రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్ మెట్రో పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. మెట్రో తొలిదశను నాగోల్ నుంచి రాయదుర్గం వరకు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైటెక్‌సిటీ వరకు పూర్తయింది. రెండు మూడు నెలల్లో రాయదుర్గం స్టేషన్ నిర్మాణం పూర్తయ్యాక… విమానాశ్రయ మెట్రో పనులను మొదలుపెట్టాలనే ఆలోచనలో సర్కారు ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ మెట్రోకి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం లభించిందని… త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయనిబుధవారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రజా రవాణాను మెరుగుపర్చేందుకు… దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రజారవాణా వినియోగం తక్కువగా ఉంది. ప్రయాణికుల్లో 36 శాతం మంది మాత్రమే ఉపయోగిస్తున్నారని సర్కారు అంటోంది. ప్రజా రవాణాను మెరుగు పర్చేందుకు విమానాశ్రయానికి మెట్రో లింక్‌ను కలపడంతో పాటూ… కేపీహెచ్‌బీ నుంచి గచ్చిబౌలి వరకు ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30.7 కి.మీ. విమానాశ్రయ మెట్రో… మైండ్‌స్పేస్ చౌరస్తా నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ. దూరం ఉంటుంది. దిల్లీ మెట్రోరైలు సంస్థ సమగ్ర వివరాల నివేదిక (డీపీఆర్)ను రూపొందించింది. ఎక్స్‌ప్రెస్ మెట్రో కాబట్టి… ఇప్పుడున్న మాదిరి ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషన్ కాకుండా తక్కువ ఉంటాయి. మొత్తం 9 స్టేషన్లు రానున్నాయి. రాయదుర్గం, గచ్చిబౌలి, ఓఆర్ఆర్ వెంట విమానాశ్రయం వరకు ఈ మార్గం ఉంటుంది. ఎక్కువ దూరం భూమి మీద నిర్మించే ట్రాక్‌పైనే వెళుతుంది. రహదారులు అడ్డు వచ్చిన చోట పైన నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కోసం ప్రభుత్వం వేర్వేరు మార్గాలను అన్వేషిస్తోంది.
శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు
Related tags :