 సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఉద్యోగులకు 85-115 శాతం మేర బోనస్‌ను చెల్లించనుంది. మెజారిటీ సంఖ్యలో ఉద్యోగులు బోనస్‌కు అర్హత సాధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఉద్యోగులకు బోనస్ లెటర్లు మెయిల్ ద్వారా అందనున్నాయి.
* మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్‌లో భాగమైన మహీంద్రా అగ్రి సొల్యూషన్స్ లిమిటెడ్ (MASL) భారత్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు టేబుల్ గ్రేప్స్ ఎగుమతులు ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వెల్లడించింది. 2005లో మహీంద్రా తొలిసారి ద్రాక్ష పండ్ల షిప్‌మెంట్‌ను యూరప్‌కి ఎగుమతి చేసింది. ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరప్, చైనా, ఆగ్నేయాసియా, ఇతర మార్కెట్లలోని కస్టమర్లకు అత్యంత నాణ్యమైన ద్రాక్షలను అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఎగుమతి చేస్తోంది. సబోరో, ఫ్రూకింజ్ బ్రాండ్ల కింద థామ్సన్, సొనాకా పేరిట వైట్ సీడ్‌లెస్ ద్రాక్షలు, ఫ్లేమ్, క్రిమ్సన్ పేరిట రెడ్ సీడ్‌లెస్ ద్రాక్షలు, జంబో, శరద్ పేరిట బ్లాక్ సీడ్‌లెస్ ద్రాక్షలను ఎంఏఎస్ఎల్ సంస్థ ఎగుమతి చేస్తోంది. దాంతో ఉద్యోగాల కల్పన, సామాజిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా స్థానిక కమ్యూనిటీలకు తోడ్పాటు అందిస్తోంది. ఎగుమతి చేయగలిగే విధంగా దిగుబడులను మూడు రెట్లు మెరుగుపర్చుకోవడంలో (ఎకరానికి 2.5 ఎంటీ నుంచి ఎకరానికి 7.5 ఎంటీ వరకు) రైతాంగానికి తోడ్పాటు అందిస్తోంది. సంస్థకు నాసిక్‌లో అధునాతన గ్రేప్ ప్యాక్ హౌస్ ఉండగా నాసిక్, బారామతి, సాంగ్లిలో 500 మంది పైచిలుకు రైతులతో కలిసి పని చేస్తోంది.
* స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.80,650 (22 క్యారెట్స్), రూ.87,980 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. మంగళవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.450, రూ.490 పెరిగింది. చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.450, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.80,650 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.87,980 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది. దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.450 పెరిగి రూ.80,800కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.490 పెరిగి రూ.88,130 వద్దకు చేరింది.
* దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఇటీవల వర్క్ ఫ్రమ్ హోమ్(work from home ).. ఆఫీస్ హాజరుకు (Return to office) సంబంధించిన కొత్త రూల్ జారీ చేసింది. తమ ఉద్యోగులు నెలలో కనీసం 10 రోజులు ఆఫీసుకు హాజరుకావాలని కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు అవసరమయ్యే ఉద్యోగులు గందరగోళంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇన్ఫోసిస్ స్పష్టత ఇచ్చింది. ఒక ఉద్యోగి నెలలో కనీసం 10 రోజులు ఆఫీసు నుండి పనిచేయకపోతే “సిస్టమ్ ఇంటర్వెన్షన్”కు దారితీస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ పదం వాడకం ఉద్యోగుల్లో ఆందోళనకు దారితీసింది. ఏదైనా అత్యవసర కారణం లేదా ఉన్నతాధికారుల అనుమతితో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటే, అది యాప్‌లో నమోదు కాకపోతే తమ సెలవు కోతకు గురవుతుందని ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయీ యాప్ పై స్పష్టత వచ్చింది. ఇన్ఫోసిస్ ఉద్యోగులు తమ హాజరును యాప్‌లో నమోదు చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) రిక్వెస్ట్‌లను ఈ యాప్ ఇకపై నేరుగా ఆమోదించదు. ఉద్యోగులు తప్పనిసరిగా తమ కార్యాలయంలో నెలకు 10 రోజులు హాజరు పంచ్ చేయాల్సి ఉంటుందని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనంలో పేర్కొంది. ఒక నెలలో అందుబాటులో ఉన్న మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుల సంఖ్య, ఇప్పటికే ఉపయోగించిన రోజులు, అందుబాటులో ఉన్న రోజులను యాప్ చూపిస్తుంది. అదనపు డబ్ల్యూఎఫ్‌హెచ్ రోజులను మినహాయింపుగా చూపిస్తామని, వాటిని క్రమబద్ధీకరించడానికి ఉద్యోగి తన మేనేజర్‌కు అప్రూవల్ రిక్వెస్ట్‌ను సమర్పించాల్సి ఉంటుందని యాప్‌లో అప్డేట్ చెబుతోంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z