ఆకలి వేయకపోవడం, తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం… వంటి సమస్యలను ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. వీటిని తగ్గించడంతోపాటు శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరిగేందుకు బ్రహ్మచర్యాసనం ఉపయోగపడుతుంది. దీన్నెలా వేయాలో, లాభాలేంటో తెలుసుకుందామా! ముందుగా యోగా మ్యాట్‌పై వజ్రాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు మోకాళ్లను కొంచెం ఎడంగా జరపాలి. పాదం వంగకుండా నిటారుగా ఉండేలా చూసుకోవాలి. నెమ్మదిగా కాళ్లను దూరం జరుపుతూ పిరుదులు మ్యాట్‌ను తాకేలా కూర్చోవాలి. చేతులను మోకాళ్లపై పెట్టుకుని వెన్నును నిటారుగా ఉంచి శ్వాసపై దృష్టి పెట్టాలి. కొత్తగా చేసేవారు తొడల కింద మెత్తటి తువాలును ఉపయోగించవచ్చు. మొదట్లో అయిదు నుంచి పదిసెకన్లపాటు మాత్రమే ఈ ఆసనంలో ఉండి… విశ్రాంతి తీసుకోవాలి. క్రమంగా సమయాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి.
లాభాలు: మధుమేహం, హెర్నియా సమస్యలు ఉన్నవారికి ఈ ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. శరీరంలోని వేడి తగ్గుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపు దీన్ని వేస్తే పొట్ట శుభ్రపడుతుంది. ఉదర సమస్యలూ తగ్గుముఖం పడతాయి.
జాగ్రత్త: మోకాళ్ల నొప్పులున్నవారు చేయకూడదు.