Editorials

నేడు భగత్-రాజ్‌గురు-సుఖ్‌దేవ్‌ల వర్ధంతి-NewsRoundup-Mar 23 2025

నేడు భగత్-రాజ్‌గురు-సుఖ్‌దేవ్‌ల వర్ధంతి-NewsRoundup-Mar 23 2025

* ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీలన్నీ అధికారంలోకి వస్తున్నాయి.. కానీ, భారత్‌లో పుట్టిన కమ్యూనిస్టు పార్టీ మాత్రం అధికారంలోకి రావడంలేదని ప్రముఖ సినీనటుడు అజయ్ ఘోష్‌ అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరిగిన భగత్‌సింగ్‌ యువజన ఉత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్థంతిలో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీల పెద్దలు ఒక మెట్టు దిగాలని విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టు పార్టీల నేతలు కలవకపోతే దేశాన్ని ఎవరూ కాపాడలేరన్నారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒకే ఎర్రజెండాగా మారాలని ఈ సందర్భంగా అజయ్‌ ఘోష్‌ ఆకాంక్షించారు.

* ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌ భారీ విజయంతో ఆరంభించింది. హైదరాబాద్‌ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ 242/6 పరుగులకు పరిమితమైంది. ధ్రువ్ జురెల్ (70; 35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), సంజు శాంసన్ (66; 37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు)ల పోరాటం సరిపోలేదు. యశస్వి జైస్వాల్ (1), రియాన్ పరాగ్ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. చివర్లో షిమ్రాన్‌ హెట్‌మయర్ (42; 23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), శుభమ్ దూబె (34*; 11 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా అప్పటికే రాజస్థాన్‌ ఓటమి ఖరారైపోయింది. హైదరాబాద్ బౌలర్లలో సిమర్‌జిత్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, మహ్మద్ షమి, ఆడమ్ జంపా ఒక్కో వికెట్ పడగొట్టారు.

* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని హుకుంపేట వాంబే కాలనీలో తల్లి, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. ఏలూరుకు చెందిన ఎండీ సల్మా (38) , సానియా(16)ను కత్తితో పొడిచి హత్య చేశారు. తల్లి, కుమార్తెను హత్య చేసిన అనంతరం నిందితుడు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ మధ్యాహ్నం 3గంటలకు బంధువుల్లో ఒకరు వచ్చి ఇంటి తలుపు తట్టగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కిటికీలోంచి లోపలికి చూడగా మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న ఎస్పీ నరసింహ కిశోర్‌, ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ విద్య, బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్‌ అక్కడికి చేరుకొని క్లూస్‌ టీమ్‌తో వేలిముద్రలు సేకరించారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సానియాను ప్రేమించిన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.

* ప్రయాణికుల భద్రత మరచి.. ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ నిర్లక్ష్యంగా బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతడిని విధుల నుంచి తొలగించారు. మహారాష్ట్రలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబయి- పుణె మార్గంలో శనివారం ఎంఎస్‌ఆర్టీసీ (MSRTC) ‘ఈ-శివనేరీ’ బస్సులో డ్రైవర్‌ ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ డ్రైవింగ్‌ చేశాడు.

* తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హుటాహుటిన దిల్లీకి పయనమయ్యారు. తన షెడ్యూల్‌ ప్రోగ్రామ్‌ రద్దు చేసుకొని మరీ హస్తిన బయల్దేరి వెళ్లారు. హఠాత్తుగా కిషన్‌ రెడ్డి దిల్లీకి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

* సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు- కారు ఢీకొని దంపతులు, ఎనిమిదేళ్ల కుమార్తె ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులను గడ్డం రవీందర్‌, రేణుక, రితిక(8)గా గుర్తించారు.

* అమెరికాలో ఇద్దరు భారతీయులపై కాల్పులు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్జీనియాలోని ఓ డిపార్టుమెంటల్‌ స్టోర్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడే పనిచేస్తున్న భారత్‌కు చెందిన ఊర్మి (24), ఆమె తండ్రి ప్రదీప్‌ పటేల్‌ మృతిచెందారు. కాల్పులకు తెగబడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం మద్యం కొనేందుకు స్టోర్‌కు వెళ్లిన దుండగుడు ముందురోజు రాత్రి స్టోర్‌ను ఎందుకు మూసివేశారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే కాల్పులు జరపగా.. ప్రదీప్‌ పటేల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఊర్మి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది. భార్య, కుమార్తెతో కలిసి ఆరేళ్ల క్రితం ప్రదీప్‌ పటేల్‌ గుజరాత్‌ నుంచి అమెరికా వెళ్లినట్లు సమాచారం.

* ఏపీ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) దంపతులు పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రఖ్యాత స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సతీమణి బ్రాహ్మణి, తనయుడు దేవాంశ్‌తో కలిసి ఉన్న ఫొటోలను మంత్రి లోకేశ్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేసుకున్నారు. పవిత్ర హర్‌మందిర్‌ సాహిబ్‌ను దర్శించుకొని అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

* డేటా చోర్యం కేసులో గుజరాత్‌కు చెందిన టెక్‌ మహీంద్రా (Tech Mahindra) సీనియర్‌ ఉద్యోగి అమిత్‌ గుప్తాను ఖతార్‌ (Qatar) పోలీసులు అరెస్ట్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై తాజాగా మహీంద్రా గ్రూప్‌ స్పందించింది. తమ ఉద్యోగి అమిత్‌ గుప్తాతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. ఉద్యోగుల బాగోగులు చూసుకోవడం తమ బాధ్యత అని పేర్కొంది. ఈ కష్టసమయంలో వారి కుటుంబానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చింది. ఆయనను విడిపించడానికి ఇరుదేశాల అధికారులతో చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ఈ విషయంపై ఇప్పటికే ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. అమిత్‌ గుప్తాను విడిపించడానికి అక్కడి అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని.. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఈ కేసుకు అసలు కారణం ఏంటనే విషయం ఇంకా తెలియరాలేదు.

* దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)కు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని.. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి( YS Jagan Mohan Reddy) వివరించారు. జాతీయ ప్రాధాన్యతగా జనాభా నియంత్రణను నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్‌ ప్రక్రియ శిక్షగా మారకూడదని స్పష్టంచేశారు. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్‌ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ అమలుకు అడ్డంకిగా మారిన రాజ్యాంగంలోని 81(2)(ఏ) అధికరణ(ఆర్టికల్‌)ను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయని, లోక్‌సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వైఎస్‌ జగన్‌ శుక్రవారం లేఖ రాశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z