సాగర మథనంలో ఎగజిమ్మిన గరళాన్ని మింగి గరళకంఠుడయ్యాడు. భూలోకవాసుల దాహార్తిని తీర్చేందుకు గంగమ్మను తలమీద ధరించి గంగాధరుడని పిలిపించుకున్నాడు. సకల జనులకు ముక్తినొసగుతూ ముక్తేశ్వరుడయ్యాడు… ఇలా ఒకటా రెండా భక్తుల పాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్న బోళా శంకరుడికి నామాలు అనేకం. మహిమలు అనంతం. అంతటి మహిమకల స్వామి భక్తుడి ప్రాణాలు రక్షించడానికి స్వయంగా పహారా కాసిన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిమీదకు అనేకసార్లు దండెత్తిన జరాసంధుడు ఒకానొక యుద్ధంలో కిట్టయ్యచేతిలో మరణాన్ని తప్పించుకుని పారిపోయి హేలాపురి చేరుకుంటాడు. అక్కడే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని శివుడి కోసం తపస్సు చేస్తాడు. అతడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు జరాసంధుడు తనకి శ్రీకృష్ణుడి చేతిలో మరణం సంభవించకుండా ఎప్పుడూ తన దగ్గరే ఉండి తనను రక్షించమని వేడుకుంటాడు. దీంతో శివుడు లింగరూపంలోనే ఉంటూ జరాసంధుడికి పహారా కాయడం వల్ల ఈ క్షేత్రానికి జ్వాలాపహరేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. కాలక్రమంలో హేలాపురి ఏలూరుగా స్థిరపడిపోయింది.
చరిత్రకు దర్పణం
జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయాన్ని పదో శతాబ్దంలో వేంగి చాళుక్యులు నిర్మించారని ఆలయ శాసనాలు తెలియజేస్తున్నాయి. వేంగీ రాజుల కాలంలో నిర్మించిన నూట ఎనిమిది శివాలయాల్లో జ్వాలాపహరేశ్వర ఆలయం ఒకటి. నాటి నుంచి నేటి వరకూ స్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలందుకోవడం విశేషం. ఈ క్షేత్రంలో కొలువైన జ్వాలాపహరేశ్వరస్వామిని జరా పహరేశ్వరస్వామి, జలా పహరేశ్వరస్వామి అని కూడా పిలుస్తారు. అంతరాలయంలోని శరభసాళ్వం అనే కుడ్యశిల్పం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శరభ సాళ్వం దర్శనంతో కాలసర్పదోషాలు తొలగిపోతాయని ప్రతీతి. కాకతీయుల కాలంలో శివాచార్యులు అనే శివభక్తుడు స్వామిని సేవించారని చెబుతారు. ప్రముఖ చరిత్రకారులు ఇంగువ కార్తికేయశర్మ, మల్లంపల్లి సోమశేఖరశర్మ ఆలయాన్ని సందర్శించి, ఇది వేంగి చాళుక్యుల కాలం నాటి ఆలయమని నిర్ధరించారు.
సోదరభావానికి ప్రతీక
ఈ ఆలయాన్ని ఆనుకుని ముస్లింల దర్గా ఉంది. శివాలయంలోని రాజనంది కాలికి హజ్రత్‌పాషా షహీద్ పంచలోహ కడియాన్ని సమర్పించారని ప్రతీతి. దీనికి నిదర్శనంగానే ముస్లిం సోదరులు జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయానికి వచ్చి నందిని దర్శించుకుంటారు. అలాగే దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాల్లో ఆలయ అర్చకులూ, హిందూ సోదరులూ పాల్గొంటారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆలయంలోని నందిని వేంగి చాళుక్య రాజనందిగా పిలుస్తారు. సంతానంలేని వారు నంది మెడలో శనగల మూట కడితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఏ శివాలయంలోనైనా నంది తలమీద నుంచి శివయ్యను దర్శించుకోవడం ఆచారం. కానీ ఈ ఆలయంలో మాత్రం ఆలయం వెనక గర్భాలయం గోడకు ఉన్న రంధ్రం నుంచి శివుడినీ, ఆ తర్వాత రాజనందినీ దర్శించుకోవడం విశేషం.
ఇతర ఆలయాలు
ఆలయ ప్రాంగణంలోనే వందల ఏళ్ల చరిత్రగల మహిషాసురమర్దని అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారు ఇక్కడ పెద్దమ్మగా పూజలందుకుంటోంది. అమ్మవారి విగ్రహాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారని చెబుతారు. శరన్నవరాత్రులు, కల్యాణోత్సవం, కార్తికమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు. పెద్దమ్మ ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ ప్రాంగణంలోనే సీతారామస్వామి ఆలయం కూడా ఉంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ప్రతిష్ఠించిన గణపతిని సకల కార్యసిద్ధికి ప్రతీకగా కొలుస్తారు.
ఎలా చేరుకోవాలి
ఏలూరులో కొలువైన జ్వాలాపహరేశ్వరస్వామిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో కొత్త బస్‌స్టేషన్‌కి మూడు కి.మీ. దూరంలో ఉందీ ఆలయం. రాష్ట్రం నలుమూలల నుంచీ ఏలూరుకు బస్సు సౌకర్యం ఉంది. బస్టాండు నుంచి ఆటోరిక్షాల్లో ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. రైల్లో వచ్చే భక్తులు… ఏలూరు రైల్వేస్టేషన్‌లో దిగి, రోడ్డు మార్గంలో ప్రయాణించి స్వామిని చేరుకోవచ్చు.