అందాల పోటీల్లో తెలుగుదనం మెరిసింది. సెప్టెంబర్ 2 నుంచి7వ తేదీవరకు ముంబయిలో జరిగిన మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 పోటీల్లో ఈషా కోడె సత్తా చాటి టైటిల్‌ను సొంతం చేసుకుంది. భారతదేశం నుంచి వలస వెళ్లి వివిధ దేశాల్లో నివాసముంటున్న ప్రవాస భారతీయుల్లో యుక్త వయస్సు యువతుల మధ్య ఈ పోటీ జరిగింది. అమెరికా,కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, యూఏఈ, ఓమెన్, ఫిజి, మారిషస్, మలేషియా, సింగపూర్, హంగేరి, గునియా, జర్మనీ, సురనమ్, కెన్యా, గ్వాండ్, కోస్టారికా, ఐర్లాండ్, నేపాల్ తదితర దేశాల నుంచి వచ్చిన ప్రవాస అమ్మాయిల మధ్య ఈ పోటీ జరిగింది. 39 మంది పాల్గొన్న ఈ పోటీల్లో పాల్గొనగా వారిలో ఏడుగురు తుదిసమరానికి ఎంపిక అయ్యారు. ఐదు రోజుల పాటు వీరి మధ్య జరిగిన పోటీల్లో ఈషా కోడె విజేతగా నిలిచి మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 టైటిల్ దక్కించుకున్నారు. పద్మావతి చిత్రం నుండి “నయనో వాలే”కు ఈషా కోడె నృత్యం చేసి అందరిని ఆకట్టుకుంది. నిరాశ,ఆందోళన, ఒత్తిడి లాంటి మానసిక సమస్యలను అధిగమించి విజయపథంలో నడిచేందుకు స్వచ్ఛంద సంస్థ ద్వారా దీపికా పడుకునే చేస్తున్న కృషి తనకు స్ఫూర్తినిచ్చిందని అందుకనే ఆమె పాటను తాను ఎంచుకున్నానని ఈషా తెలిపారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. పిడియాట్రిక్ కార్డియక్ సర్జన్ కావాలనేది తన లక్ష్యమని వివరించారు. ఈషాకు భారతీయతపై తనకున్న మక్కువ, సేవాభావంపై ఉన్న నిబద్ధత కూడా అనుకూలంగా మారడంతో మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ 2019 కిరీటం సొంతమైంది. ఈషా కోడె మన తెలుగమ్మాయి. 90వ దశకంలో ఈషా కుటుంబం తెలుగునేల నుంచి అమెరికాకు వలస వెళ్లింది. ఏ దేశమేగినా ఎందుకాలిడిన మన భారతీయ వారసత్వాన్ని కాపాడుతూ….ఆమె తల్లిదండ్రులు ఈషాను పెంచారు. మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, మానవత్వ విలువలను ఆమెకు ఒంటబట్టేలా చేశారు. ఇదే ఈనాడు ఆమె ఉన్నతికి దోహదపడింది.
మిస్ టీన్ ఇండియా వరల్డ్‌గా కోడె ఈషా
Related tags :