‘‘ఒక మహిళ లోపలికి రాగానే.. అందరి ముందూ ఆమె దుస్తులు విప్పి నగ్నంగా నిలబెడతారు. ఒక మనిషిని జైలులో పెట్టినపుడే అతడు కానీ ఆమె కానీ శిక్ష అనుభవిస్తున్నట్లే. ఇంకా ఆ మనిషి శరీరాన్ని కూడా ఇలా దిగజార్చి అవమానించి తీరాలా?‘‘
ఒక డైరీలో అక్షరబద్ధం చేసిన చీకటి చరిత్రలోని ఒక ప్రశ్న ఇది. అది ఒక మహిళ డైరీ. అది జైలులో రాసిన డైరీ. జైలు డైరీ. సరిగ్గా 43 సంవత్సరాల కిందట ‘ఎమర్జెన్సీ’ కాలంలో జైలు నిర్బంధంలో ఉన్న ఒక మహిళ రాసిన డైరీ. ఆ చీకటి చరిత్రకు సాక్షిగా నిలిచి బలైన ఓ వనిత ఆమె.
ఆమె పేరు స్నేహలతారెడ్డి. స్నేహగా.. స్నేహలతగా ఆమె సుపరిచితం. నర్తకిగా ఖ్యాతి గడించారు. నటిగా ప్రశంసలందుకున్నారు. పౌర హక్కుల ఉద్యమంలో ఒక కార్యకర్తగా భాగమయ్యారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు.
‘‘నా తల్లిదండ్రులు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ గళం విప్పారు. తమ అసమ్మతిని తెలియజేయటానికి నాటకం, సినిమా సహా వీలైన అన్ని వేదికలనూ ఉపయోగించుకున్నారు. ఇందిరాగాంధీ నిరంకుశత్వాన్ని వ్యతిరేకించే వారిని కూడగట్టడానికి రంగంలోకి దిగారు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయటం వల్ల ప్రమాదాలను వివరిస్తూ కరపత్రాలు రాశారు’’ అని స్నేహలత కుమార్తె నందనారెడ్డి రెండేళ్ల కిందట తన తల్లి ప్రాణాలను ఎమర్జెన్సీ ఎలా బలితీసుకుందో వివరిస్తూ రాసిన ఒక వ్యాసంలో తెలిపారు. నందనారెడ్డి బెంగళూరులో బాలల విద్య, హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు.
*** క్విట్ ఇండియా కాలం కన్నా రెట్టింపు మంది నిర్బంధం…
1975 జూన్ 25 రాత్రి మొదలుకుని.. 1977 మార్చి 21 వరకూ.. 21 నెలల పాటు కొనసాగిన ఆ ‘చీకటి రోజుల్లో’ దేశ వ్యాప్తంగా 1,10,806 మందిని మీసా తదితర చట్టాల కింద ఎలాంటి దర్యాప్తూ విచారణా లేకుండా అరెస్ట్ చేశారు. ఇది ఎమర్జెన్సీ మీద ఏర్పాటైన జస్టిస్ షా కమిషన్ నివేదికలోని లెక్క.
ఇది.. స్వాతంత్ర్య పోరాటంలో 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో భారత ఉపఖండ వ్యాప్తంగా బ్రిటిష్ పాలకులు అరెస్ట్ చేసిన ఉద్యమకారుల కన్నా రెట్టింపు అని పలువురు నిపుణుల అంచనా. ప్రతిపక్ష పార్టీల నాయకులు, నిషేధిత సంస్థలతో సంబంధాలున్నాయన్న అనుమానితులు, హక్కుల కార్యకర్తలు, ఉద్యమకారులు, కళాకారులు.. ఇలా నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారిని ఎలాంటి దర్యాప్తు, విచారణ లేకుండా అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టారు. అలాంటి నిర్బంధితుల్లో స్నేహలతారెడ్డి ఒకరు. కారణం.. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ క్రియాశీలంగా పనిచేయటం.. రామ్‌మనోహర్ లోహియా, జార్జి ఫెర్నాండెజ్ వంటి సోషలిస్టు నాయకులకు సన్నిహితంగా ఉండటం.
