చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంలోకి చేరిన అనంతరం కమ్యూనికేషన్ కోల్పోయిన ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడించింది. విక్రమ్ ల్యాండర్ ఉనికిని ఇస్రో గుర్తించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వీటిని ఇస్రో అధికారికంగా ధ్రువీకరించింది. ల్యాండర్‌ను ఆర్బిటర్ గుర్తించిందంటూ మంగళవారం ట్విటర్ వేదికగా పేర్కొంది. ‘చంద్రయాన్-2లోని ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది. కానీ ఇంకా దానితో కమ్యూనికేషన్ జరగలేదు. ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’ అని ఇస్రో నేడు ట్వీట్ చేసింది. కాగా.. ల్యాండర్ ఆకృతి చెక్కు చెదరకుండా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇస్రో అధికారి ఒకరు నిన్న చెప్పిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయ్యిందని, ఆ క్రమంలో అది ఒక పక్కకు ఒరిగిందని ఆయన అన్నారు. హార్డ్ ల్యాండ్ అయినప్పటికీ ల్యాండర్ విచ్ఛిన్నం కాలేదని అన్నారు. అయితే వీటిపై ఇస్రో నుంచి అధికారిక సమాచారం ఇంకా రాలేదు.
విక్రమ్ మాట్లాడమ్మా!

Related tags :