1. భ్రమరాంబదేవికి బంగారు ఖడ్గం – ఆద్యాత్మిక వార్తలు
శ్రీశైల భ్రమరాంబదేవికి అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి బంగారు ఖడ్గాన్ని బహూకరించారు. జేసీ ప్రభాకరరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భ్రమరాంబదేవికి 235 గ్రాముల బంగారంతో తయారు చేయించిన, రూ.9.45లక్షల విలువైన ఖడ్గాన్ని ఆశీర్వచన మండపంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి రామారావుకు అందజేశారు.
2. ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక కండువా
వినాయక చవితి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు అన్నీ ప్రత్యేకమే. నిత్యంవేలాది మంది దర్శించుకునే గణనాథుడి మెడలో ఉండే కండువాను యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి చేనేత పార్క్‌లో తయారు చేశారు. భూదాన్‌పోచంపల్లి మండలం కనుముకులలోని చేనేత పార్క్‌లో మగ్గంపై ఖైరతాబాద్ గణపతికి వరుసగా ఐదోసారి కండువా నేయించినట్లు పార్క్ ఛైర్మన్ కడవేరు దేవేందర్ గురువారం తెలిపారు. 25 మీటర్ల పొడవు, మీటరు వెడల్పుతో ఏకవస్త్ర కండువాను రూపొందిచనట్లు పేర్కొన్నారు. కండువాలో శివలింగం, ఢమరుకం, త్రిశూలం, లడ్డూలు, తామర, బాణం, కలశం, పుష్పం, ఓంకారం, స్వస్తిక్, శ్రీగణేశ్, జై గణేశ్ అనే ఆకారాలు, అక్షరాలు, పార్క్ గుర్తు ఉన్నాయని వివరించారు. చేనేత పార్క్ కళాకారులు నెల రోజులపాటు శ్రమించి కండువాను తయారు చేయించినట్లు చెప్పారు. వినాయక చవితి రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పిస్తామన్నారు. బాలాపూర్ వినాయకుడికి ఓ కండువాను సమర్పిస్తామని తెలిపారు.
3. వరసిద్ధి వినాయకునికి రూ.6 కోట్లతో బంగారు రథం
చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకునికి రూ.6 కోట్లతో బంగారు రథం తయారీకి అనుమతి ఇచ్చినట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తితిదే ఆధ్వర్యంలో పారదర్శకంగా నాణ్యమైన బంగారు రథంతయారు చేస్తున్నట్లు తెలిపారు. దాని తయారీకి అవసరమైన రూ.1 కోటి విలువ చేసే బంగారం, వెండిని తితిదేకి అప్పగించినట్లు పేర్కొన్నారు.
4. అన్నప్రసాదం ట్రస్టుకు కోటి పదివేలు వితరణ
విశాఖపట్టణానికి చెందిన దేవి ఫిషరీస్ లిమిటెడ్ కంపెనీ ఎండీయార్లగడ్డ సూర్యారావు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ నిత్యాన్నప్రసాద ట్రస్టుకు కోటి పదివేల రూపాయలు విరాళంగా అందించారు. కుటుంబ సమేతంగా గురువారం ఉదయం ప్రారంభ సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన రంగనాయకుల మండపంలో విరాళానికి సంబంధించిన డీడీని తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.
5 అమరావతిలో తితిదే ఆలయ నిర్మాణం కుదింపు!
