Movies

ఏదైనా సరే….I am ready

Alia Bhatt Says Any Role In Rajamouli Movie Is Fine With Her

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో తన పాత్ర నిడివి ఎంతసేపు ఉన్నా ఫర్వాలేదని బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ పేర్కొన్నారు. ఆమె ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సతీమణి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఆలియాది సినిమాలో అతిథి పాత్రని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆమె కేవలం కొన్ని సన్నివేశాలు, ఓ పాటలో కనిపిస్తారని రాస్తున్నారు. దీనిపై తాజాగా ఆలియా స్పందించారు. జక్కన్నతో కలిసి పనిచేయాలన్నది తన కలని తెలిపారు.

‘కరణ్‌ జోహార్ నన్ను నటిగా పరిచయం చేసిన తర్వాత నా విష్‌ లిస్ట్‌లో ఇద్దరు డ్రీమ్‌ డైరెక్టర్లు చేరారు. వారే సంజయ్‌ లీలా భన్సాలీ, ఎస్‌.ఎస్‌. రాజమౌళి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నా పాత్ర నిడివి ఎంతసేపు అయినా నాకు ఫర్వాలేదు. నాకు రాజమౌళితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.. అది చాలు. ఈ సినిమా కోసం నేను తెలుగు నేర్చుకుంటున్నా. నా మాతృ భాషలా తెలుగును కూడా చక్కగా మాట్లాడగలుగుతున్నానని చెప్పలేను. కానీ ప్రయత్నిస్తున్నా’ అని అన్నారు. ఈ నెలలో ఆలియా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం జక్కన్న దాదాపు రెండేళ్లపాటు పరిశోధనలు చేశారు. వచ్చే ఏడాది జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.