ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు బుల్స్ జోరుకు పుణెరి పల్టాన్ కళ్లెం వేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పుణెరి 31-23 తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. ట్యాక్లింగ్‌లో సుర్జీత్ సింగ్ (6), జాదవ్ (5) చెలరేగి బుల్స్‌ను ఓ పట్టు పట్టారు. రైడింగ్‌లో మంజీత్ (7) మెరిశాడు. రెండు జట్లు హోరాహోరీగా తలపడడంతో మ్యాచ్ పోటాపోటీగా ఆరంభమైంది. ఇరు జట్ల ఆటగాళ్లు పాయింట్ల కోసం తీవ్రంగా పోరాడారు. రెండు జట్లు తొలి అర్ధభాగాన్ని 10-10తో ముగించాయి. ద్వితీయార్థంలో పుణెరి జూలు విదిల్చింది. ప్రత్యర్థి రైడర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. బుల్స్ అగ్రశ్రేణి రైడర్ పవన్ సెరావత్ (5)ను లక్ష్యంగా చేసుకొన్న పుణెరి డిఫెండర్లు అతణ్ని కట్టడి చేయగలిగారు. 26వ నిమిషంలో బుల్స్‌ను ఆలౌట్ చేసిన పుణెరి 19-11తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అక్కడి నుంచి ఆ జట్టు దూకుడు తగ్గలేదు. క్రమంగా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా 28-18తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. అదే జోరుతో మ్యాచ్ కైవసం చేసుకుంది. మరో మ్యాచ్‌లో జైపుర్ పింక్‌పాంథర్స్ 28-26తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది.
కబడ్డీలో బెంగుళూరు పరాజయం
Related tags :