* టీడీపీలో మరో సారి కాపు కాక మొదలైంది. కీలక కాపు నేతలు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. మాజీ మంత్రులు గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు. అయితే వారిని చంద్రబాబు బుజ్జగిస్తున్నట్లు విశ్వస నీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారికి బీజేపీ నుండి ఆపర్ ఉన్నా..వైసీపీ వైపు వారిద్దరూ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు పార్టీ వీడినట్లేనని చంద్రబాు సైతం ఒక అంచనాకు వచ్చారు.ఆయన వైసీపీలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా.. పార్టీని వీడేందుకు ప్రకాశం జిల్లాలోని ఇద్దరు ముఖ్య నేతలు సైతం సిద్దం అవుతున్నారని ప్రచారం సాగుతోంది. అయితే, వీరంతా పార్టీ వీడకుండా చూసేందుకు పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా మాజీ మంత్రులు ఇద్దరు చంద్రబాబు సూచనలతో ఆలోచనలో పడినా.. పార్టీ వీడి వెళ్లటం మాత్రం ఖాయమని చెబుతున్నారు. దీంతో..టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైంది.టీడీపీని వీడాలని ఇద్దరు మాజీ మంత్రులు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ మంత్రులు గంటా శ్రీనివాస రావు..ఆయన బంధువు మంత్రిగా పని చేసిన నారాయణ సైతం టీడీపీ వీడే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే వీరు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా మాజీ మంత్రి లోకేశ్ విశాఖకు వచ్చిన సమయంలోనూ ఆయన పర్యటనలో గంటా పాల్గొనలేదు. ఇక, విశాఖ నగరంలో భూ కుంభకోణం పైన విచారణ కోసం ఆయన తాజాగా ముఖ్యమంత్రికి లేఖ రాసారు. టీడీపీ విశాఖ నగరంలో వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
* వంద రోజుల్లో మూడు వందల తప్పులు, ఆరు వందల రద్దులు :కళా వెంకట్రావ్
సీఎం జగన్ వంద రోజుల పాలనల్లో రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ఒక్క పనినీ చేయలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ విమర్శించారు. అన్నా కాంటీన్లను రద్దు చేసి వాటికి సున్నం రాశారని, కమిషన్ల కోసమే రద్దులపై దృష్టి సారించారని తీవ్రంగా ఆరోపించారు. విధ్వంసాలు, దాడులు, రద్దులు తప్ప, ఈ వంద రోజుల్లో ఏం చేశారని ఆయన సూటిగా ప్రశ్నించారు.
* చంద్రబాబుపై వ్యతిరేకతతో బీజేపీలో చేరలేదు: రేవూరి
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపై వ్యతిరేకతతో తాను బీజేపీలో చేరలేదని..కేవలం మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని రేవూరి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరాక మీడియాతో తొలిసారిగా రేవూరి మాట్లాడుతూ..సెంటిమెంట్‌ను రెచ్చగొట్టిన కేసీఆర్.. తనకు రాజకీయ జన్మనిచ్చిన టీడీపీని ప్రజలకు దూరం చేశారని పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర పార్టీ అని ముద్ర వేశారని… అందుకే గత ఎన్నికల్లో తాను ఓడిపోయానన్నారు. ఈ విషయాలన్నీ చంద్రబాబుతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.
*పద్మక్కకు నో ఎంట్రీ
తెలంగాణ గవర్నర్ నరసింహన్ కు ప్రభుత్వం వీడ్కోలు పలికింది. ప్రగతి భవన్ లో కార్యక్రమం నిర్వహించారు. వీడ్కోలు కార్యక్రమానికి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ డిప్యుటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడిని భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ఎమ్మెల్యేలకు పర్మిషన్ లేదని వెనక్కు పంపారు. అదే సమయంలో మంత్రి తలసాని తనయుడు సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా సాయికిరణ్ మాత్రం అనుమతించారు.
