తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఇష్టంలేదని ఎస్వీబిసి చైర్మన్, నటుడు పృథ్వి రాజ్ ఇటీవల పలుసందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల్ని పోసాని కృష్ణమురళి ఖండించారు. పృథ్వి తొదరపడి మాట్లాడాడని వ్యాఖ్యానించారు.
పోసాని వ్యాఖ్యలపై పృథ్వి తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోసాని కృష్ణమురళి నా సోదరుడి లాంటివారు. వైసిపిలో మేమెంత ఓ ఫ్యామిలీ. పోసాని నన్ను ఓ మాట అన్నా నాకు పర్వాలేదు అని పృథ్వి తెలిపాడు. పోసాని కృష్ణమురళి మళ్ళి ఆరోగ్యంగా వచ్చారు. అది చాలు. మేమిద్దరం ఇటీవల ఓ చిన్న చిత్రంలో కలసి నటించాం కూడా.
పోసానికి వైఎస్ జగన్ మంత్రిపదవి కట్టబెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు అని పృథ్వి ఈ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని రోజులుగా పోసానికి వైసిపిలో కీలక పదవి దక్కనున్నట్లు ఊహాగానాలు జోరందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు పృథ్వి కామెంట్స్ బలాన్ని చేకూర్చాయి.
ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. తాను వైసిపిలో ఉన్నందుకు అవకాశాలు రావడం లేదని అన్నారు. వచ్చిన అవకాశాలు కూడా పోతున్నాయి. ఇటీవల నాలుగు చిత్రాలకు అడ్వాన్సులు ఇచ్చి మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న హీరోలందరికంటే పెద్ద హీరో శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద పనిచేసే అవకాశం వచ్చింది. కాబట్టి సినిమాల్లో అవకాశాలు రాకున్నా పర్వాలేదు.
ఆ మధ్యన చంద్రబాబు గారు వెటకారంగా ఓ మాట అన్నారు. సినిమాల్లో అవకాశాలు లేని కామెడియన్లంతా వైసిపిలో చేరుతున్నారు అని. కానీ సైరాలో అద్భుతమైన పాత్రలో నటిస్తూ వైసీపీకి తాను ప్రచారం చేశానని పృథ్వి తెలిపాడు. ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన పృథ్వికి జగన్ ఎస్వీబిసి చైర్మన్ పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే.