Business

మాల్యాపై భారతీయ బ్యాంకుల విజయం

Indian Banks Win Against Mallya Properties In Britain Court

గేమ్ రిజర్వ్, రెండు సూపర్యాచ్లు, విలువ కట్టలేని వింటేజ్ కార్లు, విలువైన చిత్రాలు, సుప్రసిద్ధ ఎల్టన్ జాన్ వినియోగించిన పియానో.. వంటి అత్యంత ఖరీదైన ఆస్తులు విజయ్ మాల్యా ఆధీనంలో ఉన్నాయి. అయితే అవి మాల్యాకే చెందినవని నిరూపించే ధ్రువీకరణ పత్రాలు పొందే హక్కు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల బృందానికి లభించింది. లండన్ హైకోర్టుకు చెందిన కమర్షియల్ కోర్టు విభాగ న్యాయమూర్తి జస్టిస్ రాబిన్ నాలెస్ ఈ మేరకు తీర్పు చెప్పారు. ‘బ్యాంకుల వాదన సంతృప్తికరంగా ఉంది. ఆయా ధ్రువీకరణ పత్రాలు లేకపోతే, అవి ఎవరివని నిగ్గుతేల్చే అవకాశం వారికి లభించదు. అది తేలితేనే వాటిని జప్తు చేసే అవకాశం ఉంటుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. తమకు రావాల్సిన 1.145 బిలియన్ పౌండ్ల రుణం కింద ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తులను స్తంభింపచేసే ప్రక్రియలో భారతీయ బ్యాంకులున్నాయి. విజయ్ మాల్యా తండ్రి విఠల్ మాల్యాకు చెందిన వీఎండీఎస్ ట్రస్ట్ యజమాని ఎవరో తేల్చే ధ్రువీకరణ కావాలనీ బ్యాంకులు కోరాయి. వివాదాస్పద ఆస్తులు ట్రస్ట్ ఆధీనంలో ఉన్నాయని ప్రకటించడమే ఇందుకు కారణం.