Devotional

ఆ నాగబంధనం ఛేదించడం వీలుకాదు

Anantha Padmanabha Swamy Temple Naga Bandhanam Secrets-ఆ నాగబంధనం ఛేదించడం వీలుకాదు

శ్రీ మహావిష్ణువు 108 దివ్యదేశాల్లో అత్యంత ముఖ్యమైన క్షేత్రం తిరువనంతపురంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం. పాలకడలిలో శేషపాన్పుపై పవళించిన ఆ చిద్విలాసమూర్తి మహారూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభి యందు కలిగిన వాడు కాబట్టే ఆ పురుషోత్తముడిని పద్మనాభుడిగా పిలుస్తాం. శ్రీఅనంత పద్మనాభస్వామి ఆలయంలో వెలువడిన సంపద యావత్‌ ప్రపంచదృష్టిని ఆకర్షించింది. లక్షల కోట్లు విలువచేసే సంపదతో స్వామివారు ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యమూర్తిగా అవతరించారు. అనంతమంటే అంతు లేనిదని అర్థం. అంత సంపదను వందలసంవత్సరాలుగా ఆలయంలో నిక్షిప్తం చేసుకున్న ఆ స్వామి నిజంగా అనంతుడే. లోకంలో సంభవించే విపత్తులను అడ్డుకునేందుకు ఆ పరంధాముడు పలు అవతారాలు ఎత్తి శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేశాడు. ఆర్తితో పిలిస్తే భక్తులను ఆదుకుంటారు. అనంతమైన ఆ పరమాత్ముడు స్వయంగా వెలసిన క్షేత్రమే శ్రీఅనంత పద్మనాభక్షేత్రం.

స్వామిని పూజించిన బలరాముడు
ఈ ఆలయ ప్రస్తావన పలు పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు ఆలయాన్ని సందర్శించి పూజలు చేసినట్టు శ్రీమద్‌ భాగవతం తెలుపుతోంది. స్వామివారి మహత్యాన్ని పేర్కొంటూ 12 మంది ఆళ్వారుల్లో ఒకరైన నమ్మళ్వారు అనేక రచనలు చేశారు. కలియగం ప్రారంభమైన రోజున ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆలయ చరిత్రపై కచ్చితమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి ఆలయం నిత్యపూజలు అందుకున్నట్టు ఆలయానికి చెందిన రికార్దులు వెల్లడిస్తున్నాయి.

అనంతశయన మహత్య
అనంతపద్మనాభుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అన్న దానిపై అనంతశయన మహత్య గ్రంథం వివరాలను తెలుపుతోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం దివాకరముని అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. నిత్యం విష్ణునామ సంకీర్తనతో ఆయన నిమగ్నమయి ఉండేవాడు. ఒకరోజు భగవానుడు ఆయనకు బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ముద్దులొలికే ఆ పిల్లవాడిని చూసిన దివాకరుడు తన నివాసంలో ఉండాలని కోరాడు. అయితే ఆ పిల్లవాడు సాక్షాత్తు పరమాత్ముడే అన్న అంశాన్ని ముని గుర్తించలేకపోయారు. దీనిపై స్పందించిన చిన్నారి తాను చేసే పనులకు ఎలాంటి అడ్డుచెప్పకూడదని ఒకవేళ చెబితే వెళ్లిపోతానని నిబంధన పెడుతాడు. కొన్నిరోజులకు పిల్లవాడు చేసే అల్లరి ఎక్కువయింది. ఒకనాడు ముని తపోదీక్షలో ఉండగా సాలగ్రామాలను తీసుకువచ్చిన స్వామి అతని నోటిలో వేస్తాడు. దీంతో మునికి తపోభంగమైంది. పిల్లవాడిపై పట్టరాని కోపం ప్రదర్శిస్తాడు. పిల్లవాడు వెంటనే అదృశ్యమవుతూ తనను తిరిగి చూడాలంటే అనంతన్‌కాడు దగ్గరకు రమ్మని చెబుతాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తన నివాసంలో బాలుడిగా వున్న అంశాన్ని దివాకరముని గుర్తిస్తాడు. వెంటనే స్వామిని అన్వేషిస్తూ సముద్రతీరప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ వున్న భారీ వృక్షం నేలపై పడి శ్రీమహావిష్ణువుగా రూపాంతరం చెందింది. స్వామివారు భారీ రూపంగా దర్శనమిచ్చారు. అనంతుని దర్శనంతో అమితానందం చెందిన దివాకరముని అంతటి పెద్ద రూపాన్ని వీక్షించలేనని ప్రార్థించడంతో యోగదండం కంటే మూడింతలు పెద్దగా మారిపోయారు. స్వామిని కనులారా వీక్షించిన ముని స్వామికి ఒక టెంకాయలో మామిడికాయను వుంచి ప్రసాదంగా ఇస్తారు. ఇప్పటికీ ఈ పూజా విధానం ఆలయంలో కొనసాగుతుండటం విశేషం. ఈ క్షేత్రానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో వుంది. నంబూద్రి సన్యాసి వివమంగళ స్వామియార్‌ అనే విష్ణుభక్తుడికి కూడా అనంతుడు ఇలానే దర్శనమిచ్చినట్టు తెలుస్తోంది.

