NRI-NRT

సింగపూర్‌లో అంతర్జాతీయ సంగీత నాట్యోత్సవాలు

International Telugu Dance And Music Festival In Singapore-సింగపూర్‌లో అంతర్జాతీయ సంగీత నాట్యోత్సవాలు

సింగపూర్ తెలుగు సమాజం-త్యాగయ్య టీవీల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీలో కర్ణాటక సంగీత సామ్రాట్ నాట్యసాగర్ అంతర్జాతీయ సంగీత నాట్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 150కు పైగా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆహుతులను అలరించారు. ముఖ్యఅతిథులుగా ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, నేపథ్య గాయని డాక్టర్ నిత్యశ్రీ మహదేవన్, వెంపటి చినసత్యం శిష్యులు నాట్యాచార్య డాక్టర్ కృష్ణకుమార్‌లు హాజరయ్యారు. నిత్యశ్రీ శాస్త్రీయ సంగీత విశేషాలను, ఆవశ్యకతను వివరించారు. ఇంతమంది కళాకారులకు సింగపూర్ లాంటి మహానగరంలో అంతర్జాతీయ స్ధాయిలో వేదిక కల్పించి వారి నైపుణ్యాన్ని బాహ్యప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కల్పించిన సింగపూర్ తెలుగు సమాజం-త్యాగయ్య టీవీలను ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణకుమార్ మాట్లాడుతూ శాస్త్రీయ నృత్య విశేషాలను, ప్రాముఖ్యతను, త్యాగరాజు జీవితవిశేషాలను వివరించారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతికి ఆలవాలమైన ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. త్యాగయ్య టీవీ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణన్, ముఖ్యకార్యనిర్వహణాధికారి జనార్ధన్‌లు నిత్యశ్రీ, కృష్ణకుమార్‌లను జీవన సాఫల్య పురస్కారంతో, కోటిరెడ్డిని కళాబంధు బిరుదుతో సత్కరించారు. కళాకారులకు ప్రశంసా పత్రాలు అందించారు. ఉత్సవం విజయవంతానికి కృషి చేసినవారికి కార్యక్రమ నిర్వాహకులు జ్యోతీశ్వర్, స్వాతి, సుప్రియలు కృతజ్ఞతలు తెలిపారు.