Business

500 మందిని తొలగించిన జొమాటో

Zomato fires 541 employees. Says technology is much faster.

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సంస్థలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేసే క్రమంలో సుమారు 541మంది ఉద్యోగులపై వేటేసింది. దేశవ్యాప్తంగా ఈ చర్యలు తీసుకోవడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కస్టమర్‌ కేర్‌ ద్వారా వినియోగదారులు అడిగే ప్రశ్నలకు ఇకపై ఆటోమేషన్‌ ద్వారానే సమాధానాలు చెప్పనుంది.  ‘కొన్ని నెలల నుంచి మా సంస్థలో ఆర్డర్లు బాగా పెరిగాయి. కానీ, వేగంలో లోపం కారణంగా కొన్ని రద్దవుతున్నాయి. ఈ క్రమంలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో దాన్ని పరీక్షించాం. సాంకేతికత ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతోంది. ఆర్డర్‌కు సంబంధించిన ప్రశ్నలన్నింటికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా సమాధానాలు చెప్పదలిచాం. అందుకే సపోర్ట్‌ టీమ్‌లో దేశవ్యాప్తంగా 541 మందిని తొలగించనున్నాం. ఇది చాలా బాధ కలిగించే విషయమని మాకు తెలుసు. అలాగని ఇప్పుడే వారిని బయటకు పంపేయం. 2-4నెలలు వారు ఇక్కడే పనిచేసే అవకాశం కల్పిస్తాం. 2020 జనవరి వరకు తొలగించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు బీమా సౌకర్యం కల్పిస్తాం.’ అని జొమాటో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా జొమాటో ఇలాంటి సంచలన నిర్ణయమే తీసుకుంది. దాదాపు 5,000 రెస్టారెంట్లును తమ జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్దేశించిన ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపింది. దేశంలోని 150 పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకొన్న సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తామని వెల్లడించింది. జొమాటోతో అనుబంధం ఉన్న 80 వేల రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తామని తెలిపింది.