Kids

పిల్లలూ…ఆడనెమలిని ఏమంటారో తెలుసా?

పిల్లలూ...ఆడనెమలిని ఏమంటారో తెలుసా? - Telugu kids animal information-what do you call a female peacock

నెమలి.. పుట్టిన రోజే అన్నీ నేర్చేస్తా
మీ అందరికీ నేనంటే భలే ఇష్టం కదూ…ఎంత ఇష్టం లేకపోతే నెమలీకలంటూ నా ఈకల్ని పుస్తకాల్లో దాచుకుంటారు?వాటిని మధ్య మధ్యలో మీ స్నేహితులకీ చూపించి ముచ్చటపడిపోతుంటారు?అందుకేనర్రా! మీతో ఓసారి మనసారా మాట్లాడదామని ఇలా వచ్చేశా!
***పచ్చ, నీలం రంగుల్లో మెరిసిపోతూ ఉండే నా రూపం అంటే మీకే కాదు నాకూ ముచ్చటగానే ఉంటుంది. మీలో కొంతమంది నన్ను నేరుగా చూసే ఉంటారు. దట్టంగా చెట్లు ఉండే ప్రాంతాలు, కొండకోనలు, అడవుల్లో ఉంటాం మేము.
* ఆకారంలో పెద్ద పక్షులం కదా. అందుకే దగ్గర దగ్గరల్లో బాగానే ఎగిరేయగలుగుతాం. ఎక్కువ ఎత్తులో, ఎక్కువ దూరాలైతే కాస్త కష్టం.
* మాది ఫెసియాడై కుటుంబం. రంగుల ఈకలు ఉండటం ఈ కుటుంబం ప్రత్యేకత.
* మేం మొక్కలు, జీవులు రెండింటినీ తింటాం. పాముల్లాంటి వాటిని వేటాడేస్తాం. హాంఫట్మనిపిస్తాం.
* రాత్రుళ్లు చెట్లెక్కి నిద్రపోతాం. అలాగైతేనే సింహాలు, పులుల్లాంటి శత్రువుల నుంచి బయటపడగలం. కింద ఉన్నప్పుడు అవి దాడి చేయడానికి చూస్తే చటుక్కున పైకెగిరి కొమ్మల మీదకెక్కి తప్పించుకుంటాం. దురదృష్టవశాత్తూ అప్పటికప్పుడు ఎగరలేకపోయామో? వాటిక ఆహారమైపోవాల్సిందే.
* జన్యువుల్లో తేడాల వల్ల కొన్నింటిలో వర్ణ ద్రవ్యం తగ్గిపోతుంది. అందుకే మాలో కొన్ని తెల్ల నెమళ్లు ఉంటాయి.
* మేం అందమైన పక్షులమే కాదు. తెలివైన వాళ్లమూ అని మీ సర్వేల్లో తేలింది.
* మా జీవితకాలం దాదాపుగా 20 ఏళ్లు.
***ఈకల రంగుల వెనక!
* మాలో మగ వాటికే పొడవాటి అందమైన తోకలుంటాయి. అవే మీరు పుస్తకాల్లో దాచుకునే నెమలీకలు. మా శరీరంలో ఆ తోకే 60శాతం ఉంటుంది. ఆడవాటికి ఎక్కువ రంగులు, పొడవాటి తోకలూ ఉండవు.
* ఏడాదికోసారి మేం ఈకల్ని వదిలేస్తాం. తర్వాత మాకు మళ్లీ అందమైన ఈకలు వస్తుంటాయి. వాటినే మీరు ఇళ్లలో పెట్టుకుంటారు. వాటి రంగుల అందాన్ని చూసి ఆనందిస్తుంటారు.
* మా తోకలు అరుదుగా ఆరడుగుల పొడవూ అవుతాయి.
* మా ఈకల్ని మీ వాళ్లు మైక్రోస్కోపుల్లో పెట్టి పరీక్షించినప్పుడు క్రిస్టల్స్ లాంటి నిర్మాణాలు కనిపించాయి. అవి వాటిపై పడే కాంతిని వేరు వేరు తరంగధైర్ఘ్యాల్లో పరావర్తనం చెందిస్తున్నట్లు గుర్తించారు. అందుకే మా ఒక్క ఈకలోనే బోలెడు రంగులు, షేడ్లు కనిపిస్తున్నాయని తేల్చారు.
***పిడికెడంత పిల్ల!
* మేం మూడు నుంచి ఐదు వరకూ గుడ్లు పెడతాం. వాటిని 28 రోజుల పాటు పొదిగి పిల్లల్ని చేస్తాం.
* ఒక రోజు వయసున్న పిల్ల సొంతంగా నడవగలదు, తినగలదు, నీరు తాగగలదు. తల్లి సాయం లేకుండానే అది ఈ పనులు చేసేసుకోగలదు.
* పుట్టిన వెంటనే మా పిల్లలు ఏమంత ఆకర్షణీయంగా ఉండవు. ఆరు నెలల తర్వాతి నుంచి మెల్లమెల్లగా వాటి ఈకలు రంగులద్దుకోవడం ప్రారంభిస్తాయి.
* వాటికి మూడేళ్లు వచ్చిన దగ్గరి నుంచి పొడవాటి నెమలీకలు రావడం ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి అవి పిల్లల్ని కనగలుగుతాయి. అలా జతని ఆకర్షించేందుకు మగవాటికి ఈ ఈకలన్నమాట.
* మీరంతా నెమలిని ఆంగ్లంలో పీకాక్ అనేస్తారు. నిజం వేరేగా ఉంది.
పీకాక్ అంటే మగ నెమలి మాత్రమే. ఆడనెమలిని పీహెన్ అంటారు. పిల్లను పీచిక్ అని పిలుస్తారు. ఇంకా మా నెమళ్ల గుంపును ‘పార్టీ’ అంటుంటారు. కొన్నిసార్లు దీన్ని మస్టర్ అనీ అనేస్తుంటారు. అంతే. బైబై.