రాష్ట్ర రాజధాని అమరావతిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మిస్తున్న శ్రీవేంకటేశ్వర దివ్యక్షేత్రం ఆలయాన్ని కుదించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించేందుకు తితిదే నిర్ణయించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భూకర్షణ క్రతువు పూర్తిచేసి.. పనులు ప్రారంభించింది. రూ.150 కోట్ల వ్యయంతో శ్రీవారి ప్రధాన ఆలయంతోపాటు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం నిర్మించనున్నారు. నైవేద్యం తయారీకి వంటశాల, ఉత్సవ మండపం, రథ మండపం, ప్రసాద మండపాలను నిర్మించాలనుకున్నారు. స్వామివారి పుష్కరిణి, వసతి సముదాయాలు, అన్నప్రసాదం కాంప్లెక్స్, ఆధ్యాత్మిక గ్రంథాలయం, కార్యాలయ భవనాలు, సిబ్బందికి అవసరమైన ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే రూ.10 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు.. తిరుమలలో శ్రీవారి ఆలయంలోని వెండి వాకిలి వరకు తొలుత అంతర్గత ప్రాకారం మాత్రమే నిర్మించాలని యోచిస్తున్నారు. మిగిలిన నిర్మాణాలపై తదుపరి పాలక మండలి సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
6. శుభమస్తు _ నేటి పంచాంగం
తేది : 30, ఆగష్టు 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అమావాస్య
(ఈరోజు సాయంత్రం 4 గం॥ 24 ని॥ వరకు)
నక్షత్రం : మఖ
(ఈరోజు సాయంత్రం 6 గం॥ 32 ని॥ వరకు)
యోగము : శివము
కరణం : చతుష్పాద
వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 48 ని॥ వరకు) పున:రా 1-58 ని నుండి 3-27 ని వరకు
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 12 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 57 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 1 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 32 ని॥ లకు
7. చరిత్రలో ఈ రోజు 30, ఆగస్టు సంఘటనలు
1574 – గురు రామ్ దాస్ నాలుగవ సిక్కు గురువు అయ్యాడు.
1791 – హెచ్.ఎమ్.ఎస్ పండోరా అనే నౌక ములిగిపోయింది.
1800 – వర్జీనియాలోని రిచ్ మండ్ దగ్గర బానిసల తిరుగుబాటుకి గేబ్రియల్ ప్రోస్సెర్ నాయకత్వం వహించాడు.
1813 – కుల్మ్ యుద్ధము: ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాల కూటమి ఫ్రెంచి సైన్యాలను ఓడించాయి.
1813: క్రీక్ యుద్దము.
1835: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరాన్ని స్థాపించారు.
1836: ఆగస్టస్ చాప్మాన్ అల్లెన్, జాన్ కిర్బీ అల్లెన్ హౌస్టన్ అనే ఇద్దరు హౌస్టన్ నగరాన్ని స్థాపించారు. హౌస్టన్, అమెరికాలోని నాలుగవ పెద్ద నగరము. టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరము.
1862: అమెరికన్ అంతర్యుద్ధము : రిచ్మండ్ యుద్ధము :
1862: అమెరికన్ అంతర్యుద్ధము : రెండవ బుల్ రన్ యుద్ధములో యూనియన్ సైన్యము ఓడిపోయింది.
1873: ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న ఫ్రాంజ్ జోసెఫ్ లేండ్ అనే అర్చిపెలాగోని ఆస్ట్రియాకు చెందిన సాహసికులు (యాత్రికులు) జూలియస్ వాన్ పేయర్, కార్ల్ వీప్రెచ్ కనిపెట్టారు.
1897: మడగాస్కర్ లో ఉన్న అంబికీ అనే పట్టణాన్ని, మెనాబే నుంచి ఫ్రెంచి వారు గెలిచారు.
1896: ఫిలిప్పైన్స్ లోని ఎనిమిది రాష్టాలలో స్పానిష్ గవర్నర్ జనరల్ రామన్ బ్లాంకో మార్షల్ లా (సైనిక పాలన) విధించాడు. ఆ రాష్ట్రాలు మనిలా, కవిటె, బులాకన్, పంపంగ, నువె ఎకిజా, బతాన్, లగున, బతంగస్.
1909: బర్గెస్ షేల్ ఫాసిల్స్ (శిలాజాలు) ని ఛార్లెస్ డూలిటిల్ కనిపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ శిలాజాలు బ్రిటిష్ కొలంబియాలో ఉన్నాయి. ఇవి 505 మిలియన్ (50 కోట్ల 50 లక్షలు) సంవత్సరాల నాటి మధ్య కేంబ్రియన్ యుగానికి చెందినవి.
1914: తన్నెన్‌బెర్గ్ యుద్ధము. మొదటి ప్రపంచ యుద్ధము మొదటి రోజులలో జర్మన్ సామ్రాజ్యానికి, రష్యన్ సామ్రాజ్యానికి 1914 ఆగష్టు 23 నుంచి 1914 ఆగష్టు 30 వరకు జరిగిన యుద్ధము.
