Movies

ఫ్లాపు దెబ్బలు

Rakul Preet Singh Realizes The Story After Flops

చిత్రం విచిత్రం అన్నట్టుగా సినిమా రంగం కూడా విచిత్రమే. ఇక్కడ రాత్రికి రాత్రే అందలం ఎక్కేవారూ ఉంటారు. సుధీర్ఘకాలంగా విజయం కోసం పోరాడుతున్న వారూ ఉన్నారు. ఎవరు? ఎలా? ఎప్పుడు విజయబాట పడతారో ఎవరికీ తెలియదు. నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నట జీవితం అంతే. ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఎందుకు సక్సెస్‌ కాలేకపోయిందో, టాలీవుడ్‌లో తను ఏం మారిందని సక్సెస్‌ అయ్యిందో తనకే తెలిసుండదు. వచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తూ, డిమాండ్‌ అండ్‌ సప్లై అన్న సామెత మాదిరి పారితోషికాన్ని పెంచుకుని చకచకా ఒక డజను చిత్రాలకు పైగా నటించేసింది. అంతే అక్కడ వరుస ఫ్లాప్‌లతో అవకాశాలు ముఖం చాటేశాయి. అలాంటి నటినిప్పుడు కోలీవుడ్‌ ఆదుకుంటోంది. ఇక్కడ ఒకే ఒక్క హిట్‌ను చవి చూసింది. అయినా శివకార్తికేయన్‌తో ఒక చిత్రం, తాజాగా శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో ఒక చిత్రంలోనూ నటిస్తోంది. దీంతో ఇటీవల కాస్త హడావుడి తగ్గించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఇప్పుడు మళ్లీ వార్తల్లో కనిపించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ బ్యూటీ ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని కోరికలను, భావాలనూ బయటపెట్టింది.

నాకు కథానాయకికి ప్రాముఖ్యత ఉన్న చిత్రాల్లో నటించడం ఇష్టం. అలాగని అలాంటి అవకాశాలు వచ్చే వరకూ కమర్శియల్‌ కథా చిత్రాల్లో నటించడానికి నిరాకరించను. అదే విధంగా కథానాయకికి ప్రాధాన్యత అంటే కథ అంతా ఆ పాత్ర చుట్టూనే తిరగాలని అర్థం కాదు. నేను ఇంతకు ముందు నటించిన చిత్రాల్లో కథానాయకి పాత్రకు ప్రాముఖ్యత ఉంది. అలాంటి చిత్రాలకు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న నమ్మకంతో నిర్మాతలు చిత్రాలు చేశారు. నిర్మాతలకు లాభం వస్తేనే వారు మళ్లీ చిత్రాలు చేయగలరు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు అవార్డు కోసం నిర్మించే కథా చిత్రాలు కమర్శియల్‌ అంశాలతో కూడి ఉండాలని భావిస్తున్నారు. నాకు అవార్డులు పొందాలన్న కోరిక ఉంది. అయితే అలాంటి చిత్రాల్లో ఇప్పుడే నటించాల్సిన అవసరం లేదు. నా సినీ జీవితం ఇంకా చాలా కాలం కొనసాగుతుందనే నమ్మకం ఉంది. కాబట్టి సమయం వచ్చినప్పుడు అవార్డు కథా చిత్రాల్లో నటిస్తాను. ప్రస్తుతం నేను సినిమాలో కొనసాగడమే ముఖ్యం అని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది. అయితే ఇప్పటి వరకూ అందాలను నమ్ముకునే నటించిన ఈ అమ్మడికి ఇప్పుడు అవార్డులు సాధించాలనే ఆశ ఎందుకు పుట్టుకొచ్చిందో అర్థం కాని విషయం.