Business

ఎలక్టోరల్ బాండ్స్‌లో లొసుగులు

Electroal Bonds LoopHoles In India

మోడీ సర్కార్‌ తీసుకొచ్చిన వివాదాస్పద పథకం ‘ఎలక్టోరల్‌ బాండ్స్‌’పై ఎన్నో అనుమానాలు, ఫిర్యాదులు. ఈ పథకం పారదర్శకతపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. కార్పొరేట్లకు, అధికార రాజకీయ నాయకుల మధ్య తెరవెనుక ఒప్పందాలకు మార్గం (క్రోనీ క్యాపటలిజం) వేసిన పథకం ఇది. ఈ పథకానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటిది… ‘ఎలక్టోరల్‌ బాండ్స్‌’ లావాదేవీలపై ఎస్‌బీఐ కమీషన్‌ (సేవా రుసుము)ను కేంద్రం చెల్లించింది. మార్చి, 2018నాటికి ఎలక్టోరల్‌ బాండ్స్‌ పథకం కింద వసూలైన సొమ్ము రూ.5800కోట్లు. ఇందులో 95శాతం విరాళాలు అధికారపార్టీ బీజేపీకే వెళ్లాయి. వీటి లావాదేవీలకు సంబం ధించి సామాజిక కార్యకర్త లోకేష్‌ బాత్రా ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర ఆర్థికశాఖ పై సమాచారం విడుదలచేసింది. విరాళమిచ్చినవారో లేదా విరాళం తీసుకున్న రాజకీయ పార్టీనో కమీషన్‌ కట్టాలి. అలాకాకుండా కమీషన్‌ను కేంద్రం చెల్లించటమేంటని ఆర్థిక విశ్లేషకులు ప్రశ్నించారు. ఆర్థిక సేవలు వినియోగదారుడు అందుకుంటే ఇందుకుగాను బ్యాంకులు కమీషన్‌ విధిస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకు, డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా నగదు మరొకరికి లేదా సంస్థకు పంపితే…దీనిపై కమీషన్‌ వినియోగదారుడే కడుతున్నాడు. ఇంచుమించుగా ఎలక్టోరల్‌ బాండ్స్‌ లావాదేవీ కూడా ఇలాంటిదే. విరాళం ఇచ్చేవారికి(సంస్థ లేదా వ్యక్తి), రాజకీయ పార్టీకి మధ్య ఆర్థిక లావాదేవీ జరుగుతోంది. అలాంటప్పుడు ఇక్కడ బ్యాంకు కమీషన్‌ కేంద్రం కట్టడమేంటన్న ప్రశ్న బ్యాంకింగ్‌ రంగ నిపుణులు, ఆర్థిక విశ్లేషకులు లేవనెత్తుతున్నారు.  ప్రజలపై పన్నులు విధించి వసూలుచేసిన నిధుల్ని ఇలాంటి వాటికి వాడతారా ?అని వారు ప్రశ్నిస్తున్నారు. కమీషన్‌ను కేంద్రం కట్టిందంటే…అది ప్రజల డబ్బే కదా..అని వారు అన్నారు. అయితే ఈ వివాదంపై కేంద్రంగానీ, కేంద్ర ఆర్థికశాఖగానీ ఇంతవరకూ స్పందించలేదు.  ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా రాజకీయ పార్టీలు విరాళాలు పొందటమనే ప్రక్రియలో పారదర్శకత లోపించిందని నిపుణులు అభిప్రాయపడు తున్నారు. విరాళాలు ఇచ్చిన వ్యక్తి లేదా సంస్థల పేర్లు రహస్యంగా ఉంచుతున్నారు. తెరవెనుక అధికార రాజకీయ పార్టీ నుంచి ఎలాంటి లబ్ది పొందకుండానే వందలకోట్లు విరాళాలు ఎలా ఇస్తారన్న సందేహం వ్యక్తమైంది. ఎలక్టోరల్‌ బాండ్స్‌ పథకంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. విరాళాలు ఇచ్చినవారి పేర్లు బయటపెట్టాలనీ, ఈ పథకంలో పారదర్శకతే లేదనీ ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రీఫార్మ్స్‌’ సుప్రీంలో పిటిషన్‌ వేసింది.