1922: గ్రీకులకు, టర్కీ వారికి జరిగిన అంతిమ యుద్ద్యమును దుమ్లుపినార్ యుద్ధము (1919 నుంచి 1922 వరకు)అని (టర్కీ దేశీయుల స్వాతంత్ర్య యుద్ధము )అని కూడా అంటారు.
1941: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన రెండు సంవత్సరాలు లెనిన్గ్రాడ్ ముట్టడి మొదలైంది.
1942: రెండవ ప్రపంచ యుద్ధము : ఆలం హాల్ఫా యుద్ధము మొదలైంది.
1945: బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది.
1945: జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు.
1963: అమెరికా అధ్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అధ్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్‌లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి.
1967: అమెరికా సుప్రీం కోర్టుకు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్గుడ్ మార్షల్ ని నియమించారు.
1974: బెల్గ్రేడ్ నుంచి డోర్ట్‌మండ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు ‘జాగ్రెబ్’ అనే పెద్ద రైల్వే స్టేషను దగ్గర పట్టాలు తప్పింది. 153 మంది ప్రయాణీకులు మరణించారు.
1974: టోక్యో లోని మరునౌచి దగ్గర ఉన్న ‘మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ హెడ్‌క్వార్టర్స్ ‘ దగ్గర శక్తివంతమైన బాంబు పేలింది. ఎనిమిది మంది మరణించారు. 378 మంది గాయపడ్డారు. 1975 మే 19 తేదిని, ఎనిమిదిమంది లెఫ్ట్ వింగ్ సభ్యులను జపాన్ అధికారులు అరెస్ట్ చేసారు.
1980: పోలిష్ కార్మికులు కార్మిక సంఘపు హక్కులను సంపాదించుకున్నారు. సమ్మె చేస్తున్న పోలిష్ కార్మికులు కమ్యూనిష్టు పాలకులతో తలపడి, విజయం సాధించారు. ఫలితంగా, వారికి స్వతంత్ర కార్మిక సంఘాలను ఏర్పరచటానికి, సమ్మెచేసే హక్కు లభించాయి.
1982: పాలెస్తీనా లిబరేషన్ సంస్థ (పి.ఎల్.ఒ) నాయకుడు దశాబ్దం పైగా ఉంటున్న బీరూట్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
1984: అమెరికా రోదసీ నౌక ఎస్.టి.ఎస్-41-డిడిస్కవరీ స్పేస్ షటిల్ తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
1995: బోస్నియన్ సెర్బ్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి నాటో ‘ఆపరేషన్ డెలిబెరేట్ ఫోర్స్’ని అమలు చేసింది.
1999: ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు.
2001: యుగోస్లావియా మాజీ అధ్యక్షుడు స్లొబొదాన్ మిలోసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది.
2005: హరికేన్ కత్రినా, అమెరికాలోని న్యూ ఆర్లియెన్స్ ని తాకిన మరునాడు, 80 శాతము ‘న్యూ ఆర్లియెన్స్’ వరద నీటిలో ములిగిపోయింది. చాలామంది ప్రజలను హెలికాప్టర్లు / పడవల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
2010: డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.
* జననాలు*
1797: మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్ షెల్లీ, ఫ్రాంకెన్‌స్టీన్ నవలా రచయిత్రి (మ.1851).
1871: ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు. (మ.1937)
1912: వెల్లాల ఉమామహేశ్వరరావు, తెలుగు సినిమా తొ
లితరం కథానాయకుడు.
1913: రిచర్డ్ స్టోన్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
1934: బాలూ గుప్తె, భారతీయ క్రికెట్ ఆటగాడు. (మ.2005)
1937: జమున, తెలుగు సినిమా నటి.
1958: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడు. (మ.2005)
1959: నాగబాల సురేష్ కుమార్, రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత.
1983: మాధవి. ఒ, తెలుగు రంగస్థల నటి, గాయని.
1980: రిచా పల్లాడ్, తెలుగు మరియు హిందీ నటి.
* మరణాలు*
30 బి.సి.: క్లియోపాత్ర ఉచ్చారణ తేడా క్లియోపాట్రVII, ఈజిప్ట్ మహారాణి, గొప్ప అందగత్తె, ఆత్మహత్య చేసుకున్నది.
