ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అతి తక్కువ ధరకే భోజనం అందించాలనే ఉద్దేశంతో… గత టీడీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ క్యాంటీన్లన్నింటినీ… ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మూసివేసింది. దీనిపై పలు విమర్శలు ఎదురయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు ఈ విషయంపై అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. పేదల కోసం ఏర్పాటు చేసిన వాటిని ఎందుకు మూసివేశారంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో సైతనం ఈ అంశంపై మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ‘‘ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో 150 కోట్ల స్కాం జరిగింది. పేదలకు తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారు. రెండు లక్షలతో నిర్మించే క్యాంటీన్‌కు 30-50 లక్షలు ఖర్చయిందని లెక్కలు చూపారు.’’ అని విజయసాయి ట్విట్టర్ లో పేర్కొన్నారు. “5 ఏళ్ళలో పోలవరం ప్రాజెక్టులో అందినకాడికి దోచుకుందామని చూశారే తప్ప పూర్తి చేద్దామన్న చిత్తశుద్ధి చంద్రబాబు ఏనాడూ చూపలేదు. ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే సగం రాష్ట్రం జలసిరితో సస్యశ్యామలమయ్యేది. రోజుకు 60 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలయ్యేది కాదు” అని గత ప్రభుత్వంపై విజయసాయి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా విజయసాయి వరుస ట్వీట్లపై టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
అన్న క్యాంటీన్లను కూడా దోచుకున్నారు
Related tags :