* తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ ఉపనేత పదవికి తాను రాజీనామా చేయనున్నట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. తాను రాజీనామా చేసిన అనంతరం ఆ పదవిని బీసీలకు ఇవ్వాలన్నారు. తెలుగుదేశం పార్టీలో వైట్ ఎలిఫెంట్స్ ను పక్కన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇక నుంచి తాను ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని స్పష్టం చేశారు.
*వారి సంఘర్షణలో భాగస్వామి కావడానికి వెళ్తున్నా: ప్రియాంక
నను కలవడానికి వచ్చిన వారిని తమ ఊరికే వచ్చి కలుస్తానని మాటిచ్చారు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా. అంతే కాకుండా వారి సంఘర్షణలో భాగిస్వామినవుతానని, కష్టసుఖాల్ని పంచుకుంటానని భరోసా కల్పించారు. తనను కలవడానికి వచ్చిన ఉభ్భా గ్రామవాసులతో ప్రియాంక చెప్పిన మాటలివి. ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వారిని కలవడానికి సోన్‌భద్రకు వెళ్తున్నారు ప్రియాంక. సోన్‌భద్ర కాల్పుల బాధితులను పలుమార్లు కలిసి పరామర్శించిన ప్రియాంక, అక్కడి ప్రజలకు చేరువయ్యారు. అంతే కాకుండా అక్కడి బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు.
*టీఆర్ఎస్‌కు బీజేపీ తోకపార్టీ: మల్లు రవి
తెలంగాణలో ఉనికి కోసమే కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి అన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన రవి.. టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ తోకపార్టీ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్రంలో బీజేపీకి టీఆర్ఎస్.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు బీజేపీ తోక పార్టీలు అని వ్యాఖ్యానించారు. క్యాడర్ లేని బీజేపీ నేతల మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరన్నారు. బీజేపీలో చేరికలు తాత్కాలికమే అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం అని రవి ధీమా వ్యక్తం చేశారు.
* రాజ్యసభకు మాజీ ప్రధాని నామినేషన్ దాఖలు
రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రెండు నెలల క్రితం బీజేపీకి చెందిన సభ్యుడు మదన్‌లాల్ సైనీ మృతితో ఖాళీ అయిన స్థానానికి ఈ నెల 26న ఎన్నికలు జరుగనున్నాయి.
మూడు దశాబ్దాలుగా అసోం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మన్మోహన్‌సింగ్‌కు.. ఈ దఫా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. 1991 నుంచి 2019 వరకు వరుసగా ఐదుసార్లు మన్మోమన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకు రెండుసార్లు వరుసగా ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 100 మంది సభ్యుల బలం ఉన్నది. అలాగే 12 మంది స్వతంత్య్ర సభ్యులు కూడా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండటంతో మన్మోహన్‌సింగ్ గెలుపు నల్లేరుపై నడక కానున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. మదన్‌లాల్ సైనీ మృతితో ఖాళీ అయిన స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ఆగస్టు 14గా పేర్కొన్నది. 26వ తేదీన అవసరమైతే ఎన్నిక నిర్వహించి అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ చేపట్టనున్నారు.
*ప్రాజెక్టు నిర్మించడం సులువనుకుంటున్నారా
పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మించడమంటే కాంట్రాక్టర్లను బెదిరించడం, బెట్టింగులు నిర్వహించినంత సులువు కాదని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఎద్దేవా చేశారు. కాఫర్ డ్యాం నిర్మించడం వల్లే గ్రామాలు మునిగిపోయాయంటూ వైకాపా నేతలు సరికొత్త పాఠాలు చెబుతున్నారని సోమవారం ట్విటర్లో మండిపడ్డారు. ‘ప్రాజెక్టు నిర్మాణంలోని ప్రతి విషయంలోనూ సాంకేతిక కమిటీలు ఉంటాయి. కేంద్రం పర్యవేక్షణ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారమే నిర్మాణాలు జరుగుతాయి.
*కల్వకుంట్ల తెలంగాణగా మార్చేసిన కేసీఆర్
రాష్ట్ర సాధన ఉద్యమం సమయంలో ప్రజాస్వామిక తెలంగాణగా చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ‘కల్వకుంట్ల తెలంగాణ’గా మార్చేశారని మాజీ ఎంపీ జి.వివేక్ విమర్శించారు. రాష్ట్ర ఉద్యమకారులను విస్మరించిన సీఎం.. తన కుమారుడు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసేందుకు హరీశ్రావును పక్కన పెట్టారని ఆరోపించారు. నీటి పారుదల ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకుని కమీషన్ల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవడంలో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించారు. ఇటీవలే భాజపాలో చేరిన వివేక్ సోమవారం మొదటిసారి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.
*మోపిదేవి, ఇక్బాల్, చల్లా.. వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
ఏపీలో ఎన్నికలు జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు వైకాపా అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రకటించారు. మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డిలకు అవకాశం దక్కింది. ఈ ముగ్గురు విజయం సాధించడం దాదాపు ఖాయం.
గోరంట్ల బుచ్చన్న తిరుగుబాటు?-రాజకీయ – 08/13
Related tags :