వానాకాలం వస్తూనే రోగాల్ని కూడా వెంటబెట్టుకొని వస్తుంది. ఈ కాలంలో దోమలు స్వైర విహారం చేస్తుంటాయి. ఇల్లుని శుభ్రంగా పెట్టుకోవడం ఇంట్లో అందరి బాధ్యత. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా జ్వరాలతో మంచం పట్టాల్సి వస్తుంది. నీరు నిల్వ వుండే ప్రదేశాల్లో దోమలు చేరే అవకాశం ఎక్కువ. చెత్త బుట్టలు శుభ్రంగా ఉంచడం, ఎప్పటికప్పుడు ఇంట్లో పనికి రాని వస్తువులను బయటపడేయడం, ఇంట్లో గాలి వెలుతురు వచ్చేలా కిటికీలు, తలుపులు తెరిచి వుంచడం, సింకులు తడి లేకుండా చూడడం చేయాలి.కుండీల్లో మొక్కలు బాగా పెరగాలని అవి ఇవీ అంటే ఉల్లి పొట్టుని, గుడ్డు పెంకుల్ని, వాడేసిన కాఫీ పొడిని వేస్తుంటారు. దాంతో సన్న దోమలు వస్తుంటాయి. ఈ వర్షాకాలం నాలుగు నెలలు వాటిని వేయకుండా వుంటేనే మంచిది. ఇంకా ఇంట్లోని చెత్తని గోడ అవతలో, రోడ్డు మీదో వేయకుండా ఓ కవర్లో వేసి మూట కట్టి చెత్త సేకరించే వారు వచ్చినప్పుడు ఇవ్వాలి. డస్ట్ బిన్స్ శుభ్రంగా ఉంచుకుంటూ, మూతలు వుండేలా జాగ్రత్తపడాలి. మున్సిపాలిటీ వారి సహకారంతో పరిసరాలు పరిశుభ్రంగా వుండేలా చర్యలు తీసుకోవాలి.
**వైరల్ ఫీవర్లు రాకుండా ముందు జాగ్రత్తలు
1. గుప్పెడు తులసి ఆకులను కప్పు నీటిలో వేసి మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆకులతో పాటు తాగేయాలి.
2. యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలను సమపాళ్లలో కలిపి తీసుకుని పొడి చేయాలి. కప్పు వేడి నీటిని తీసుకుని ఈ పొడి పావు చెంచా వేసి మూత పెట్టాలి. కొద్ది సేపటి తరువాత నీటిని వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే చెంచా తేనె వేసి తాగాలి.
3. జలుబుతో పాటు దగ్గు, జ్వరం వస్తుంటే ధనియాలు చక్కటి ఔషధంలా పనిచేస్తాయి. రెండు చెంచాల ధనియాలను కప్పు నీటిలో వేసి మరిగించాలి. వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా రోజుకి నాలుగైదు సార్లు తాగుతుంటే ఉపశమనం ఉంటుంది.
4. తరచూ అనారోగ్యాలకు గురికాకుండా వుండాలంటే రోజును గోరు వెచ్చని నీటితో ప్రారంభించండి. ఆహారాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే తినడానికి ప్రయత్నించాలి. మిగిలి పోయిన పదార్థాలు మళ్లీ వేడి చేసుకుని తినే పద్ధతి వద్దేవద్దు.
దోమలు రాకుండా ఉండాలంటే..
5. వెల్లుల్లిని ఎండబెట్టి పొడి చేసి కర్పూరంతో కలిపి ధూపంలా వేస్తే ఆ పొగకు దోమలు పరార్.
6. ఘాటైన సువాసన కలిగిన మొక్కల్ని పెంచడం ద్వారా కూడా దోమలు రాకుండా నివారించొచ్చు.
7. సిట్రెనెల్లా, లెమన్ బామ్, బంతి, జెరానియం, మాచిపత్రి మొక్కలు దోమలు రాకుండా చేస్తాయి.
8. వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే శరీరం దోమల్ని ఆకర్షించదట. తినడంతో పాటు ఓ చిన్న వెల్లుల్లి రెబ్బ తీసుకుని కుండీలో గుచ్చండి. మొక్కగా పెరుగుతుంది, దోమల్నీ నివారిస్తుంది.
వైరల్ ఫీవర్ తరిమికొట్టే చిట్కాలు
Related tags :