ScienceAndTech

వాకీ టాకీ ప్రాజెక్ట్ బంద్

Apple Shuts Down Project Walkie Talkie - The Service That Works Without Network

టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన సీక్రెట్‌ ప్రాజెక్టును వాయిదా వేసినట్లు సమాచారం. యాపిల్‌ అత్యంత రహస్యంగా చేపట్టిన ప్రాజెక్ట్‌ షార్క్‌కు బ్రేక్‌ పడినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు పేటెంట్ల కోసం యాపిల్‌ దరఖాస్తు చేసుకొంది. కానీ బయటకు వెల్లడించని కారణాలతో ఈ ప్రాజెక్టుకు బ్రేకులు వేసినట్లు సమాచారం. తమ ఐఫోన్‌ వినియోగదారులు టెలిఫోన్‌ సిగ్నల్స్‌లేని ప్రదేశాల్లో ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి ఆఫ్‌ గ్రిడ్‌ రేడియో సర్వీసెస్‌ (ఓఆర్‌జీఎస్‌) అనే పేరు పెట్టింది. దీనిని ప్రాజెక్ట్‌ షార్క్‌గా వ్యవహరిస్తోంది. ఫోన్‌ సిగ్నల్స్‌ లేని చోట ఒక ఐఫోన్‌ వినియోగదారుడు మరో ఐఫోన్‌ వినియోగదారుడికి సంక్షిప్త సందేశాలను పంపించొచ్చు. సాధారణంగా ఇదేదో బ్లూటూత్‌, ఇన్ఫ్రారెడ్‌ నుంచి పంపినట్లు కాకుండా.. సుదూర ప్రాంతాల్లోని ఐఫోన్‌ వినియోగదారులకు కూడా సందేశాలు పంపేట్లు యాపిల్‌ నెట్‌వర్క్‌ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం 900 మెగా హెర్ట్జ్‌ రేడియో బ్యాండ్‌ను వాడుకోవాలని భావిస్తోంది. సాధారణంగా కర్మాగారాల్లో ఈ బ్యాండ్‌ను వాడుతుంటారు. సాధారణ సెల్యూలర్‌ నెట్‌వర్క్‌ను బైపాస్‌ చేసుకొని సూదూర ప్రాంతాలకు తరంగాలు పయనించేలా రేడియో సంకేతాలను వాడాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టుకు యాపిల్‌ ఎగ్జిక్యూటీవ్‌ రూబెన్‌ కబల్లెరో అధ్యక్షత వహించారు. ఆయన ‘ఆపరేషన్‌ షార్క్‌’ను తన మానస పుత్రికగా అభివర్ణిస్తారు. కొన్ని కారణలతో రూబెన్‌ ఏప్రిల్లో యాపిల్‌ను వీడారు. ఆయన మోడెం బృందం మొత్తాన్ని యాపిల్ హార్డ్‌వేర్‌ బృందంతో కలిపేసింది. ఈ బృందానికి జానీ స్రోజీ నేతృత్వం వహిస్తున్నారు. భవిష్యత్తులో ఐఫోన్లలో కృత్రిమ మేధ చిప్‌లను ఉపయోగించాలని యాపిల్‌ భావిస్తుండటంతో ఈ ప్రాజెక్టు అటకెక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.