Sports

అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు – అంబటి

Ambati Rayudu Explains His Decision To Retire From International Cricket

ఇటీవల అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేసిన తెలుగుతేజం అంబటి రాయుడు.. వచ్చే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌కు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న టీఎన్‌సీఏ వన్డే లీగ్‌ ఆడుతున్న రాయుడు.. రాబోవు ఐపీఎల్‌ సీజన్‌లో కూడా తాను చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జట్టు తరఫునే ఆడతానని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడంపై రాయుడు మరోసారి స్పందించాడు. అది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమని చాలామంది విశ్లేషించిన క్రమంలో దానికి సమాధానమిచ్చాడు రాయుడు.‘అది నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదని కచ్చితంగా చెప్పగలను. గత నాలుగేళ్లలో నేను చాలా తీవ్రంగా శ్రమించాను అది కూడా వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకునే నిరంతరం కష్టపడ్డాడు. అయితే నాకు వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోవడంతో చాలా కలత చెందా. ఆ నేపథ్యంలో అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని అనుకున్నా. నువ్వు కష్టపడినప్పుడు అందుకు తగ్గ ఫలితం రానప్పుడు ఆలోచనలో పడతాం. అలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమే అది’ అని రాయుడు పేర్కొన్నాడు. గత రెండేళ్లుగా సీఎస్‌కే జట్టులో రాయుడు కీలక సభ్యుడిగా మారిపోయాడు. ప్రత్యేకంగా అతని బ్యాటింగ్‌ సామర్థ్యంతో ఏ స్థానంలో దింపినా సీఎస్‌కేకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు.