* తెలుగుదేశం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ భారీ ఎదురుదెబ్బ తగలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా టీడీపీకి గురువారం రాజీనామా చేశారు. టీడీపీ మునిగిపోయే పడవ లాంటిదని, ఈ పార్టీకి భవిష్యత్తు లేదని విమర్శించారు. టీడీపీకి మనుగడ లేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవని వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పేదల అవసరాలను గుర్తించడంలో టీడీపీ వైఫ్యలం చెందిందని అన్నారు.
* ఆశల పల్లకిలో ఆనలుగురు
మరికొద్ది రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీఆర్ఎస్ కు కంచుకోటగా వరంగల్ లో ఇప్పటి వరకు ఒక్క ఎర్రబెల్లి దయాకరరావు కు మాత్రమే ఈసారి చోటు దక్కింది. గత పాలనలో డిప్యుటీ ముఖ్యమంత్రిగా చేసిన కడియంతో పాటు చాలామంది సీనియర్లు నిరాశకు గురయ్యారు. వీరితో పాటు గతంలో చాన్స్ దక్కకున్నా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినా వారు ఈసారి మంత్రి పదవి వస్తుందనే ఆశల పల్లకిలో ఉన్నారు. ప్రధానంగా ఓ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఈదఫా విస్తరణలో తప్పనిసరిగా తమకు బుగ్గకారు యోగ్యం దక్కుతుందనే కాన్ఫిడెన్స్ తో అడుగులు వేస్తున్నారు.
* కూన రవికి అండగా తెదేపా: అచ్చెన్న
తెదేపా నేత, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఇంట్లో బుధవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేయడంపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో జిల్లా తెదేపా బృందం శ్రీకాకుళంలో రవికుమార్ ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ కూన రవికి తెదేపా అండగా ఉంటుదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వైకాపా నేతలు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు.
* ఇమ్రాన్‌వి పసలేని ప్రేలాపనలు’
జమ్ము కశ్మీర్ భారత అంతర్గత అంశమని, ఈ వ్యవహారంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు అర్ధరహితమని ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఖన్నా స్పష్టం చేశారు. కాలిఫోర్నియాలోని ఫ్రీమోంట్‌లో ఇండో-అమెరికన్ కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారం..ఈ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాదోపవాదాలను పక్కనపెట్టి యుద్ధం, ఉద్రిక్తతలకు దారితీసే ప్రేలాపనలను విడనాడా’లని తేల్చిచెప్పారు. ఇమ్రాన్‌ఖాన్ యుద్ధోన్మాదం అర్ధరహితమని అమెరికన్ కాంగ్రెస్‌కు సిలికాన్‌వ్యాలీ నుంచి డెమొక్రటిక్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఖన్నా పేర్కొన్నారు. ఖన్నా వ్యాఖ్యలను ఇండియన్ అమెరికన్ సభ్యులు పెద్దఎత్తున స్వాగతిస్తున్నారు. కాగా కశ్మీర్ లోయలో మానవ హక్కుల ఉల్లంఘనల పట్ల కాంగ్రెస్ సభ్యురాలు ఇలా అబ్ధుల్లాహి ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్లో తక్షణమే స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొని కమ్యూనికేషన్ల వ్యవస్థ పునరుద్ధరించాలని, మానవ హక్కులు, ప్రజాస్వామ్య విధానాలను గౌరవించాలని ఆమె ట్వీట్ చేశారు.
* హరియాణా సీఎంనూ వదిలిపెట్టని పాకిస్థాన్
కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ తన వాదనను నెగ్గించుకోవడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తోంది. నిన్నటి నిన్న రాహుల్ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఐరాసలో వేసిన పిటిషన్లో ఆయన పేరును వాడుకుంది. తాజాగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌నూ వదిలిపెట్టలేదు. ఈయనతోపాటు ఉత్తర్ ప్రదేశ్ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ పేరునూ అందులో ప్రస్తావించింది. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ కశ్మీరీ మహిళలపై వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం.
* జైలుకు వెళ్లేవారు నాయకులవుతారు-జమ్మూ-కశ్మీర్ గవర్నర్ వ్యాఖ్య
‘‘అరే! ప్రజలు నాయకులవడం మీకు ఇష్టం లేదా? జైలుకు వెళ్లేవారు నాయకులవుతారు. ఎంత ఎక్కువ సమయం కారాగారంలో గడిపితే అంతగా వారు ఎన్నికల్లో లాభపడతారు’’ అని జమ్మూ-కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విలేకరులతో అన్నారు. ఆర్టికల్ 370 రద్దు; రాష్ట్ర విభజన అనంతరం ఆయన తొలిసారిగా విలేకరులతో మాట్లాడారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ తదితర నేతలను ఇంకా ఎన్నాళ్లు నిర్బంధిస్తారని ప్రశ్నించగా… మాలిక్ ఈ విధంగా సమాధానమిచ్చారు. తాను కూడా 30 సార్లు జైలుకెళ్లానన్నారు.
* బ్రిటన్ పార్లమెంట్ సమావేశాల సస్పెన్షన్
బ్రిటన్ పార్లమెంట్ సమావేశాలను అక్టోబర్ 14 వరకు సస్పెండ్ చేయాలన్న ప్రధానమంత్రి జాన్సన్ వినతికి బుధవారం ఎలిజబెత్ రాణి-2 ఆమోదం తెలిపారు. బ్రెగ్జిట్‌కు అక్టోబర్ 31 వరకు తుదిగడువు ఉండటంతో సరికొత్త శాసన అజెండాను ఆవిష్కరించేందుకు వీలుగా సమావేశాలను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని ప్రధాని నిర్ణయించారు. తాజా పరిణామాలపై విపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. బ్రెగ్జిట్‌పై చర్చ చేపట్టకుండా నిలువరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో దుయ్యబట్టారు. ఇది రాజ్యాంగపరమైన దౌర్జన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* చట్టసభల సభ్యులకు ప్రవర్తన నియమావళి!
చట్టసభల సమావేశాలకు ఆటంకం కలిగిస్తూ వెల్‌లోకి దూసుకొచ్చే సభ్యులపై వెంటనే (ఆటోమేటిక్‌గా) సస్పెన్షన్ వేటుపడేలా నిబంధనలు తీసుకురావాలని బుధవారం దిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన శాసనసభ, శాసనమండలి సభాపతుల సమావేశంలో తీర్మానించారు. ఇందుకోసం ఒక కమిటీ ఏర్పాటుచేసి దేశంలోని స్పీకర్లు, శాసనమండలి అధిపతులతో విస్తృతస్థాయి చర్చలు జరిపి నివేదిక తయారుచేయాలని నిర్ణయించారు. ఆ నివేదికపై నవంబర్ 12, 13 తేదీల్లో ఉత్తరాఖండ్ రాజధాని దేహ్రాదూన్‌లో జరిగే సభాపతుల సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు.
* ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వ్యూహాత్మక ప్రణాళికలు
హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంతో కూడిన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వ్యూహాత్మక ముందడుగుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో చైనాను సమతౌల్యం చేస్తూ, త్రైపాక్షికంగా ముందుకు సాగాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు దేశాల సమావేశం ఫ్రాన్స్‌లో ఈ ఏడాదే జరుగనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో ప్రధాని మోదీ ఇటీవల చేపట్టిన చర్చల్లో సురక్షిత స్వేచ్ఛాయుత నేవిగేషన్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతను కాపాడటం వంటివే అజెండాగా నిలిచాయి. ఇరుదేశాలు సముద్రయాన నిఘా కోసం ఉమ్మడిగా ఉపగ్రహాల్ని రూపొందాలని నిర్ణయించాయి.
* జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్లపై మంత్రుల బృందం!
కొత్తగా ఏర్పడనున్న కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్‌లలో అభివృద్ధి, ఆర్థిక, సామాజిక అంశాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేసినట్లు బుధవారం ఇద్దరు ఉన్నతాధికారులు చెప్పారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని మరో అధికారి చెప్పినట్లు పేర్కొంది.
* బంధువులను పదవులకు దూరంగా ఉంచండి: ప్రధాని మోదీ
‘‘వాస్తవాలనే చెప్పండి. నిరూపించడానికి ఆధారాలు ఉన్న అంశాలనే మాట్లాడండి. మాధ్యమాల్లోనూ, ప్రజల వద్ద అనవసరమైన విషయాలు ప్రస్తావించవద్దు’’ అని తన మంత్రివర్గ సహచరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన కేంద్ర మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ‘‘మీ మంత్రిత్వ శాఖల్లోనూ, విభాగాల్లోనూ సలహాలు ఇచ్చే అధికారులుగా మీ బంధువులు, ఆప్తులు, ఆత్మీయులను కూడా చేర్చుకోవద్దు’’ అని ప్రధానమంత్రి చెప్పారు.
*ప్రభుత్వ వైఫల్యం వల్లే ముంపు: సుజనాచౌదరి
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని లంక గ్రామాల్లో ఇటీవలి వరద ముంపు ప్రకృతి వైపరీత్యం వల్ల సంభవించలేదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే తలెత్తిందని ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. ఏదేమైనా వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ఈ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషిచేస్తానని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు.
*మోదీని ఏనాడూ సమర్థించలేదు: శశిథరూర్
‘‘ప్రధాని మోదీని నేనెప్పుడూ సమర్థించలేదు. ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో నేనేం మాట్లాడానన్నది పరిశీలిస్తే మీకు ఈ విషయం బోధపడుతుంది. ప్రభుత్వ బిల్లులపై అధ్యయనం చేయడంలోగాని, మోదీ సర్కారును ఇరుకున పెట్టడంలోగాని నేను చేస్తున్నదాంట్లో పదోవంతు కృషిచేస్తున్న మరెవరైనా కేరళ కాంగ్రెస్ నాయకుడు ఉంటే చూపించండి! 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఓట్లలో 20% కంటే తక్కువే వచ్చాయి. మోదీ మాత్రం గతం కంటే 6% ఎక్కువగా ఇటీవలి ఎన్నికల్లో 37% ఓట్లను భాజపాకు తెచ్చిపెట్టారు. దీనిపై కాంగ్రెస్ నేతలంతా సమీక్షించుకునే ప్రయత్నం చేయాలి.’’
*అధికార దాహంతోనే కేటీఆర్ విమర్శలు: పొన్నం
అధికార దాహంతోనే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తుమ్మిడిహట్టి పర్యటనకు వెళ్లిన తమపై విమర్శలు చేస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తమ డిమాండ్ వల్లే తుమ్మిడిహట్టి వద్ద శిలాఫలకం వేశారంటున్న తెరాస నాయకులు అక్కడ ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
*ఒక్కసారి మీ ఆర్థిక మంత్రులతో మాట్లాడండి
ఆర్బీఐ నిధులను దోచుకుంటున్నారన్న కాంగ్రెస్ పార్టీ విమర్శలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తీవ్రంగా స్పందించారు. ఇటువంటి ఆరోపణలు చేసేముందు కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక మంత్రులుగా పనిచేసినవారితోను, సీనియర్లతోను మాట్లాడాలని రాహుల్‌గాంధీకి సూచించారు. మంగళవారమిక్కడ ఆమె జీఎస్టీ సమావేశం మధ్యలో విలేకరులతో మాట్లాడారు. ‘‘దోపిడీ ఆరోపణలు చేయడం, ఒకరిని దొంగ అనడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. ఎన్నికల్లో చావుదెబ్బ తగిలినప్పటికీ ఆ పార్టీ ఇంకా వాటినే పట్టుకుని వేలాడుతుండడం ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ రాఫేల్ వివాదాన్ని నేరుగా ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు.
*కాళేశ్వరంతో విపక్షాల గుండెలదురుతున్నాయి
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, భాజపాలు విషం కక్కుతున్నాయని, అసత్య ప్రచారంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ప్రాజెక్టులో గంగ పొంగుతుంటే ప్రతిపక్ష పార్టీల గుండెలు అదురుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
*దిల్లీలో దోస్తీ.. గల్లీల్లో కుస్తీ!
భాజపా, తెరాస నేతలు దిల్లీలో అలయ్‌బలయ్ చేసుకుంటూ గల్లీల్లో తొడలు కొట్టుకుంటున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఉప్పల్‌లో పర్యటించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పార్లమెంటులో ఏ బిల్లు వచ్చినా భాజపా కంటే ముందే తెరాస వాళ్లే బటన్‌నొక్కి మోదీకి మద్దతు ఇస్తున్నారన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు భాజపా నాయకుల కంటే ఎక్కవగా మోదీ, అమిత్‌షాలను ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడారని ఎద్దేవా చేశారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని భాజపా నేతలు నడ్డా, లక్ష్మణ్ ఇటీవల పదేపదే ఆరోపిస్తున్నారు.
*ఉమ్మడి వామపక్ష ఉద్యమాన్ని నిర్మిస్తాం
జాతీయస్థాయిలో సీపీఐ, సీపీఎం సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాయని, ఉమ్మడి కమ్యూనిస్టుల ఉద్యమాన్ని ఎలా నిర్మించాలన్నదానిపై చర్చిస్తున్నామని సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా వెల్లడించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జాతీయభావం తమ రక్తంలోనే ఉందని, స్వాతంత్య్ర ఉద్యమంలో వామపక్ష నేతల పాత్ర ఉందని, ఆర్ఎస్ఎస్ వారు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
*యూరియా కొరతకు బాధ్యుల్ని శిక్షించాలి: తెదేపా
వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉమ్మడి కార్యాచరణతో ముందుకు కదలాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర నాయకుడు రమణ అధ్యక్షతన మంగళవారం ఎన్టీఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల్లో ప్రభుత్వ జాప్యంపై..సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నాను విజయవంతం చేసినందుకు కార్యకర్తలకు ఆయన అభినందన తెలిపారు. యూరియా కొరత సృష్టిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పార్టీ తరఫున వినతిపత్రాన్ని వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జాకు సమర్పించామన్నారు.
*రైతు కష్టం కేసీఆర్‌కు తెలుసు: మంత్రి నిరంజన్‌రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయానా రైతు కావడం వల్ల అన్నదాతల కష్టాలు ఆయనకు తెలుసని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అందుకే రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ ప్రతినిధులు, ఉపకులపతి డా.ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.
*రాజకీయ కేసులకు ప్రత్యేక ట్రైబ్యునల్
రాజకీయాల్లో ప్రత్యర్థులుగానే ఉండాలి తప్ప శత్రుత్వం ఉండకూడదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పదవి చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘మన రాష్ట్రంలో విమర్శలు పరాకాష్టకు చేరాయి. ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యం బలపడాలంటే సద్విమర్శలుండాలి. ఎన్నికైన ప్రధాని.. ముఖ్యమంత్రి.. ప్రతిపక్ష నేతలను గౌరవించాలి’’ అని సూచించారు.
*హైదరాబాద్ అభివృద్ధే జగన్ లక్ష్యం: యనమల
సీఎం జగన్ నిర్వాకాలతో రాష్ట్రం నాశనమవుతోందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. వైకాపా బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని, వ్యవసాయ, పారిశ్రామిక, ఉపాధి రంగాలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడమే జగన్ లక్ష్యమని, తెరాస రుణం తీర్చుకోవడానికి ఏపీ అభివృద్ధిని పణంగా పెట్టడం దారుణమన్నారు. కరవు, వరదలతో వ్యవసాయరంగం కుదేలైనా రైతుల్ని ఆదుకోకుండా, తెదేపాపై కక్షసాధించడం మీదే దృష్టిపెట్టారని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
*ఉమ్మడి వామపక్ష ఉద్యమాన్ని నిర్మిస్తాం: రాజా
జాతీయస్థాయిలో సీపీఐ, సీపీఎం సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాయని, ఉమ్మడి కమ్యూనిస్టుల ఉద్యమాన్ని ఎలా నిర్మించాలన్నదానిపై చర్చిస్తున్నామని సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా వెల్లడించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’లో ఆయన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జాతీయభావం తమ రక్తంలోనే ఉందని, స్వాతంత్య్ర ఉద్యమంలో వామపక్ష నేతల పాత్ర ఉందని, ఆర్ఎస్ఎస్ వారు ఎక్కడున్నారని ప్రశ్నించారు.
*జగన్ పాలన అస్తవ్యస్తం; రవీంద్ర
రాజధానిపై మంత్రుల వ్యాఖ్యలు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయని, అన్ని రంగాలు భ్రష్టుపట్టాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని మార్పుపై అపోహలు సృష్టించి వైకాపా నాయకులు నీచానికి దిగజారుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతిపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
*17న రాష్ర్టానికి అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. సెప్టెంబరు 17న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌ల్లో ఏదైనా ఓ ప్రాంతంలో దీన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశాయి. కాగా మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ విషయంపై చర్చించి, దీనిపై ఢిల్లీలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించాలని నిర్ణయించారు.
తెదేపాకు రాజా రాజీనామా-రాజకీయ–08/29
Related tags :