NRI-NRT

భార్యలను వేధించే ఎన్నారై అల్లుళ్లూ…మీ పాస్‌పోర్టులకు మూడింది

Indian Government Designs Policies To Cancel Passports Of Wife Abusing NRI Husbands

వేధింపులకు పాల్పడే విదేశాల్లోని అల్లుళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు మహిళా భద్రతా విభాగం దృష్టి సారించింది. ఇందులో భాగంగా వారిపై నమోదైన కేసుల వివరాలతో భారత విదేశాంగ మంత్రిత్వశాఖను సంప్రదించి పాస్‌పోర్టులు రద్దు చేయించేందుకు ప్రణాళిక సిద్ధ చేసింది. పాస్‌పోర్టు రద్దయితే తప్పనిసరి పరిస్థితుల్లో వారు స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. చట్టంలో ఉన్న ఈ వెసులుబాటు ఆధారంగా ఇప్పుడు ఐజీ స్వాతిలక్రా ఆధ్వర్యంలోని మహిళా భద్రతా విభాగం దీనిపై కసరత్తు మొదలుపెట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌ఐ మహిళా భద్రతా విభాగం అధికారులు ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా విదేశీ అల్లుళ్లపై నమోదైన కేసుల వివరాలను తెప్పిస్తున్నారు. మరోవైపు విదేశీ సంబంధాలు చూసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా వందలాది వరకట్న వేధింపుల కేసులు నమోదవుతున్నాయి. వీటిలో విదేశీ అల్లుళ్లకు సంబంధించినవీ ఉంటున్నాయి. వివాహం చేసి తమ కుమార్తెను అల్లుడితో పాటు విదేశాలకు పంపిన తర్వాత అదనపు కట్నం వేధింపులు మొదలవుతున్నాయి. అతికష్టంమీద తల్లిదండ్రులు తమ కుమార్తెలను స్వదేశానికి రప్పించి ఇక్కడ కేసులు పెడుతున్నప్పటికీ అల్లుళ్లు విదేశాల్లో ఉంటుండటంతో విచారణకు హాజరు కావడం లేదు. చివరకు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసి వదిలేస్తున్నారు. గత ఐదేళ్లలో దాదాపు 250 లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినా ఫలితం లేదు. అందుకే పాస్‌పోర్టు రద్దు చేయించాలని భావిస్తున్నారు. పాస్‌పోర్టు రద్దు చేస్తే ఏ దేశంలో ఉన్నా అది అక్రమం కిందికే వస్తుంది. సదరు వ్యక్తి పనిచేసే సంస్థ ఉద్యోగం నుంచి తొలగిస్తుంది. ఇదంతా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా జరగాలి. నమోదైన కేసు, దాని తీవ్రత, నిందితుడు విచారణకు హాజరుకాకపోవడం వంటి అంశాలను ఆధారాలతో సహా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు తెలపాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న సాంకేతిక సమస్య కారణంగా గతంలో దీన్ని సరిగా వినియోగించుకోలేదు. ఇప్పుడు ఎన్‌ఆర్‌ఐ మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేయడం, ఈ రంగంలో అనుభవం ఉన్న లాయర్లు, ఎన్జీవోలు సేవలు అందిస్తుండటంతో వారి సహాయంతో ప్రతి కేసునూ పరిశీలించాలని నిర్ణయించారు.