WorldWonders

భారత కేంద్ర మంత్రుల ఫోన్లు కొట్టేశారు

Thiefs Stole Indian Central Cabinet Ministers Mobile Phones

అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీకి కడసారి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది అభిమానులు వచ్చారు. తమ ప్రియతమ నేతను కోల్పోయామని వారంతా శోకసంద్రంలో ఉండగా.. కొందరు మాత్రం ఇదేమీ పట్టనట్లుగా చేతివాటం ప్రదర్శించారు. జైట్లీ అంత్యక్రియలు జరుగుతుండగా చోరీకి పాల్పడ్డారు. ఆ రోజు కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో సహా ఐదుగురి ఫోన్లు చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు. కేంద్రమంత్రులు బాబుల్‌ సుప్రియో, సోమ్‌ ప్రకాశ్‌, సుప్రియో సెక్రటరీ, మరో ఇద్దరి ఫోన్లు జైట్లీ అంత్యక్రియల్లో చోరీకి గురయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేశామని, ఫోన్లను ట్రేస్‌ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీపై బాబుల్‌ సుప్రియో మాట్లాడుతూ.. ‘నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఓ చోట జనాలు గుమిగూడి ఉన్నారు. నేను కూడా అక్కడకు వెళ్లాను. ఆ సమయంలోనే నా ఫోన్‌ చోరీ అయి ఉంటుంది. ప్రతి 10-15 నిమిషాలకు తమ ఫోన్‌ పోయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. నేను పోలీసులను తప్పుబట్టట్లేదు. కానీ ఘాట్‌లో ఇంకా ఎక్కువ సీసీటీవీ కెమెరాలు అమర్చాల్సి ఉంది’ అని అన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గత శనివారం తుదిశ్వాస విడిచారు. ఆదివారం దిల్లీలోని యమునా నది తీరంలో ఉన్న నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అధికార లాంఛనాలతో జైట్లీ అంత్యక్రియలు నిర్వహించారు. జైట్లీకి కడసారి వీడ్కోలు పలికేందుకు కేంద్ర మంత్రులు, ప్రముఖులు భాజపా కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు, అభిమానుల పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆ సమయంలోనే ఈ చోరీలు జరిగాయి.