*** ఎవరీ స్నేహలత?
స్నేహలత తల్లి కశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం నుంచి, తండ్రి బెంగాలీ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. వారిద్దరూ భారతదేశంలో క్రైస్తవ మతానికి మారిన రెండో తరంలోని వారు. ఆమె తండ్రి బ్రిటిష్ సైన్యంలో మేజర్‌గా పనిచేసేవారు. 1925లో జన్మించిన స్నేహలతకు తొలుత వారు ఇంగ్లిష్ పేరే పెట్టారు.
‘‘బ్రిటిష్ వారిని, వలస పాలనను మా తల్లి వ్యతిరేకించారు. ఆమె భారతీయ పేరును పెట్టుకున్నారు. భారతీయ కట్టూబొట్టూ మాత్రమే ధరించారు. కట్టప్ప పిళ్లై దగ్గర నాట్యం అభ్యసించారు. మంచి నాట్యకళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు’’ అని నందనారెడ్డి పేర్కొన్నారు. మద్రాసులోని క్వీన్ మేరీ కాలేజీలో చదువుకున్న ఆమె ఒక కార్యక్రమంలో నాట్య ప్రదర్శన ఇచ్చారు. నెల్లూరుకు చెందిన ఓ సంపన్న భూస్వామి కుమారుడు తిక్కవరపు పఠాభి రామరెడ్డి ఆ ప్రదర్శన చూశారు. ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకునే వరకూ గడ్డం చేసుకోనని భీష్మించుకున్నారు. ఆ పఠాభి ప్రఖ్యాత తెలుగు కవి. సినీ దర్శకుడు. సామాజిక ఉద్యమకారుడు. కానీ వారి ప్రేమను ఆయన కుటుంబం అంగీకరించలేదు. దీంతో పఠాభి, స్నేహలతలు మద్రాసులోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ‘‘అడయార్ బీచ్‌లో ఒక చిన్న పాకలో నా తల్లిదండ్రులు జీవితం ప్రారంభించారు’’ అని నందనారెడ్డి తెలిపారు.
*** కళ – ఉద్యమాల కలబోత
పఠాభి, స్నేహలతలది కళా ప్రపంచం. ఆయన కవి, దర్శకుడు. ఆమె నాట్య కళాకారిణి, నటి. ఇద్దరివీ సోషలిస్టు భావాలు. రామ్ మనోహర్ లోహియాకు సన్నిహితులు. ఆయన ఆలోచనల ప్రభావానికి లోనైన వారు. ఇద్దరూ సామాజిక ఉద్యమకారులు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో కృషి చేసేవారు. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరూ మరికొందరితో కలిసి ‘మద్రాస్ ప్లేయర్స్’ అనే నాటక వేదికను స్థాపించారు. భారతీయ ఇంగ్లిష్ నాటకాల ప్రదర్శనకు ఆ సంస్థ పేరు గాంచింది. పఠాభి పెళ్లినాటి ప్రమాణాలు (1958), శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) సినిమాలు తీశారు. 1968 నాటి భాగ్యచక్రం సినిమా విఫలమవటంతో ఆయన ప్రధాన స్రవంతి సినిమాలకు దూరమయ్యారు. అనంతర కాలంలో పఠాభి, స్నేహలత బెంగళూరు నివాసమొచ్చారు. ప్రఖ్యాత కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి రచించిన ’సంస్కార‘ నవలను సినిమాగా తీశారు. దానికి పఠాభి దర్శకత్వం వహించగా ప్రధాన పాత్రలో గిరీశ్ కర్నాడ్, స్నేహలతలు నటించారు. 1970లో విడుదలైన ఆ సినిమా కన్నడ నుంచి మొట్టమొదటి జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందుకుంది. ఆ సినిమాలో వేశ్య పాత్ర పోషించిన స్నేహలత నటనకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ‘‘మా అమ్మ ‘సీత’ అనే సాహసోపేతమైన నాటకం రాసింది. అందులో రావణుడిని అత్యున్నతమైన పురుషుడిగా చిత్రీకరించింది. అందులో అతడు తన రాజ్యం కన్నా, తన ప్రాణం కన్నా సీతను ఎక్కువగా ప్రేమించాడని రాస్తాడు. రాముడేమో తన భార్య కన్నా గానీ తన రాచరికాన్ని, తన రాజ్యాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. మా ఇంట్లో ఇలాంటి విప్లవాత్మక ఆలోచనలు సాధారణంగా ఉండేవి’’ అని నందనారెడ్డి తన వ్యాసంలో తెలిపారు.
