Politics

ఓ పెద్ద పార్టీ నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తోంది

Janasena Pawan Kalyan Says A Political Party Is Blackmailing Him

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ పార్లమెంటు పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన జనసేన నేత పవన్‌ మాట్లాడుతూ.. జనసేనను కలిపేయాలంటూ ఒక పెద్ద పార్టీ తనపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తోందని చెప్పారు. ఏ పార్టీలోనూ జనసేన పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదని పవన్‌ స్పష్టం చేశారు. మానవతా విలువల కోసం, జాతి సమగ్రతను కాపాడటం కోసమే జనసేనను ప్రారంభించామని… అందుకే మరే పార్టీలో జనసేనను కలపబోమని తెలిపారు. తన బలమేంటో, బలహీనత ఏంటో తనకు తెలుసని పవన్‌ చెప్పారు. సత్యం కోసం తాను పని చేస్తానన్నారు. ఏ విషయంలోనైనా ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే చెప్పాలని… అలా కాకుండా, రోడ్‌ మీదకు వెళ్లో, సోషల్‌ మీడియాలో పోస్టుల పెట్టడం ద్వారానో చెబితే వినడానికి ఇది కాంగ్రెస్‌ పార్టీ కాదని అన్నారు. సోషల్‌ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. జన సైనికులంతా వరద బాధితులకు చేయూతనివ్వాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం పవన్‌ తో ఫొటోలు దిగడానికి జన సైనికులు ఆసక్తి చూపారు. దీంతో పవన్‌ చమత్కరిస్తూ.. ” మీతో ఫొటోలు దిగడానికి ఇబ్బందేమీ లేదు… అయితే, అందరూ ఒకేసారి మీద పడిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది ” అని చెప్పారు.