Editorials

నేను వేలుపెట్టను

Trump back off from his decision to interfere in kashmir issue

కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమేనంటూ ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన భారత్‌లో తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇకపై కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం కోసం తాను చేసిన ఆఫర్‌ ఇకపై ఎప్పుడూ చర్చకు రాదని ట్రంప్‌ స్పష్టం చేసినట్లు అమెరికాకు భారత రాయబారి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. ‘జమ్ముకశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం కోసం తాను చేసిన ప్రతిపాదన భారత్‌, పాకిస్థాన్‌ల అంగీకారంపై ఆధారపడి ఉందని ట్రంప్‌ గతంలో స్పష్టం చేశారు. రెండు దేశాలు ఒప్పుకుంటే మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమే అన్నారు. అయితే అందుకు భారత్‌ నిరాకరించడంతో మధ్యవర్తిత్వం ఆఫర్‌ ఇంకెప్పుడూ చర్చకు రాదని ఆయన స్పష్టంగా చెప్పారు. కశ్మీర్‌ వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేయకూడదనేది అమెరికా దశాబ్దాల నాటి విధానం. అయితే ఈ సమస్యను భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మాత్రం రెండు దేశాలను ప్రోత్సహిస్తూ వస్తోంది’ అని హర్షవర్ధన్‌ శ్రింగ్లా ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికా పర్యటనకు వచ్చిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో జులై 22న ట్రంప్‌ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం చేయాలని భారత ప్రధాని తనను కోరినట్లు ఆ సమయంలో ట్రంప్‌ చెప్పారు. ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌లో వివాదానికి తెరలేపాయి. దీంతో స్పందించిన భారత ప్రభుత్వం.. అగ్రరాజ్య అధ్యక్షుడి వ్యాఖ్యలను కొట్టిపారేసింది. మోదీ, ట్రంప్‌ మధ్య కశ్మీర్‌ ప్రస్తావనే రాలేదని తేల్చిచెప్పింది. ఇది జరిగిన కొద్ది రోజులకు ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌ సమస్య భారత్‌, పాక్‌ ద్వైపాకిక్ష అంశమే. అయితే ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కోసం మా సాయం కోరితే మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. దీనికి భారత్‌ స్పందిస్తూ.. ‘కశ్మీర్‌పై ఎలాంటి చర్చలైనా అవి కేవలం పాకిస్థాన్‌తో మాత్రమే.. అది కూడా ద్వైపాక్షికంగానే’ అని స్పష్టం చేసింది. దీంతో ఈ విషయంలో ట్రంప్‌ వెనక్కి తగ్గారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ భారత సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై అమెరికా స్పందిస్తూ.. అది పూర్తిగా ద్వైపాక్షిక అంశమేనని పేర్కొంది.