Editorials

మేము వేలు పెట్టము

UNO Rejects Pakistan Plea To Interfere In Kashmir Issue - మేము వేలు పెట్టము

కశ్మీర్‌ వ్యవహారాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి భారత్‌ను తప్పుబట్టాలని ఆశపడిన పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వ్యవహరించాలని కోరిన పాక్‌కు ఐక్యరాజ్యసమితి షాకిచ్చింది. ఆ దేశ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన ఐరాస.. కశ్మీర్‌ ఇరు దేశాల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై పాక్‌ తీవ్రంగా స్పందించడమే గాక.. అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. కశ్మీర్‌ అంశాన్ని ఐరాస దృష్టికి తీసుకెళ్లి దీనిపై మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. అయితే ఇందుకు ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటేరస్‌ నిరాకరించినట్లు ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ మీడియాకు తెలిపారు.

కశ్మీర్‌ విషయాన్ని ఐరాసకు పాక్‌ రాయబారి మలీహా లోధి నిన్న గుటెరస్‌ దృష్టికి తీసుకెళ్లారు. కశ్మీర్‌ అంశంలో ‘తగిన పాత్ర’ పోషించాలని కోరారు. ఇందుకు గుటెరస్‌ స్పందిస్తూ.. భారత్‌-పాక్ మధ్య 1972 నాటి సిమ్లా ఒప్పందాన్ని గుర్తుచేశారు. ‘‘కశ్మీర్‌ అంశం భారత్‌, పాక్ మధ్య ద్వైపాక్షిక సమస్య.. దాన్ని శాంతియుతమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. ఇందులో మూడో పక్షం మధ్యవర్తిత్వం అవసరం లేదు’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్టీఫెన్‌ మీడియాకు వెల్లడించారు. ‘జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను సెక్రటరీ జనరల్‌ గుటెరస్ సమీక్షిస్తున్నారు. ఈ అంశంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు’ అని స్టీఫెన్‌ తెలిపారు.

అయితే కశ్మీర్‌ అంశాన్ని గుటెరస్‌ ఐరాస భద్రతామండలిలో ప్రస్తావించే అవకాశముందా అని స్టీఫెన్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘అలాంటి ప్రతిపాదనల గురించి తెలియదు. అయితే పాక్ అభ్యర్థన మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి పంపిన లేఖను భద్రతా మండలి సభ్యులకు పంపాం’ అని తెలిపారు. కాగా.. కశ్మీర్‌పై ఐరాస అభిప్రాయాన్ని వివరంగా చెప్పేందుకు స్టీఫెన్‌ నిరాకరించారు.

కశ్మీర్‌పై పాకిస్థాన్‌ చేసిన ప్రకటనలను అంతర్జాతీయ సమాజం పెద్దగా పట్టించుకోవడం లేదు. అమెరికా అయితే అది భారత్‌ అంతర్గత వ్యవహారమని పాక్‌కు తేల్చి చెప్పింది. ఫ్రాన్స్‌, రష్యా దేశాల నుంచి ఎటువంటి స్పందనలు రాలేదు.