*** ఎమర్జెన్సీ.. అరెస్ట్…
మరోవైపు దేశంలో రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇందిరాగాంధీని గద్దె దించే నినాదంతో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఆ ఉద్యమంలో స్నేహలత కూడా పాలుపంచుకున్నారు. 1975 జూన్ 25వ తేదీన అర్థరాత్రి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. దానికి వ్యతిరేకంగా జార్జిఫెర్నాండెజ్ తదితరులతో స్నేహలత సన్నిహితంగా పనిచేశారు. ‘‘జార్జి ఫెర్నాండెజ్ అజ్ఞాతంలో ఉండగా.. రహస్య ఉద్యమం ప్రారంభించాలనే ప్రతిపాదనతో బెంగళూరు వచ్చారు. ఆయన దాక్కున్న చోట గది బయట గోడకు ఆనుకుని నేను కూర్చున్నాను. లోపల మా అమ్మ ఉద్యమం శాంతియుతంగా ఉండాలని బలంగా వాదిస్తుండటం వినిపిస్తోంది. ఫెర్నాండెజ్ కొంత హింస అవసరమని వాదిస్తున్నారు’’ అని నందనారెడ్డి చెప్పారు.
ఈ క్రమంలో 1976 మే 2వ తేదీన స్నేహలతను బెంగళూరులో అరెస్ట్ చేశారు. నిజానికి పఠాభి, స్నేహలతలు అప్పుడు మద్రాసులో ఉన్నారు. పోలీసులు వారి టీనేజీ కొడుకు కోణార్క్‌ను పట్టుకెళ్లారు. బెంగళూరులోని వారి ఇంటి మీద అర్ధరాత్రి దాడిచేసి సోదా జరిపారు.
స్నేహలత, పఠాభి హుటాహుటిన బెంగళూరు తిరిగివచ్చారు. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తన కొడుకు జాడ తెలియక స్నేహలత తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు లోనయ్యారు. ఇంకోవైపు మద్రాసులో ఉన్న వారి కుమార్తె నందనారెడ్డిని కూడా పోలీసులు నిర్బంధించి తీసుకువచ్చారు. ‘‘మమ్మల్ని ఒకరినొకరిని చూసుకోనివ్వలేదు. ఆందోళనతో తల్లడిల్లిన మా అమ్మ.. మమ్మల్ని (భర్త, పిల్లలను) వదిలివేస్తే పోలీసుల విచారణకు సహకరిస్తానని ప్రాధేయపడ్డారు. పోలీసులు మమ్మల్ని ఆమెకు చూపి ఇంటికి పంపించారు. ఆమె మమ్మల్ని వదిలేసేలా ఒప్పందం చేసుకున్న విషయం అప్పుడు కానీ మాకు తెలియలేదు’’ అని నందనారెడ్డి వివరించారు.
*** అదే జైలులో హేమాహేమీలు ఉన్నా…
బరోడా డైనమైట్ కేసులో జార్జి ఫెర్నాండెజ్‌తో పాటు స్నేహలతను కూడా నిందితురాలిగా చెప్తూ అరెస్ట్ చేశారు. కానీ చార్జిషీట్‌లో ఆమె పేరు లేదు. ఏ ఆధారాలూ లేవు. అయినా జైలు నిర్బంధంలోనే కొనసాగించారు. ఆమె హింసకు, వేధింపులకు గురయ్యారు.