* ఒంటరిగానే హర్యానా అసెంబ్లీ బరిలోకి: మాయావతి
త్వరలో హర్యానా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బీఎస్పీ(బహుజన్ సమాజ్ పార్టీ) ఒంటరిగానే బరిలోకి దిగనుందని అధినేత మాయావతి పేర్కొన్నారు. అన్ని సీట్లలోనూ అభ్యర్థులను పోటీలో ఉంచనున్నట్లు ఆమె తెలిపారు. ఇంతకు ముందు అనుకున్నట్లుగా హర్యానాలోని దుష్యంత్ చౌతాలా (జన్నాయక్ జనతా పార్టీ)తో పొత్తును హైకమాండ్ నిర్ణయం మేరకు విరమించుకుంటున్నట్లు ఆమె ఈ సందర్భంగా ట్విట్టర్లో తెలిపారు. సీట్ల సర్దుబాటులో ఒప్పందం కుదరనట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, పోయిన నెలలో చౌతాలా మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామన్నారు. ఇక మాయావతి ట్వీట్‌తో ఈ ఒప్పంద విరమణ జరిగినట్లే.
*పొత్తు దెబ్బ
రాజకీయంగా లాభం పొందుతామని పొత్తులు పెట్టుకుంటారు. గణాంకాలు చూసి అవన్నీ అనుకూలమనుకుని పెట్టుకున్న రాజకేయ పొత్తులు ఫలించవని యూపీలో రుజువైంది. ఎస్పీ, బీ ఎస్పీ పొత్తులో లోక్ సభ సీట్లన్నీ వారివే అని గణాంకాలు చూపించారు. చివరిగా ఎస్పీకి గతంలో ఉన్న ఐదు సీట్లే వచ్చాయి. యాదవ్ కుటుంబపు కోడలు డింపుల్ కూడా ఓడిపోయింది. బీ ఎస్పీకి గతంలో సున్నా సీట్లు ఉంటె ఈసారి పది సీట్లు వచ్చాయి. అద్యక్షుడికి తన పదవిని తన బంధువులలో మరొకరి పదవిని మాత్రం ఉంచి మిగిలిన వారందరూ పదవులు రద్దు చేశారు. హటాత్తుగా ఎందుకలా వ్యవహరిస్తున్నాడో అర్ధం కావటం లేదు మిగిలిన నాయకులకు కింది స్థాయిలో పార్టీ వారంతా భాజపా వైపుకి వేల్లిపోతున్నారాన్ని ఆ విషయం బహిరంగమైతే తానె ఆయా శాఖల రద్దును ప్రకటిస్తున్నాడని తేలింది.
*భాషా చిక్కులు
భాజపా వారికి హిందీ పై మక్కువ ఎక్కువ. హిందీలో మాట్లాడటం దక్షినాది వారికి రాదు. వారి భాషల అభిమానం వారిది. ఇటీవల కేరళలో తీవ్ర వరదలు వచ్చాయి. ఆ సందర్భంగా వరద పరిస్థితి నష్టం పునరావాస చర్యల గురించి తెలుసుకునేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఫోన్ చేశారు. కేంద్ర మంత్రి హిందీలో ప్రశ్నలు వేస్తాడు. అది కేరళ ముఖ్యమంత్రికి అర్ధం కాదు. తనకు వహ్చిన మళయాళ భాషలో పిన్నరాయి సమాధానం చెపితే అది కేంద్ర సహాయ మంత్రికి అర్ధం కాదు. కేరళ ముఖ్యమంత్రి ఇంగ్లిష్ లో చెప్పిన సమాధానం కేంద్ర మంత్రికి ఎక్కలేదు. ఇలా తమ భాషా ఇబ్బందిలో కోడిసేపు గడిపి అప్పుడు తమ తమ అధికారులకు ఫోన్లు ఇచ్చారు. అప్పుడు డిల్లి కేరళ అధికారులకు తమకు వచ్చిన ఇంగ్లిష్ హిందీల్లో మాట్లాడి వివరాలు ఇచ్చి పుచ్చుకున్నాడు భావం అర్ధమయ్యే భాషలు రాజకీయ నాయకుల దగ్గర లేకుంటే ఇబ్బందులు ఇలాగే ఉంటాయి మరి.
