Food

నెల్లూరులో బూజుపట్టిన మాంసం వడ్డిస్తున్న హోటళ్లు

Nellore Restauraters Serving Adulterated Meats Of All Kinds To Customers - నెల్లూరులో బూజుపట్టిన మాంసం వడ్డిస్తున్న హోటళ్లు

ప్రజల ప్రాణాలతో కల్తీరాయుళ్లు చెలగాటమాడుతున్నారు. అధికారులు ఎన్ని దాడులు చేసినా నిర్వాహకుల్లో మార్పు రావడం లేదు. జిల్లాలో కల్తీ ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్న బిరియానీ హౌస్, సింహపురి రుచులు హోటళ్లపై రెండు రోజుల క్రితం దాడులు చేసి అధికారులు కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నగరపాలకసంస్థ అధికారులు, ఆహార కల్తీనియంత్రణ శాఖ అధికారులు సంయుక్తంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు చేయగా దిమ్మదిరిగే నిజాలు బయట పడ్డాయి. ఫ్రిజ్‌లలో తీసేకొద్దీ బూజు పట్టి, రంగులు పూసిన మాంసం బయట పడుతూనే ఉంది. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండు వద్దగల శ్రీ సూర్య బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ముందుగా అధికారులు తనిఖీలు చేశారు. పెద్దఎత్తున ఫ్రిజ్‌లో రోజుల తరబడి నిల్వ ఉన్న కోడి, పొట్టేలు మాసం రొయ్యలు, చేపలు బయటపడ్డాయి. అధికారులు స్వాధీనం చేసుకుని రూ.50వేల జరిమానా విధించారు. అక్కడి నుంచి గౌడ్‌ (రాయల్‌ పార్క్‌) బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను తనిఖీ చేసి బూజు పట్టిన, కుళ్లిపోయిన మాంసం, చేపలు, రొయ్యలను స్వాధీనం చేసుకుని రూ.50వేల జరిమానా వేశారు. వహాబ్‌పేటలో పరివార్‌ భవన్‌లో దాదాపు 30 కేజీలు, రియాజ్‌ హోటల్, చారివీధిలోని మొగల్‌ దర్బార్‌లో తనిఖీ చేసి పెద్దఎత్తున ఫ్రిజ్‌లలో నిల్వ ఉన్న మాంసాన్ని స్వాధీనం చేసుకుని రూ.20వేల వంతున జరిమానాలు విధించారు. మాగుంట లేఅవుట్‌లోని రాజ్‌ దర్బార్‌లో తనిఖీలు చేయగా నిల్వ మాంసం బయటపడింది. రూ.50వేల జరిమానా విధించారు. నిర్వణ హోటల్‌ను తనిఖీ చేయగా ఎటువంటి అనుమతులు లేని మంచినీటి క్యాన్లను స్వాధీనం చేసుకుని రూ.20వేల జరిమానా వేశారు. అధికారులు దాదాపు 500 కేజీల నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నగరపాలకసంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి మాట్లాడుతూ హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో తీరు మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఆహార కల్తీ నియంత్రణ శాఖ గజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ, శానిటరీ సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.