ScienceAndTech

రాళ్లదెబ్బలు తిన్న వందేభారత్ మరమ్మత్తులకు ₹5కోట్లు-NewsRoundup-Mar 19 2025

రాళ్లదెబ్బలు తిన్న వందేభారత్ మరమ్మత్తులకు ₹5కోట్లు-NewsRoundup-Mar 19 2025

* తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ (Smita Sabharwal)కు నోటీసులు జారీ చేసేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ రంగం సిద్ధం చేస్తోంది. ఇన్నోవా వాహనం అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి యూనివర్సిటీకి చెల్లించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొనుంది. ఒకటి రెండు రోజుల్లో ఆమెకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సభర్వాల్ లేఖ మేరకు 2016 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు.. నెలకు రూ.63 వేల చొప్పున అద్దె రూపంలో యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనం అద్దె పేరిట 90 నెలలకు రూ.61 లక్షలు తీసుకోవడాన్ని ఆడిట్‌ శాఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. స్మితా సభర్వాల్ అద్దెకు తీసుకున్న టీఎస్‌ 08 ఈసీ 6345 వాహనం నాన్‌ టాక్స్‌ కాదు, ఎల్లో ప్లేట్ వాహనం కాదు. ప్రైవేటు వ్యక్తిగత వాహనం పవన్‌కుమార్ పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో వెల్లడైంది. సీఎంవో స్మితా సభర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రశీదులు రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు తేల్చింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై ఇటీవల ఏజీ జరిపిన విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలు ఉన్నట్లు వెల్లడయ్యాయి. అందులో ఈ అంశం కూడా ఉంది. ఈ విషయంపై వివరణ కోరగా… స్మితా సభర్వాల్‌ వాహన అద్దెపై ఆడిట్‌ అభ్యంతరం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్దాస్ జానయ్య అన్నారు.

* ‘మహాత్మ’తో తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు నటి భావన (Bhavana). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్‌, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. ముఖ్యంగా భర్త నుంచి తాను విడాకులు తీసుకోనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై పెదవి విప్పారు. ఆయా కథనాల్లో నిజం లేదని వెల్లడించారు. కొంతమంది కావాలని ఇలాంటి కథనాలు సృష్టిస్తున్నారని చెప్పారు.

* భారత స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై తాజాగా కీలక సమాచారం ఒకటి బయటికొచ్చింది. ఇద్దరు విడాకులకు సంబంధించి ఆరు నెలల కూలింగ్‌ పీరియడ్‌ను మినహాయిస్తూ బాంబే హైకోర్టు తీర్పుఇచ్చింది.

* వైయస్‌ఆర్‌ జిల్లా పేరును వైయస్‌ఆర్‌ కడప జిల్లాగా మారుస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన కేబినెట్‌ భేటీ (AP cabinet) జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్‌రంజన్‌ మిశ్రా కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

* అట్టహాసంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన జరిగిందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు.

* వైకాపా అంటే చట్ట సభల్లో వాకౌట్‌.. రాజకీయాల్లో డ్రాపౌట్‌ పార్టీ అని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏద్దేవా చేశారు. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సందర్భంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ నేపథ్యంలో పయ్యావుల వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

* హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదల ఇళ్లే కాకుండా పెద్దలవి కూడా కూల్చాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. పెద్దల భవనాలను కూల్చినప్పుడే ప్రభుత్వ భూములను రక్షించినట్లు అవుతుందని పేర్కొంది. మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ ఇచ్చిన నోటీసులపై హైకోర్టులో పిటిషన్‌ చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం.. దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లోని ఆక్రమణలను ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ మంచి విషయమే అయినా చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తెలిపింది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది.

* వందేభారత్‌ (Vande Bharat) సహా ఇతర రైళ్లపై రాళ్ల దాడులకు సంబంధించి 2023 నుంచి ఫిబ్రవరి 2025 వరకు మొత్తం 7,971 కేసులు నమోదైనట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. వీటికి సంబంధించి 4,549 మందిని అరెస్టు చేశామని చెప్పారు. రాళ్ల దాడుల (Stone Pelting) ఘటనల వెనక ఉన్న కారణాలను తెలుసుకోవడం కోసం నిజనిర్ధరణ కమిటీ నుంచి నివేదిక కోరిందా? అని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి (Ashwini Vaishnaw) ఈ సమాధానం ఇచ్చారు. ‘‘2023, 24, ఫిబ్రవరి 2025 వరకు వందేభారత్‌ సహా వివిధ రైళ్లపై (Indian Railways) 7,971 రాళ్ల దాడుల ఘటనలు చోటుచేసుకున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతికేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నాం. ఈ ఘటనలకు పాల్పడిన వారిలో ఇప్పటివరకు 4,549 మందిని అరెస్టు చేశాం’’ అని రైల్వే మంత్రి వెల్లడించారు. ఈ దాడుల వల్ల దెబ్బతిన్న రైళ్ల మరమ్మతుల కోసం రూ.5.79 కోట్లు ఖర్చు చేశామన్నారు.

* మ‌న‌కు తినేందుకు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కానీ చాలా మంది అనారోగ్యాలను క‌లిగించే ఆహారాల‌నే తింటున్నారు. వీటితో రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం స‌మ‌యంలో చాలా మంది స్నాక్స్ పేరిట చిరుతిళ్ల‌ను, బేక‌రీ ఆహారాల‌ను, నూనె పదార్థాల‌ను అధికంగా తింటుంటారు. ఇలా ఎప్పుడో ఒక‌సారి తింటే ఫ‌ర్లేదు. కానీ కొంద‌రికి మాత్రం రోజూ సాయంత్రం స‌మ‌యంలో ఆయా ఆహారాలు ఉండాల్సిందే. ఇవ‌న్నీ బ‌రువును అధికంగా పెంచుతాయి. కొవ్వు పెరిగేలా చేస్తాయి. దీంతో డయాబెటిస్ వ‌స్తుంది. దీర్ఘ‌కాలంలో లివ‌ర్‌లో కొవ్వు కూడా పెరుగుతుంది. ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య రావ‌డంతోపాటు గుండె పోటు కూడా వ‌స్తుంది. క‌నుక సాయంత్రం స‌మ‌యంలో ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తినాలి. ఈ జాబితా గురించి చెబితే బ్లూ బెర్రీలు ముందు వ‌రుస‌లో నిలుస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z