*మెచ్చుకుంటున్నారు
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ మీద తీవ్ర పదజాలంతో విరుచుకు పడిన కాంగ్రెస్ నేతలల్తో కొందరు మారుమనసు పొంది నరేంద్రమోడిని తిట్టి తప్పు చేశామని చెంపలేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు వారి మారుమనసుకు కారణం. మొదటిది జమ్మూ కాశ్మీర్ ప్రత్యెక ప్రతిపత్తిని రద్దు చేయటం బహిరంగంగా ఏమీ మాట్లాడినా కాంగ్రెస్ నేతల మనసులో ఆర్టికల్ 370రద్దు సమజసమేనన్న భావన కనిపిస్తోంది. జయరాం రమేష్, అభిషేక్ సింఘ్వీ శశి ధరూర్ వంటి సీనియర్లు మోడీ చేస్తున్న పనులలో మంచివి చాలా ఉన్నాయి. ఆయన పేదల గురించి ఆలోచిస్తున్నాడు. అనవసరముగా మోడీని వ్యక్తిగతంగా తిట్టి తప్పు చేస్తున్నాం అంటూ ప్రకటనలు చేసి ఉండేవారు కాదు. అదే సమయంలో ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ కూడా మోడీని మెచ్చుకున్నాడు.
*విచిత్ర పోటీ
అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కి ప్రధాన ప్రతిపక్షం మేమంటే మేము అని కాంగ్రెస్, భాజపా పోటీ పడుతూ అధికార పార్టీకి వినోదం పంచుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. భాజపాకి ఒక్క సీటే దక్కింది. లోక్ సభ ఎన్నికలు వచ్చేసరికి భాజపా నాలుగు సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ కి మూడే దక్కాయి. కాబట్టి తమదే ప్రధాన ప్రతిపక్ష స్థానం అంటుంది. భాజపా అసలు భిజేపీకి సరైన పార్టీ నిర్మాణమే జిల్లాలో లేదు. నాయకులున్నా మేమే ప్రతిపక్షం అంటున్నారు. కాంగ్రెస్ నేతలు ముందు మీలో ఎవరు ప్రతిపక్షమో తేల్చుకోండి. అప్పటి వరకు మమ్మల్ని వదిలేసి మా పాలన మమల్ని చేయనీయండి అంటున్నది టీఆర్ఎస్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో ఎంపీలు భాజపాలో చేరిపోతుంటే ఇక ప్రతి పక్ష స్థానం కోసం పోరాటం ఎలా అన్నది సీనియర్ కాంగ్రెస్ నేతల బాధ.
*రాజన్న రాజ్యమన్నారు.. రాక్షస రాజ్యం తెచ్చారు..
‘‘రాజన్న రాజ్యమంటూ… రాక్షస రాజ్యం తెచ్చారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఏ తప్పూ చేయకపోయినా, అమాయకులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా టీడీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. వైసీపీ బాధితుల కోసం గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన పునరావాస శిబిరంలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. గుంటూరు జిల్లా పిన్నెల్లిలో 200 మందిపై నాలుగేసి చొప్పున కేసులు బనాయించారని ఆరోపించారు. టీడీపీకి అండగా ఉన్న బీసీ, ఎస్సీ, మైనారిటీలను లక్ష్యంగా చేసుకోని దాడులకు దిగుతున్నారని.. గ్రామాల్లో బలంగా ఉన్న టీడీపీ నాయకులను భయాందోళనకు గురిచేసి, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
*ఏపీలో టీడీపీకి ఊహించని షాక్…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు సీనియర్ నేతలు, సిట్టింగ్‌లు టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుస ఎదురుదెబ్బల నుంచి కోలుకోకమునుపే తెలుగుదేశంకు మరో ఊహించని షాక్ తగిలింది. టీడీపీ కీలక నేతల్లో ఒకరు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం ఉదయం.. తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతోపాటు మరికొంత మంది కౌన్సిలర్లు, ఇతర సంఘాల నేతలు కలిపి పది మంది పార్టీకి ఒకేసారి రాజీనామా చేయడం గమనార్హం. అయితే ఏ పార్టీలో చేరేది త్వరలో అందరితో చర్చించి ప్రకటిస్తానని సన్యాసి పాత్రుడు మీడియాకు వెల్లడించారు.