1949: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు తెలుగు రచయిత్రి. (జ.1899)
1963: రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (జ.1885)
2008: కృష్ణ కుమార్ బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (జ.1918)
2013: సీమస్ హీనీ, సుప్రసిద్ధ ఐరిష్ కవి, నాటక రచయిత మరియు నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1939)
పండుగలు మరియు జాతీయ దినాలు
అంతర్జాతీయ తప్పిపోయిన వారి దినోత్సవము.
సెయింట్ రోజ్ ఆఫ్ లీమా దినోత్సవము (పెరూ దేశము లో).
విజయ దినము (టర్కీ దేశము లో).
8. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకునే భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
9. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, స్టార్ షట్లర్ పీవీ సింధు, ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్‌శుక్లా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి అభిషేక సేవలో పాల్గొన్నారు.
10. శాస్త్రోక్తంగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ
టిటిడి అనుబంధ ఆలయమైన కడప జిల్లా ఒంటిమిట్టలో గల శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 31 నుండి సెప్టెంబరు 2వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణం, రక్షాబంధనం, మ త్సంగ్రహణం, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఆగస్టు 31న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు చతుష్టానార్చాన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం 6.00 గంటలకు పవిత్రహోమాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 1న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు బాలభోగం, పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 2న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం 5.00 గంటల నుండి స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం జరుగనుంది. ఆలయంలో సంవత్సరం పొడవునా జరిగిన పలు క్రతువుల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
11. భ్రమరాంబాదేవికి బంగారు ఖడ్గం
భ్రమరాంబాదేవి అమ్మవారికి తాడిపత్రి మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్‌రెడ్డి బంగారు ఖడ్గాన్ని బహూకరించారు. గురువారం శ్రీశైల భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం వచ్చిన జేసీ కుటుంబసభ్యులు పూజల అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బంగారు ఖడ్గాన్ని ఈవో రామారావుకు అందజేశారు. ఖడ్గం 235 గ్రాముల బరువు ఉంది. రెండు వైపులా తెల్లరాళ్లు, పచ్చరాళ్లతో ప్రత్యేకంగా తయారు చేయించారు. దీని విలువ రూ. 9.45 లక్షలని అధికారులు తెలిపారు.
12. దేశభద్రత కోసం మహాయాగాలు
*వచ్చే నెల 2 నుంచి 71 రోజులు జపాలు-నవంబరు 14 నుంచి తొమ్మిది రోజుల మహాక్రతువులు
దేశ భద్రత, సైన్య రక్షణ కోసం దైవ బలాన్ని ప్రోది చేయాలని అనంతపురంలోని శివకోటి శ్రీమహాలక్ష్మీ శ్రీపీఠం నిర్ణయించింది. యాగభూమి అయిన భారతదేశానికి ఉపద్రవాలు లేకుండా ఉండేందుకు జపాలు, యాగాలు నిర్వహించనున్నట్లు శివకోటి శ్రీపీఠం వ్యవస్థాపకులు అప్పాస్వామి(శివకోటి శివయ్యస్వామి) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘సెప్టెంబరు రెండో తేదీ నుంచి నవంబరు 13వ తేదీ వరకు 71 రోజులపాటు ప్రతినిత్యం 121 మంది రుత్విక్కులతో కోటి మహామృత్యుంజయ మంత్ర జపాన్ని అనంతపురంలోని శివకోటి దేవస్థానంలో నిర్వహిస్తాం. నవంబరు 14వ తేదీన మహాలక్ష్మీగణపతి యాగంతో తొమ్మిది రోజుల మహాక్రతువులు ప్రారంభమవుతాయి. 22 వరకు సాగుతాయి. అతిరుద్రయాగం, సహాస్రచండీ, లక్ష మృత్యుంజయ యాగం, సర్వరక్షణ కోసం బగళాముఖి, శ్రీప్రత్యంగిర జపం, యాగాలను చేస్తాం. ప్రజలు సైతం మృత్యుంజయ మంత్రాన్ని జపించి ఆ ఫలితాన్ని భరతమాత పాదాలకు ధార పోయాలి’’ అని అప్పాస్వామి పేర్కొన్నారు. జపం చేయాలనుకున్న వారు 98660 05751, 94408 34816, 94900 11044, 94418 20576, 85008 50016 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
భ్రమరాంబదేవికి బంగారు ఖడ్గం
Related tags :