‘‘అనవసరమైన ఈ వేధింపులతో మీరు సాధించేదేమిటి? మీ గౌరవం దిగజారుతుందంతే. చాలా సిగ్గుచేటు. ఒక మహిళను వేధించటం ద్వారా మీకు కేవలం వికృత ఆనందం లభిస్తుంది. ఇంకేమీ రాదు’’ అని స్నేహలత జైలులో ఉండగా రాసిన డైరీలో పేర్కొన్నారు.
బెంగళూరులోని సెంట్రల్ జైలులో ఆడ్వాణీ, వాజపేయి, రామకృష్ణ హెగ్డే, దేవెగౌడ వంటి చాలా మంది అగ్ర నాయకులు కూడా ఉన్నారు. వారందరూ కలిసి చర్చలు, యోగా, పుస్తకాలు చదవటం, తమ సొంత వంటలు చేసుకోవటం, అధ్యయన తరగతులు నిర్వహించటం వంటి కార్యకలాపాలు నిర్వహించుకునే వారు. ‘‘కానీ మా అమ్మ ఒక్కరే మహిళా రాజకీయ ఖైదీ. ఇతర మగ రాజకీయ ఖైదీలకు పూర్తిగా వేరుగా ఒంటరిగా ఉంచారు. ఆమె ఏకాకిగా ఉన్నారు. వారానికోసారి మేం వెళ్లి కలవటం తప్పితే ఎవరితోనూ సంబంధాలు ఉండేవి కాదు’’ అని నందనారెడ్డి తెలిపారు.
*** జైలులో సడలని సంకల్పం…
‘‘ఇక్కడ ఎవరూ తోడు లేరు. మగ కానీ, ఆడ కానీ ఎవరూ లేరు. నడిచే వీలు లేదు. గాలి లేదు. బయటి వారితో మాటల్లేవు’’ అని డైరీలో మరో రోజు రాశారు.
స్నేహలత నిర్బంధంలోనూ ధిక్కార స్వరం వినిపించారు. ఆమె ఆస్తమా పేషెంట్. జైలులోని అమానవీయ పరిస్థితుల్లో ఆరోగ్యం ఇంకా దెబ్బతిన్నది. అయినా తన తోటి మహిళా ఖైదీల కోసం ఉద్యమించారు. ‘‘పొద్దుట్నుంచి రాత్రి వరకూ ఒకటే అరుపులు. బెదిరింపులు. ఇద్దరు యువతులను కొట్టారు. ఒకరి తలను గోడకేసి కొట్టారు. మరొకరి తల మీద కర్రతో పదే పదే కొట్టారు. ఆ యువతుల ఒళ్లంతా వాపులే‘‘ అని డైరీలో ఒక రోజున ఆమె రాశారు.
‘‘ఇక్కడ కనీసం ఒకటి సాధించగలిగాను. మహిళలను దారుణంగా కొట్టటాన్ని ఆపాను. ఆహారం కొద్దిగా మెరుగైంది. నీటి సరఫరా దారుణంగా ఉన్నా కూడా.. పైపులు కనెక్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యువతుల్లో భయం కాస్త తగ్గించాను. ఆహారం మెరుగయ్యే వరకూ నేను నిరాహార దీక్ష చేశాను’’ అని 1976 జూన్ 9వ తేదీన రాశారు. ‘‘ఈ విపరీత ధోరణులకు బాధ్యత ఎవరిది? జైళ్ల సూపరింటెండెంట్లు, ఐజీలు పరిస్థితులను మెరుగుపరచాలి కదా? ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ప్రయోజనం ఏమిటి? మానవజాతిని సంపూర్ణతకు మరింత చేరువగా తీసుకెళ్లటం కాదా? ఒక మనిషి ఎలా పుట్టినా కానీ మానవ ఆలోచనలు, అభిప్రాయాల్లో సాధ్యమైన అన్ని మార్గాల్లోనూ ప్రమాణాలను పెంచటం అతడి కర్తవ్యం’’ అని కూడా ఆమె రాశారు.
జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదులు చేయటం, నిరాహార దీక్ష చేపట్టటం వంటి చర్యలతో.. మహిళా ఖైదీల మీద వేధింపులు ఆప్టానికి, వారికి మెరుగైన ఆహారం అందించటానికి కృషి చేసి విజయం సాధించారు.
*** విషమించిన ఆరోగ్యం…
కానీ ఆమె విషయంలో మాత్రం జైలు అధికారులు కఠినంగా వ్యవహరించారు. ‘‘ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం – నేను నెమ్మదిగా ఇక్కడే.. గత కాలపు విస్మృత గీతంలా.. చనిపోతాను. నేను ఇలా బహిరంగంగా చనిపోయేలా వీరు ఎందుకు బలవంతం చేస్తున్నారు?’’ అని స్నేహలత తన వాస్తవ పరిస్థితిని మరొక డైరీలో రాశారు. ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఆస్తమా అంతకంతకూ తీవ్రమవుతోంది. నలుగురు వైద్యులు ఆమెను పరీక్షించారు. ఆమెను వైద్య పరీక్షల కోసం విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లేవారు. తక్షణమే ఆస్పత్రిలో చేర్చాలని సూచించారు. కానీ జైలు అధికారులు పట్టించుకోలేదు. ‘‘భయానకమైన రోజులు… చిమ్మచీకటిలో మునిగిన ఆత్మకు ప్రతి రోజూ సమయం రాత్రి మూడు గంటలే. నాకు చనిపోవాలనిపించే.. నిజంగా చనిపోవాలనిపించే సమయమిది’’ అని స్నేహలత తన జైలు డైరీలో రాసిన వాక్యం పరిస్థితికి అద్దం పడుతుంది. ఆమెతోపాటు అదే జైలులో ఉన్న ఎంపీ మధు దండావతే.. ‘‘స్నేహలత అనారోగ్యంతో ఎంత బాధపడుతున్నారో రాత్రివేళ ఆమె రోదన మా గదుల వరకూ వినిపించేది’’ అని జైలు జీవితం మీద రాసిన పుస్తకంలో వివరించారు.
*** మరణానికి ముందు విడుదల…
స్నేహలత ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమించటంతో 1976 డిసెంబర్ 13వ తేదీన ఆమెను పెరోల్ మీద విడుదల చేశారు. కానీ.. కొద్ది రోజులకే 1977 జనవరి 20వ తేదీన ఆమె చనిపోయారు.
‘‘స్నేహలతను జైలుకు పంపించినపుడు.. ఆమె యవ్వనంలో చాలా ఉత్సాహంగా చురుకుగా ఉండేవారు. ఆమె బయటకు వచ్చేటప్పటికి వయసు మీరినట్లుగా ఉబ్బినట్లుగా ఉన్నారు.’’
సాంస్కృతిక, సామాజిక ఉద్యమాల్లోనే కాదు.. ఒక తల్లిగానూ స్నేహలతది ఎంతో స్ఫూర్తిదాయకమైన జీవితమని నందనారెడ్డి అంటారు. స్నేహలత జైలులో రాసిన డైరీని అనంతర కాలంలో ‘ఎ ప్రిజన్ డైరీ’ పేరుతో ప్రచురించారు.
‘‘నా చేతనను దెబ్బతీయగలమని మీరు అనుకుంటే.. మీరు పొరబడ్డారు. మీ ఈ చర్యలు.. సత్యం, మానవత్వం, స్వేచ్ఛలపై నా విశ్వాసాలను ఇంకా బలోపేతం చేస్తాయి. నా శరీరం ఈ అవమానాల బాధలకు గురికావచ్చు కానీ నా చేతనను.. మానవ చేతనను.. ఎంతో కాలం అణచివేయలేరు’’ అని అదే డైరీలో ఆమె పేర్కొన్నారు.