*టీడీపీకి ఆడారి ఆనంద్ రాజీనామా
విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమారుడు ఆనంద్, కుమార్తె పిళ్లా రమాకుమారి శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆనంద్ ప్రస్తుతం ఎలమంచిలి పట్టణ టీడీపీ అధ్యక్షునిగా, రమాకుమారి పార్టీ సభ్యురాలిగా ఉన్నారు. గడచిన ఎన్నికలలో ఆనంద్ అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ పక్షాన పోటీ చేసి ఓటమి చెందారు. రమాకుమారి ఎలమంచిలి మునిసిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న నేపథ్యంలో వీరిరువురూ టీడీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్టు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పంపిన లేఖలో పేర్కొన్నారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆనంద్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
*బొత్సకు కౌంటర్ ఇచ్చిన సుజనా చౌదరి
రాజధాని ప్రాంతంలో భూములన్నాయన్న మంత్రి బొత్స వ్యాఖ్యలపై సుజనా చౌదరి స్పందించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో సుజనా చౌదరి మాట్లాడుతూ ‘‘రాజధాని అంటే చొక్కా మార్చుకున్నట్లు కాదు. బొత్స ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్ల లోపాలు కప్పిపుచ్చుకునేందుకు ఇలా మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రతి రంగంలో అట్టర్‌ఫ్లాప్ అయింది. బొత్స భాషా ప్రావీణ్యాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఆయన మాట్లాడిన తీరు నవ్వొస్తుంది. 120 కంపెనీల్లో బొత్స చెప్పిన కంపెనీ పేరు లేదు. వాస్తవాలకు దగ్గరగా చెబితే ప్రజలు నమ్ముతారు. బొత్సకు సీడ్ కేపిటల్ ఏదో, సీఆర్డీఏ పరిధి ఏదో తెలియదు.
*ఆ భూములపై బొత్స స్పష్టతివ్వాలి: సోమిరెడ్డి
‘‘బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్‌కు చెందిన కంపెనీ భూములు ఇప్పుడు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయా;? లేక భరత్ చేతిలో ఉన్నాయా? అన్న విషయాన్ని మంత్రి బొత్స తేల్చి చెప్పాలి. బాలకృష్ణ అల్లుడు కాబట్టి ఏదో ఒక నింద మోపాలని చూడటం తగదు’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాజధాని విస్తరణ పరిధికీ, రాజధానికీ తేడా తెలియకుండా బొత్స లాంటి సీనియర్ మంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
*నా ఇంటిని ముంచడం కోసం.. లంక గ్రామాలన్నింటినీ ముంచారు: చంద్రబాబు
తాను ఉంటున్న ఇంటిని ముంచడం కోసం.. కృష్ణా పరివాహక లంక గ్రామాలన్నింటినీ ముంచారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. నేడు కృష్ణానది వరదలపై ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీటి ప్రవాహానికి సంబంధించిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు.వరదలు వచ్చే సమయానికి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ సమయంలో వచ్చిన వరదల్ని చాలా జాగ్రత్తగా నియంత్రించే అవకాశమున్నా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేకపోయారని ఆరోపించారు. ఐదారు లక్షల క్యూసెక్కుల నీటిని మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆగస్టు 7 వరకూ రాయలసీమలోని ప్రాజెక్టులకు నీరివ్వలేదని విమర్శించారు.
*అవినీతిపై చర్యలేవీ: మాణిక్యాలరావు
‘పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో ప్రకటించడంలేదు.. అవినీతిని బయటపెట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ గానీ, కేబినెట్ సబ్ కమిటీ గానీ ఇంత వరకు రికవరీ చేయలేదు. ఎక్కడా ఒక కేసు కూడా నమోదు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు దుయ్యబట్టారు. గురువారం భీమవరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం, ఇతర ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిననాయకులు, అధికారులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షం, అధికారపక్షం ఏకమై ఒప్పందం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల పనులు నిలుపుదల చేశారని, సెక్యులర్ దేశంలో ఇమామ్‌లకు, పాస్టర్లకు జీతాలు ఇవ్వడం ద్వారా మత ప్రచారం చేసుకోవడం కోసం ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ‘గతంలో ఏడు కొండలను రెండు కొండలు చేస్తూ రాజశేఖర్‌రెడ్డి జీవో ఇచ్చింది నిజం కాదా? ఆ రోజుల్లో హిందూ దేవాలయాల ఆస్తుల్ని పంచిపెట్టారు’ అని దుయ్యబట్టారు. అత్యధిక మెజారిటీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు తెలియకుండా.. రద్దుల జీవోలు జారీచేయడంలో ప్రభుత్వ ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
