ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద్వయంపై సూపర్‌స్టార్ రజినీ కాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. జమ్మూ కశ్మీర్‌కు 370 రద్దు చేయడంపై ఆయన స్పందించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాసిన ‘లిజనింగ్..లెర్నింగ్..లీడింగ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘మిషన్ కశ్మీర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. పార్లమెంటులో అమిత్‌షా ప్రసంగం అద్భుతం. అమిత్ షా- మోదీ ఇద్దరూ కృష్ణార్జున కాంబినేషన్‌లాంటి వారు. ఎవరెలాంటి వారో వారికి మాత్రమే తెలుసు. మీకంతా శుభాలే కలగాలి’ అని అన్నారు. వెంకయ్య గురించి మాట్లాడుతూ..‘ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తుంటారు. ఆయనోగొప్ప ఆధ్యాత్మిక వేత్త’ అని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనీ స్వామి, శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య తన రాజకీయ, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.