రఫుల్స్… ఈ డిజైనుకి ఇప్పుడు ఆదరణ ఎక్కువ. ఒక వస్త్రంపై మరో వస్త్రంతో కుచ్చిళ్లను అందంగా ఒక వరుసలో అమర్చడమే రఫుల్స్. ఒకప్పుడు చిన్న పిల్లల దుస్తులపై కనిపించిన ఈ శైలి ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్‌గా నయాగా సందడి చేస్తోంది. స్కర్టులు, కుర్తీలే కాదు చీరలు బ్లవుజులపైనా కనికట్టు చేస్తోంది.కాలేజీ అమ్మాయిలకు, సన్నగా ఉన్నవారికి, ట్రెండీగా కనిపించాలనుకునేవారికి ఇది చక్కని ఎంపిక. సాధారణంగా రఫుల్స్‌ని విడిగా కుట్టి దుస్తులకు అక్కడక్కడా జత చేస్తారు. ఈ డిజైన్ క్యాజువల్‌గా ఎంత లుక్ ఇస్తుందో, పార్టీవేర్‌గా ఎంచుకున్నా కూడా అంతే ప్రత్యేకత తెచ్చిపెడుతుంది. అయితే సందర్భం శరీరఆకృతిని బట్టి నచ్చింది ఎంచుకోవచ్చు.* సాధారణంగా రఫుల్స్ డిజైను కుచ్చిళ్లు కుచ్చిళ్లుగా ఒకచోట పట్టీలా వస్తాయి. వాటి అంచులూ అందంగా పైపింగ్ చేస్తారు. దీన్ని స్కర్టు, చేతి అంచులు, కుర్తీలు, గౌనుల చివరా ఎంచుకోవచ్చు. సన్నగా ఉన్నవారు ఆర్గాంజా, లినెన్ వంటివి ఎంచుకుని రఫుల్స్ పెట్టించుకుని చూడండి. బుట్టబొమ్మలా కనిపిస్తారు. దుపట్టాలు, బ్లవుజుల వంటివాటికీ ఈ రఫుల్స్ జతచేయొచ్చు. సాదా చీరకు జతగా కాంట్రాస్ట్ రఫుల్ హ్యాండ్స్ బ్లవుజు భలే ఉంటుంది. నిండుగానూ కనిపించొచ్చు.
* మరో రకం డబుల్ ఎడ్జ్ రఫుల్స్. ఇది టీనేజీ అమ్మాయిలకు బాగుంటుంది. జీన్స్, స్కర్ట్ వంటివాటిపై వేసుకునే టాప్‌ల మీదకు ఈ స్టైల్ నప్పుతుంది. స్ట్రిప్ మీద రెండువైపులా గేదరింగ్స్ రావడం వల్ల ట్రెండీగా ఉంటుంది. సింగిల్ షోల్డర్ టాప్‌లు వేసుకున్నప్పుడు భుజాల మీదకు వచ్చేలా ఎంచుకోగలిగితే బాగుంటుంది.
* కాస్త బొద్దుగా ఉన్నాం కదా! మాకు రఫుల్ స్టైల్ అంతగా నప్పదు అనుకోనక్కర్లేదు. ఇలాంటివారు ఓ పనిచేయొచ్చు. మీ శరీరంలో కనిపించకూడదనుకునే చోట ఈ డిజైనుతో కప్పేయొచ్చు. ఉదాహరణకు కాళ్లు సన్నగా ఉండి, పై భాగం లావుగా ఉన్నవారు కాళ్ల దగ్గర రఫుల్స్ వచ్చేలా చేయొచ్చు. చేతులు సన్నగా ఉన్నప్పుడు వాటికీ ఈ డిజైను పెట్టించుకోవచ్చు. ఇలాంటప్పుడు మరీ లేచి నిలబడే వస్త్రాలు కాకుండా షిఫాన్, జార్జెట్, క్రేప్ వంటి రకాలు ఎంచుకోవాలి.
* సన్నగా పొడుగ్గా ఉన్నవారు మెడదగ్గర రఫుల్ డిజైన్ పెట్టించుకుంటే బాగుంటుంది. అయితే ఇది వాటర్‌ఫాల్ రఫుల్స్‌లా ఉండాలి. అంటే పై నుంచి కిందకి జలపాతం జారుతున్నట్లుగా డిజైను చేస్తారు. రిసెప్షన్ వేడుక కోసం నవవధువులూ ఈ తరహా డిజైన్‌లను ఎంచుకోవచ్చు.