*ఏకపక్షంగా వెళ్లొద్దంటున్నాం: కన్నా
పోలవరం విషయంలో ఏకపక్షంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మొదటి నుంచీ బీజేపీ చెబుతూనే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం చేసిన సూచనలను ఆయన పట్టించుకోలేదని తప్పుబట్టారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో గోశాలలో గురువారం జరిగిన విశ్వశాంతి యజ్ఞానికి ఆయన హాజరయ్యారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ముందు నుంచి చెబుతున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు
*రొమ్ము కేన్సర్‌పై నిర్లక్ష్యం వద్దు: హరీశ్‌రావు
రొమ్ము కేన్సర్ పట్ల ప్రజలు కనీస అవగాహన కలిగి ఉండాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం సిద్దిపేటలో జరిగిన రొమ్ము కేన్సర్ అవగాహన సదస్సులో డాక్టర్ రఘురామ్‌తో కలిసి ఆయన పాల్గొని, మాట్లాడారు. ఈ కేన్సర్ నివారణలో తొలి అడుగు ఇక్కడి నుంచే పడాలన్నారు. ఇందుకోసం సిద్దిపేట, దుబ్బాక నియోజక వర్గాల్లో 35 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు మహిళలు స్ర్కీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కేన్సర్ వ్యాధి పట్ల అవగాహన లేకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పని అన్నారు. రొమ్ము కేన్సర్ అవగాహన మాసం (అక్టోబరు) సందర్భంగా.. వచ్చే నెల దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ వ్యాధి నివారణ మార్గాన్ని చూపించే మాసంగా అక్టోబరును మలచాలని వ్యాఖ్యానించారు. తల్లి మాటను స్ఫూర్తిగా తీసుకుని ఈ కేన్సర్ నివారణకు ముందుకొచ్చిన డాక్టర్ రఘురాం సేవలు అభినందనీయమన్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు అందించిందన్నారు.
*ఆలయంలోనూ దొరతనమా?: రేవంత్
యాదాద్రి ఆలయ రాతిస్తంభాలపై కేసీఆర్, టీఆర్ఎస్ గుర్తు కారు బొమ్మలు చెక్కడం దుర్మార్గమని, ఈ చర్య ద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలను కేసీఆర్ దెబ్బతీశారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. వ్యక్తి పూజ, వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం వ్యవస్థలను దెబ్బతీస్తున్న కేసీఆర్ నియంతృత్వానికి ఇది పరాకాష్ట అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రటకన విడుదల చేశారు. శతాబ్దాల చరిత్ర చూసినా ఏ పురాతన ఆలయాల్లోనూ వ్యక్తి ప్రాధాన్యంగా ఏ పాలకుల చిత్రాలను స్తంభాలపై చెక్కలేదన్నారు.
*ఇంకా దొరతనమా?: విజయశాంతి
యాదాద్రి ఆలయ స్తంభాలపై దేవతామూర్తులతో పాటు తన చిత్రం, టీఆర్ఎస్ గుర్తును చెక్కించుకోవడం ద్వారా సీఎం కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ధ్వజమెత్తారు. రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాతా ఆయన తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. కేసీఆర్ వ్యవహరించిన ఈ తీరుపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించాలన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు
*యూత్ హాస్టల్స్’ అభివృద్ధికి సహకరిస్తా : వినోద్
యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని వినోద్‌కుమార్ హామీ ఇ చ్చారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ట్రెక్కింగ్, క్యాంపింగ్ బ్రోచర్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు. దసరా సెలవులు రా నున్నందున.. తక్కువ ఖర్చుతో కుటుంబమంతా కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించేలా రూపొందించిన ఈ కార్యక్రమం గురించి అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు.
*గవర్నర్‌గా దత్తన్న.. బీసీలకు గౌరవం: జాజుల
కొత్త గవర్నర్లలో ఇద్దరు బీసీలు ఉండటంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయకన్వీనర్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బీసీలు అయిన బండారు దత్తాత్రేయ, తమిళిసై సౌందరరాజన్‌లను గవర్నర్లుగా నియమించడం యావత్ బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయను ఆయన మంగళవారం కలిసి అభినందించారు.
*ప్రభుత్వ స్కూళ్లను మెరుగు పర్చాలి: తమ్మినేని
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం లేఖ రాశారు. 5వ తరగతి విద్యార్థులు 3వ తరగతి తెలుగు వాచకాన్ని చదవలేకపోతున్నారన్నారు.
తెదేపాను వీడనున్న ఇద్దరు మాజీ మంత్రులు-రాజకీయ–09/07
Related tags :