రాజులైనప్పటికీ స్వామికి దాసులే
తిరువనంతపురం ట్రావెన్‌కోర్‌ రాజులు ఏలుబడిలో ఉండేది. తిరువనంతపురం పేరు కూడా అనంత పద్మనాభుడి మీదుగా రావడం విశేషం. ట్రావెన్‌కోర్‌ రాజులు స్వామివారికి భక్తులు. తమను తాము ఏనాడు పాలకులుగా వారు ప్రకటించలేదు. పద్మనాభుడికి దాసుడిగా ప్రకటించుకొని అనంతునిపై వున్న అచంచలమైన భక్తిని చాటుకున్నారు. తొలినాళ్లలో ఆలయాన్ని విస్తరించేందుకు రాజా మార్తాండవర్మ ఇతోధికంగా కృషి చేశారు. ఆయన హయాంలోనే మూరజపం, భద్రదీపం అనే పూజా కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అనంతరం వారి వంశంలో వచ్చిన పాలకులు కూడా స్వామివారి దాసులుగా ఉండి అనంతమైన సంపదను పరిరక్షించారు.

మూలవిరాట్టును మూడు ద్వారాల్లో నుంచి దర్శించాలి
స్వామివారి మూలవిరాట్టును ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడంతో తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి వీక్షించాలి. రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ రోజుల్లో 4వేల శిల్పకారులు, 6వేలమంది కార్మికులు, నూరు ఏనుగులు ఆరునెలల పాటు శ్రమించి ఆలయంలోని పలు కళాకృతులను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది.

అనంతమైన సంపదకు రక్షకులు
కొంతకాలం క్రితం ఆలయంలోని నేలమాళిగల్లో లభించిన అనంతమైన సంపదకు ట్రావెన్‌కోర్‌ పాలకులు సంరక్షకులుగా వుంటున్నారు. వెల కట్టలేని నిధుల రాశిని స్వామివారికి అర్పించి తరతరాలుగా వాటిని సంరక్షిస్తున్నారు. ఇప్పటికీ ఒక గదిని ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసివుండటంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఈ గదిలో ఎంత సంపద వుంటుందో ఆ అనంతునికే తెలిసిన రహస్యం.

ఆలయ ప్రాంగణం
అనంతుని ఆలయప్రాంగణంలో అనేక మందిరాలు ఉన్నాయి. మహాశివునికి ఒక మందిరం వుండటం శివ, కేశవ బంధాన్ని చెబుతుంది. గణపతి మందిరం, యోగ నరసింహస్వామి గుడి, ఆంజనేయస్వామి ఆలయం, ఒట్టకల్‌ మండపం, అభిశ్రావణమండపం, కులశేఖర మండపం, శ్రీ బలిప్పుర ప్రదక్షిణ మార్గం, తిరువంబడి కృష్ణస్వామి మందిరం.. తదితర వాటిని వీక్షించవచ్చు. ఆలయంలోని కుడ్యకళ ఆకట్టుకుంటుంది.

ఎలా చేరుకోవాలి
⇒ కేరళ రాజధాని తిరువనంతపురం. ఈ నగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణాసౌకర్యాలున్నాయి.
⇒ తిరువనంతపురం రైల్వేస్టేషన్‌లో దిగి ఆలయాన్ని చేరుకోవచ్చు.
⇒ తిరునంతపురం విమానాశ్రయంలో దిగి ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయం సందర్శించుకునే సౌకర్యముంది.