Business

అమెజాన్-ఫ్లిప్‌కార్టులపై ప్రభుత్వ సోదాలు-BusinessNews-Mar 17 2025

అమెజాన్-ఫ్లిప్‌కార్టులపై ప్రభుత్వ సోదాలు-BusinessNews-Mar 17 2025

* ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగులలో.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) విస్తృతంగా సోదాలు నిర్వహించింది. నిబంధనలను అనుగుణంగా లేని ఉత్పత్తుల పంపిణీని అరికట్టడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బీఐఎస్ లక్నో, గురుగ్రామ్‌లోని అమెజాన్ గిడ్డంగులపై దాడి జరిపి.. అక్కడ నిబంధనలను అనుగుణంగా లేని బొమ్మలు, హ్యాండ్ బ్లెండర్లు, అల్యూమినియం ఫాయిల్స్, మెటాలిక్ వాటర్ బాటిళ్లు, పీవీసీ కేబుల్స్, ఫుడ్ మిక్సర్లు, స్పీకర్లు మొదలైనవాటిని స్వాధీనం చేసుకుంది. గురుగ్రామ్‌లోని ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఫ్లిప్‌కార్ట్ గిడ్డంగిలో వందలాది ధృవీకరించని స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు, బొమ్మలు, స్పీకర్లు ఉన్నట్లు గుర్తించింది. ఈ నాన్ సర్టిఫైడ్ ఉత్పత్తులు టెక్విజన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినవిగా బీఐఎస్ గుర్తించింది. ఈ కారణంగానే ఢిల్లీలోని వారి రెండు సౌకర్యాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 7,000 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 4,000 ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 95 ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు, 40 గ్యాస్ స్టవ్‌లు బయటపడ్డాయి. వీటన్నింటికీ.. బీఐఎస్ సర్టిఫికేషన్ లేదు.

* భారత్‌లోని ఐఫోన్‌ల్లో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (ఆర్‌సీఎస్‌) మెసేజింగ్‌ను తీసుకురావడానికి యాపిల్ గూగుల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భాగస్వామ్యం మెసేజింగ్ సాంకేతికతలో మార్పును సూచిస్తుంది. ఈ చర్యలు ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో ఒకటైన ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారుల సంఖ్యను పెంచేలా వీలు కల్పిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఐఓఎస్ 18.2 వెర్షన్‌లో పీ2పీ (పర్సన్-టు-పర్సన్) ఆర్‌సీఎస్‌ను యూఎస్, కెనడా, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, యుకె, బెల్జియం, చైనా వంటి ఎనిమిది దేశాల్లో ప్రారంభించారని గ్లోబల్ ఆర్‌సీఎస్‌ ప్లాట్‌ఫామ్‌ ప్రొవైడర్ డాట్గో సీఈఓ ఇందర్పాల్ ముమిక్ పేర్కొన్నారు. ఇందుకోసం యాపిల్ ‘ఐమెసేజ్’ క్లయింట్ గూగుల్ బ్యాక్ ఎండ్ సర్వర్లలో పనిచేయడానికి పరస్పరం ఇరు కంపెనీలు సహకరించుకున్నట్లు తెలిపారు. ఈ దేశాల్లో ఆర్‌సీఎస్‌ కోసం క్యారియర్ నెట్ వర్క్‌లను అనుసంధానించినట్లు చెప్పారు. అయితే గూగుల్‌కు అంతగా ఆదరణ లేని చైనాలో ప్రత్యామ్నాయ సర్వర్ వెండర్లను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. జీఎస్ఎం అసోసియేషన్ అభివృద్ధి చేసిన అధునాతన ప్రోటోకాల్ ఆర్‌సీఎస్‌ మెసేజింగ్ హై-రిజల్యూషన్ మీడియా షేరింగ్, రీడ్ రసీదులు, టైపింగ్ ఇండికేటర్స్, ఇంటర్నెట్ ఆధారిత సందేశాలు వంటి ఫీచర్లను అందిస్తుంది. సాంప్రదాయ ఎస్‌ఎంఎస్‌, ఎంఎంఎస్‌ మాదిరిగా కాకుండా ఆర్‌సీఎస్‌ మొబైల్ డేటా లేదా వై-ఫై ద్వారా పనిచేస్తుంది. ఇది అంతరాయంలేని మెరుగైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందిస్తుంది.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 22,508 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 341 పాయింట్లు ఎగబాకి 74,169 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెబ్‌, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, నెస్లే, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌, పవర్‌ గ్రిడ్‌ స్టాక్‌లు భారీగా నష్టపోయాయి.

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ (Maruti Suzuki) మరోసారి వాహన ప్రియులకు షాకిచ్చింది. ఏప్రిల్‌ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. అత్యధికంగా 4 శాతం వరకు ఈ పెంపు (Price Hike) ఉంటుందని తెలిపింది. తయారీ ఖర్చులు, నిర్వహణ వ్యయాలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో వాహన ధరల పెంపు నిర్ణయం తప్పలేదని, దీంతో కొంతభాగం వినియోగదారులకు బదిలీ చేయడం మినహా వేరే మార్గం లేదని మారుతీ సుజుకీ (Maruti Suzuki) తెలిపింది. మోడల్‌ని బట్టి ధరల పెంపు ఉంటుందని పేర్కొంది. దేశీయ విపణిలో మారుతీ ఎంట్రీ లెవల్‌ ఆల్టో కే-10 నుంచి మల్టీపర్పస్‌ వెహికల్‌ ఇన్విక్టో వరకు పలు రకాల మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z