Sports

ఎదురులేకుండా దూసుకుపోతున్న ఫెదరర్

The Unprecedented Victories Of Roger Federer In US Open 2019

యుఎస్‌ ఓపెన్‌లో రోజర్‌ ఫెదరర్‌కు తిరుగులేకుండా పోయింది. తన ఆటలో ఏ మాత్రం జోరు తగ్గట్లేదు. దూకుడైన ఆటతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తోన్న అతను పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్స్‌ గడప తొక్కాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన మూడో రౌండ్లో అతను 6-2, 6-2, 6-1 తేడాతో డాన్‌ ఇవాన్స్‌ (యూకే)ను చిత్తుచేశాడు. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ 6-3, 6-4, 6-2తో కుద్లా (యుఎస్‌ఏ)పై విజయం సాధించాడు. ప్రి క్వార్టర్స్‌లో అతను.. వావ్రింకాతో తలపడనున్నాడు. మరోవైపు ఏడో సీడ్‌ నిషికోరి (జపాన్‌) 2-6, 4-6, 6-2, 3-6తో డి మినార్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడాడు. ఇతర మ్యాచ్‌ల్లో వావ్రింకా (స్విట్జర్లాండ్‌) 6-4, 7-6 (11-9), 7-6 (7-4)తో లోరెంజి (ఇటలీ)పై, మెద్వెదెవ్‌ (రష్యా) 7-6 (7-1), 4-6, 7-6 (9-7), 6-4తో లోపెజ్‌ (స్పెయిన్‌)పై, గోఫిన్‌ (బెల్జియం) 7-6 (7-5), 7-6 (11-9), 7-5తో కారెనో (స్పెయిన్‌)పై గెలిచారు.

మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ దూసుకెళ్తోంది. మూడో రౌండ్లో ఆమె 6-3, 6-2తో ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై జయకేతనం ఎగరవేసింది. మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు సంధించిన సెరెనా.. మొత్తం 20 విన్నర్లు కొట్టింది. మిగతా మ్యాచ్‌ల్లో కీస్‌ (అమెరికా) 6-3, 7-5తో కెనిన్‌ (అమెరికా)పై, ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-1, 4-6, 6-4తో జాబెర్‌ (ట్యూనీషియా)పై, బార్టీ (ఆస్ట్రేలియా) 7-5, 6-3తో సక్కారి (గ్రీస్‌)పై, స్వితోలినా (ఉక్రెయిన్‌) 6-2, 6-0తో యస్త్రెంస్కా (ఉక్రెయిన్‌)పై నెగ్గారు. మూడో రౌండ్లో వోజ్నియాకి (డెన్మార్క్‌) 4-6, 4-6తో అండ్రెసె (కెనడా) చేతిలో పరాజయంపాలైంది. జులియా జార్జెస్‌ (జర్మనీ) 6-2, 6-3తో ఏడో సీడ్‌ బెర్టెన్స్‌ (నెదర్లాండ్స్‌)కు షాకిచ్చింది.

పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్‌ బోపన్న- షపోవలోవ్‌ (కెనడా) జంట రెండో రౌండ్లో అడుగుపెట్టింది. తొలి రౌండ్లో బోపన్న- షపోవలోవ్‌ జోడీ 6-3, 6-1తో హెర్బర్ట్‌- నికోలస్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచింది. పేస్‌ -డురాన్‌ ద్వయం తొలిరౌండ్లో 5-7, 2-6తో మియామిర్‌ (సెర్బియా)- కాస్పర్‌ (నార్వే) చేతిలో ఓడారు.